ఇన్నాళ్లూ థియేటర్లో విడుదలైన సినిమా ఇప్పుడు నట్టింట్లో.. ఓటీటీలో కొత్త సినిమా విడుదల కాబోతోంది. బుల్లితెరకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఓవర్ ది టాప్ ( ఓటీటీ ) .. ఇప్పుడు వెండితెరకే ప్రత్నామ్నాయం కాబోతుండడం నూతన పరిణామం.
కరోనావైరస్ లాక్ డౌన్ పరిస్థితుల్లో సినిమా తన విడుదలకు కొత్తదారులు వెతుక్కుంది. థియేటర్లు మూతపడడం, సినిమాలు విడుదల కాక నిర్మాతలపై వడ్డీల భారం అధికమవుతున్న నేపథ్యంలో ఓవర్ ద టాప్ (ఓటీటీ) వేదికలు కొత్తరూపు సంతరించుకున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు, మల్టీఫ్లెక్సులు తెరుచుకొనే పరిస్థితి లేకపోవడం, తెరుచుకున్న తరువాత కూడా ప్రేక్షకులు థియోటర్ల వైపు చూస్తారా! అన్న అనుమానం చిత్ర నిర్మాతలను ఓటీటీల వైపు చూసేలా చేస్తోంది.
ఓటీటీలపై ఇప్పటికే దేశంలో విపరీత క్రేజ్ ఏర్పడింది. ఈ ప్లాట్ ఫామ్‌లకు ఆకర్షితులైన వర్గాల కోసం కూడా దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్‌సిరీస్ తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకోసం ప్రాంతీయ భాషల్లో కూడా ఓటీటీలు పుట్టకొస్తున్నాయి.
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం, జీ 5, హాట్ స్టార్, ఎంఎక్స్‌ప్లేయర్, ఈరోస్ నౌ వంటి ఓటీటీ వేదికలు దేశీయ, అంతర్జాతీయ చిత్రాలను, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలను అందిస్తుంటే, కేవలం దక్షిణాది చిత్రాలతో సన్ నెక్ట్స్, కేవలం తెలుగు చిత్రాలతో ఆహా ఓటీటీ వేదికలు ఇప్పటికే ఆదరణ పొందాయి.
ఓటీటీలో కొత్త సినిమాల క్యూ
లాక్ డౌన్ సమయంలో ఓటీటీల ఆదరణ మరింత పెరిగింది. పెద్ద సినిమాలను కూడా నిర్మాతలు నేరుగా ఓటీటీ తెరపై విడుదల చేసేందుకు సిద్ధమయ్యేంతగా ఆదరణ పొందాయి. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, విద్యా బాలన్, జ్యోతిక, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రాలు త్వరలోనే ఓటీటీ వేదికలు ఎక్కనున్నాయి.
జోత్యిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం పొన్మగల్ వందళ్ మే 29న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
బిగ్ బి అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో ఏ రైసింగ్ సన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో షూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన గులాబో సితాబో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 12న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
ఇక కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పెంగ్విన్’ చిత్రం జూన్ 19న అమెజాన్ లో విడుదల కానుంది. అలాగే మానవ కంప్యూటర్ గా ప్రసిద్ధి చెందిన శంకుంతలా దేవీ జీవితం ఆధారంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్ కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
ఇక కన్నడలో కూడా లా, ఫ్రెంచ్ బిర్యానీ చిత్రాలు త్వరలోనే అమెజాన్ లో విడుదల కానున్నాయి.
ఓటీటీల్లో విడుదలపై వివాదాలు.. బెదిరింపులు
లాక్ డౌన్ పరిస్థితులు, వడ్డీ భారాలు వంటి కారణాలతో ఓటీటీ వేదికగా విడుదలవుతున్న చిత్రాలకు బెదిరింపులు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ విషయంలో ముందుగా జ్యోతిక నటించిన పొన్మగల్ వందళ్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించిన వెంటనే తమిళ థియేటర్ల యజమానుల నుంచి పెద్ద ఎత్తున బెదిరింపులే వచ్చాయి.
