Home కెరీర్ ఇండియాలో బెస్ట్‌ జాబ్ వెబ్‌సైట్స్ ఇవే..

ఇండియాలో బెస్ట్‌ జాబ్ వెబ్‌సైట్స్ ఇవే..

job sites
Image by vishnu vijayan from Pixabay

ఇండియాలో ఉద్యోగాలకే కాదు.. వాటిని వెతికి పెట్టే జాబ్ వెబ్‌సైట్స్ కూడా డిమాండ్‌ ఎక్కువే. మరి వీటిలో బెస్ట్ జాబ్ వెబ్‌సైట్స్ ఏవి? చదువు పూర్తి చేసిన తర్వాత జాబ్‌ వెతుక్కోవడం ఎంత పెద్ద సమస్యో మీకు తెలుసు. అందులోనూ రొటీన్‌ కోర్సులు చేసేవాళ్లకు ఇంకా కష్టం. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్‌ కొట్టారో సరే. లేదంటే బయట ఉన్న కాంపిటిషన్‌ను తట్టుకొని నిలబడగలగాలి. అలాంటి వాళ్లకు ఈ జాబ్ వెబ్‌సైట్స్‌ బాగా ఉపయోగపడతాయి.

దీనికోసం మీరు చేయాల్సిందిల్లా టాప్ కంపెనీలను ఆకట్టుకునేలా మీ రెజ్యుమెను తయారు చేసుకోవడమే. సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు మీకున్న అదనపు నైపుణ్యాలను ఈ రెజ్యుమెలో జోడించి దానిని ఈ జాబ్ వెబ్‌సైట్స్ లో అప్‌లోడ్‌ చేయాలి. మీ ప్రొఫైల్‌కు తగిన జాబ్‌లను వాళ్లు వెతికి పెడతారు. మీ ప్రొఫైల్‌ ఎంత బలంగా ఉంటే.. అన్ని ఎక్కువ కంపెనీల నుంచి మీకు ఆఫర్లు వస్తుంటాయి. మీకు అందుబాటులో కొన్ని బెస్ట్ జాబ్ వెబ్‌సైట్స్‌ ఉన్నాయి. ముందుగా ఇందులో మీరు రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్‌ వెబ్‌సైట్స్‌లో కొన్ని టెక్‌ ఉద్యోగాలకు బాగా ఉపయోగపడతాయి. మరికొన్ని ప్రొఫెషనల్‌ కెరీర్‌ ఎంచుకునే వాళ్లకు సాయపడతాయి.

జాబ్‌ వెబ్‌సైట్‌ అంటే ఏంటి?

సింపుల్‌గా చెప్పాలంటే ఉద్యోగులు కావాల్సిన కంపెనీలకు, ఉద్యోగం కావాల్సిన అభ్యర్థులకు మధ్యవర్తిగా వ్యవహరించేదే ఈ జాబ్‌ వెబ్‌సైట్‌ లేదా ఎంప్లాయ్‌మెంట్‌ వెబ్‌సైట్‌. వీటిలో కంపెనీలు తమ దగ్గర ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు, వాటికి కావాల్సిన అర్హతలను ఉంచుతాయి. అదే సమయంలో అటు అభ్యర్థి కూడా తన నైపుణ్యాలతో కూడిన ఓ రెజ్యుమెను ఇందులో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ ప్రొఫైల్‌కు సరిపడిన ఉద్యోగాల వివరాలను ఎప్పటికప్పుడు సదరు వెబ్‌సైట్‌.. అభ్యర్థికి చేరవేస్తుంది. ఆ కంపెనీ, వాళ్ల జాబ్‌ ప్రొఫైల్‌ మీకు నచ్చితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్‌ వెబ్‌సైట్స్‌ కూడా వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే వీటిలో బెస్ట్‌ సైట్స్‌ కొన్ని ఉన్నాయి. అవేంటో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.

నౌక్రీ.కామ్‌ (Naukri.com)

కొత్తగా ఉద్యోగం కోసం వెతికే వాళ్లలో ఈ జాబ్‌ వెబ్‌సైట్‌ పేరు తెలియని వాళ్లు ఉండరు. ఇది అతిపెద్ద ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌. దాదాపు అన్ని రంగాలకు చెందిన కంపెనీలు, క్లైంట్స్‌ ఈ నౌక్రీ నెట్‌వర్క్‌లో ఉన్నారు. ఈ మధ్యే పెళ్లి, రియల్‌ ఎస్టేట్‌ రంగాలను కొత్తగా ఇందులో యాడ్‌ చేశారు. 1997లో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌.. ఇండియాలో టాప్‌ జాబ్‌ సైట్‌గా నిలిచింది. ఇందులో జాబ్‌ మెసెంజర్‌ అనే ఫీచర్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్న యూజర్లకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని పంపిస్తారు.

ఈ వెబ్‌సైట్‌లో ఐఐటీ/ఐఐఎం జాబ్స్‌, గవర్న్‌మెంట్‌ జాబ్స్‌, ఇంటర్నేషనల్‌ జాబ్స్‌, వాకిన్‌ జాబ్స్‌ అంటూ వేటికవే ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు కావాల్సిన వాటిని సులువుగా ఎంపిక చేసుకోవచ్చు. నౌక్రీ టెక్ట్స్‌ రెజ్యుమె పేరుతో ఇంటర్వ్యూ కాల్‌కు కీలకమైన రెజ్యుమె ఎలా తయారు చేయాలన్నదానిపై కూడా ఈ వెబ్‌సైట్‌ సూచనలు చేస్తోంది. అయితే దీనికి అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూకి ఎలా సిద్ధం కావాలి, టాప్‌ కోర్సులు, కాలేజీలు ఏంటి అన్న వివరాలు కూడా ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశ, విదేశాల్లోని టాప్‌ కంపెనీలన్నింటితో ఈ జాబ్‌ వెబ్‌సైట్‌కు ఒప్పందం ఉండటంతో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే వీలుంటుంది. https://www.naukri.com/ లోకి వెళ్లి రిజిస్టర్‌ చేసుకోండి. మీ రెజ్యుమెను అప్‌లోడ్‌ చేయండి.

మాన్‌స్టర్‌.కామ్‌ (monster.com)

ఇండియాలోని టాప్‌ జాబ్‌ వెబ్‌సైట్స్‌ లో ఇది కూడా ఒకటి. నౌక్రీ తర్వాత అత్యంత ఆదరణ పొందిన జాబ్‌ సైట్‌ ఇది. కేవలం మీకు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే కాదు.. కెరీర్‌కు సంబంధించిన టిప్స్‌, రెజ్యుమె ప్రిపరేషన్‌పై కూడా సూచనలు, సలహాలు అందించడం మాన్‌స్టర్‌ ప్రత్యేకత. ఎక్స్‌ప్రెస్‌ రెజ్యుమె+ పేరుతో ఇందులో ఓ ఆప్షన్‌ ఉంది.

అదనంగా కొంత డబ్బు చెల్లిస్తే.. ఇండియాలో లేదా గల్ఫ్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ల రెజ్యుమెను టాప్‌ కంపెనీలకు అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల మీకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఇక రైట్‌ రెజ్యుమె పేరుతో కంపెనీలను ఆకర్షించేలా రెజ్యుమె తయారుచేసి ఇచ్చే సర్వీస్‌ను కూడా అందిస్తోంది. దీనికి కూడా వేరుగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

మీకు నచ్చిన కంపెనీ లేదా మీకున్న నైపుణ్యం లేదా మీరు మెచ్చిన రంగం ఆధారంగా ఉద్యోగాలు వెతుక్కునే అవకాశం కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉంది. https://www.monsterindia.com/ లోకి వెళ్లి రిజిస్టర్‌ చేసుకొని ఉద్యోగ వేట మొదలుపెట్టండి.

టైమ్స్‌జాబ్స్‌.కామ్‌ (timesjobs.com)

ఇండియాలోని టాప్‌ జాబ్ వెబ్‌సైట్స్ లో ఒకటిగా ఎదుగుతోంది ఈ టైమ్స్‌జాబ్స్‌.కామ్‌. టైమ్స్‌ గ్రూప్‌కు చెందిన సంస్థ ఇది. అటు ఉద్యోగార్థులకు, ఇటు కంపెనీలకు అద్భుతమైన అవకాశాలను ఈ వెబ్‌సైట్‌ కల్పిస్తోంది. దీని ద్వారా ఉద్యోగార్థులు నేరుగా ఆయా ఎంప్లాయర్స్‌తో కాంటాక్ట్‌ అయ్యే అవకాశం కూడా ఉంది. మీ ప్రొఫైల్‌ ఏంటి.. మీరు చేసే పని తాలూకు నమూనాను కూడా ఈ సందర్భంగా ఎంప్లాయర్స్‌కు చూపించే వీలుంటుంది.