జ్యోతిక చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తే ఇక ఆమె చిత్రాలను ఎప్పటికీ థియేటర్లలో విడుదల చేయబోమని, అలాగే ఆ చిత్ర నిర్మాత అయిన జ్యోతిక భర్త సూర్య చిత్రాలను కూడా అడ్డుకుంటామని హెచ్చారించారు.
ఇక బాలీవుడ్ చిత్రాలకు కూడా ఇదే రకమైన అనుభవమే ఎదురైంది. అమితాబ్, ఆయుష్మాన్ ఖురానాల చిత్రం గులాబో సితాబో చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తామని చిత్ర నిర్మాతల చేసిన ప్రకటనను ఐనాక్స్ వంటి మల్టీఫ్లెక్స్ చైన్ సంస్థలు తప్పుబట్టాయి.
నిర్మాతల నిర్ణయాన్ని తప్పుబట్టడమే కాకుండా ప్రతీకార చర్యలు తీసుకుంటామని కొన్ని సంస్థలు పరోక్షంగా హెచ్చరించాయి. ఈ వ్యాఖ్యలను ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది.
ఇలాంటి వ్యాఖ్యలు సహకార సంప్రదింపులకు ఉపకరించబోవని ఆక్షేపించింది. ఇలా ఓటీటీ వేదికలపై పెద్దల సినిమాల విడుదలలో ఎన్ని వివాదాలు ఎదురైనా నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గడంలేదు.
ఓటీటీల్లో సినిమాలకు అనేక అనుకూలతలు
మల్టీఫ్లెక్స్‌లో సినిమా అనుభూతి దేవుడెరుగు.. కానీ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు మల్టీఫ్లెక్స్‌ల్లో సినిమా చూసేందుకు వెనకడుగు వేస్తున్నారు. టికెట్ ధర, పార్కింగ్ ధర, పాప్ కార్న్ ధర, కూల్ డ్రింక్ ధర.. ఒకటేమిటి.. ఏ ధరైనా త్రీడీ, ఫోర్‌డీలో కనిపిస్తోందని వాపోతున్నారు.
ఇప్పుడు పెద్ద పెద్ద తెరలు, అద్భుతమైన విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్ లతో రూ. 20 వేలు, రూ. 30 వేలల్లోనే యాండ్రాయిడ్ టీవీలు వస్తుండడంతో హాయిగా ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో సినిమా చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈరోజు కానిపక్షంలో తీరిగ్గా ఉన్న రోజుల్లో చూడొచ్చులే అన్న ధీమా కూడా ఉంటోంది.
అలాగే సినిమా నిర్మాతలు పైరసీ నుంచి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. తమ సినిమాలు విడుదలైన రోజే పైరసీకి గురవుతున్నాయని, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌ల్లో ప్రత్యేకంగా తాజా విడుదల చిత్రాలకు ఛానెళ్లు పెట్టి మరీ వాటిల్లో పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారని, ఆయా ఛానెళ్లలో 30 లక్షల వరకూ సభ్యులుగా ఉన్నారని వాపోతున్నారు.
వెబ్‌సిరీస్‌లు కూడా డౌన్‌లోడ్ చేసుకుని వీటిల్లో అప్ లోడ్ చేస్తున్నారు. డౌన్‌లోడ్ చేయలేని పరిస్థితి కల్పిస్తే ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలకు ఇక డోకా ఉండదు.
ఔత్సాహిక దర్శక, నిర్మాతలు కొత్త కొత్త సినిమాలతో సినీరంగంలోకి వస్తుండగా.. వారి సినిమాలు కొనేవాళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి ఓటీటీలు ఒక వరం.
భారీ బడ్జెట్ సినిమాల్లో కనిపించే అగ్ర తారాగణం.. ఇప్పటికే అనేక వెబ్ సిరీస్‌ల్లో తళుక్కుమన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నటులు ఇక వెబ్ సిరీస్‌లు తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తంగా ఓటీటీలకు పెరిగిన డిమాండ్ సినిమా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.
ఇవీ చదవండి