లైవ్‌ చాట్‌ ఆప్షన్‌ కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉండటం విశేషం. ఈ లైవ్‌ చాట్‌ ద్వారా ఎప్పటికప్పుడు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తమ వెబ్‌సైట్‌లో ఏ ఫీల్డ్‌లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉంటారు. https://www.timesjobs.com/ లోకి వెళ్లి రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

షైన్‌.కామ్‌ (shine.com)

దేశంలోని ప్రముఖ పత్రిక అయిన హిందుస్థాన్‌ టైమ్స్‌ గ్రూప్‌కు చెందిన జాబ్‌ వెబ్‌సైట్‌ ఇది. నౌక్రీ, మాన్‌స్టర్‌లాంటి సైట్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. చాలా వరకు మల్టీ నేషనల్‌ కంపెనీలు ఉన్నత స్థాయి ఉద్యోగుల కోసం ఈ షైన్‌.కామ్‌లో వెతుకుతున్నాయి. అయితే ఈ సైట్‌ ప్రధానంగా ఇప్పటికే జాబ్‌ చేస్తూ.. కెరీర్‌లో మరో మెట్టు పైకి ఎక్కాలని చూస్తున్న వాళ్ల కోసం బాగా పనికొస్తోంది.

ఈ జాబ్‌ వెబ్‌సైట్‌కి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. టాప్‌ కంపెనీల్లో పని చేస్తున్న హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్స్‌, కెరీర్‌ అడ్వైజర్స్‌తో మీరు నేరుగా కాంటాక్ట్‌  కావచ్చు. వాళ్ల సూచనలు, సలహాల మేరకు మీ రెజ్యుమెను మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ రెజ్యుమెను షైన్‌.కామ్‌ టాప్‌ కంపెనీలకు ఫార్వర్డ్‌ చేస్తుంది. అయితే ఈ సర్వీసు కోసం మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీస్‌ అవసరం లేదనుకుంటే.. మీ రెజ్యుమెతోనే ఫ్రీగా ఎన్ని ఉద్యోగాల కోసమైనా ట్రై చేసుకునే వీలుంటుంది.

ఈ జాబ్‌ వెబ్‌సైట్‌లో ఇప్పటికే మూడు కోట్ల మంది రిజిస్టర్‌ చేసుకోవడం విశేషం. https://www.shine.com/ కి వెళ్లి రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

ఫ్రెషర్ వరల్డ్‌.కామ్‌ (freshersworld.com)

పేరులోనే ఉన్నట్లు కెరీర్‌లో తొలి ఉద్యోగం చూస్తున్న ఫ్రెషర్స్‌ కోసం ఈ వెబ్‌సైట్‌ బాగా పనికొస్తుంది. కేవలం ఫ్రెషర్స్‌పైనే దృష్టిసారించడం వల్ల జాబ్‌ వెబ్‌సైట్స్‌లో ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ జాబ్‌ పోర్టల్‌లో కోటికిపైగా రెజ్యుమెలు అప్‌లోడ్‌ అయ్యాయి. అవన్నీ ఫ్రెషర్స్‌వే కావడం విశేషం. దేశ, విదేశాల్లోని పేరుగాంచిన ఎంఎన్‌సీలతోపాటు దేశంలోని వంద నగరాల్లో ఉన్న అత్యుత్తమ కంపెనీలతో ఈ వెబ్‌సైట్‌కు సంబంధాలు ఉన్నాయి. అప్పుడే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్లకు ఈ టాప్‌ కంపెనీలు వెల్‌కమ్‌ చెబుతున్నాయి.

బేసిక్‌గా ఫ్రెషర్స్‌ కోసం కావడంతో వాళ్లకు ఉపయోగపడేలా కెరీర్‌ టిప్స్‌, వివిధ కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌ కోసం నిర్వహిస్తున్న టెస్టుల మోడల్‌ పేపర్లు, ఇంటర్వ్యూకి ప్రిపేరయ్యే విధానంలాంటి వాటిపై దృష్టి సారిస్తోంది. ప్రతి రోజు మెయిల్స్‌ రూపంలో మీకు జాబ్ అలెర్ట్స్‌ కూడా వస్తాయి. అంతేకాకుండా ఈమెయిల్‌ న్యూస్‌లెటర్‌ ఆప్షన్‌ కూడా ఇందులో ఉంది. ఈ న్యూస్‌లెటర్‌లో కరెంట్‌ అఫైర్స్‌తోపాటు కార్పొరేట్‌, బిజినెస్‌ ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పే సమాచారం ఉంటుంది. ఇది ఇంటర్వ్యూల్లో మెరుగ్గా రాణించడానికి తోడ్పడతాయి. కొత్తగా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్లకు ఈ ఫ్రెష్‌వరల్డ్‌ నిజంగా బెస్ట్‌ ఆప్షన్‌. https://www.freshersworld.com/ లోకి వెళ్లి రిజిస్టర్‌ చేసుకోండి.

లింక్డిన్‌ (Linkedin)

ఇది మిగతా సాంప్రదాయ జాబ్‌ వెబ్‌సైట్లలాగా కాదు. కేవలం ప్రొఫెషనల్స్‌ కోసమే. ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న ప్రొఫెషనల్స్‌ మధ్య ఓ నెట్‌వర్క్‌ క్రియేట్‌ చేయడంతోపాటు బెటర్‌ జాబ్‌ ఆప్షన్స్‌ అందిస్తున్న వెబ్‌సైట్‌ ఇది. మీరు ఇందులో సొంత ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకొని, అదే రంగంలో ఉన్న ఇతర వ్యక్తులతో కనెక్ట్‌ కావచ్చు. ఇందులో ఎన్ని ఎక్కువ కనెక్షన్స్‌ మీకు ఉంటే.. అంత మంచి జాబ్‌ మీ సొంతమవుతుంది.

అప్పటికే ఆ రంగంలో ఉన్న ప్రొఫెషనల్స్‌ మిమ్మల్ని సదరు కంపెనీలకు రికమెండ్‌ చేసే వీలు ఇందులో ఉంటుంది. దీనివల్ల కెరీర్‌లో మరిన్ని మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. ప్రపంచంలోని అత్యుత్తమ వృత్తి నిపుణులను ఈ లింక్డిన్‌ ద్వారా నేరుగా కాంటాక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ స్కిల్స్‌ మరింత మెరుగవుతాయి. ప్రతిరోజూ మీ రంగంలో ఉన్న కొత్త కొత్త ఉద్యోగాల గురించి మీకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. పైగా ఒక్క క్లిక్‌తో మీ ప్రొఫైల్‌ను సదరు కంపెనీకి ఫార్వర్డ్‌ చేసే అవకాశం లింక్డిన్‌ కల్పిస్తోంది. ప్రత్యేకంగా ప్రతి ఉద్యోగానికి రెజ్యుమెలు అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

మీకు అనుభవం ఉన్న రంగంపై బ్లాగ్‌ పోస్ట్‌లు రాసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇతరులు రాసిన వాటిని మీరు కూడా చదవచ్చు. https://www.linkedin.com/ లోకి వెళ్లి రిజిస్టర్‌ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్‌ అవండి.

ఇండీడ్‌ (indeed)

ప్రపంచంలో దేని గురించి సెర్చ్‌ చేయాలన్నా మనం గూగుల్‌పైనే ఆధారపడతాం. సింపుల్‌గా మనకు ఏం కావాలో అది టైప్‌ చేస్తే చాలు.. దాని గురించిన పూర్తి సమాచారం మన ముందు ఉంటుంది. సరిగ్గా జాబ్‌ వెబ్‌సైట్స్‌లో ఇండీడ్‌ కూడా గూగుల్‌లాంటిదే. ఇతర జాబ్‌ వెబ్‌సైట్లలాగా ఇది గజిబిజిగా ఉండదు. ఇది అమెరికాకు చెందిన జాబ్‌ వెబ్‌సైట్‌. ప్రస్తుతం 60 దేశాల్లో సేవలందిస్తోంది.

ఈ ఇండీడ్‌ సైట్‌ ఓపెన్‌ చేయగానే మీకు ఏ జాబ్‌ కావాలి, ఎక్కడ కావాలి అన్న రెండు ప్రశ్నలు మాత్రమే అడుగుతుంది. దీనివల్ల కొత్తగా జాబ్ వెబ్‌సైట్స్ కు వచ్చే వాళ్లు సులువుగా తమకు కావాల్సిన ఉద్యోగ అవకాశాన్ని చూడగలుగుతారు. అంతేకాదు ఈ సైట్‌లో ఏ వృత్తి వారికి, దేశంలోని ఏ నగరంలో సగటున ఎంత జీతం వస్తుంది అన్న వివరాలు కూడా అందిస్తోంది. మీరు సింపుల్‌గా ఫైండ్‌ శాలరీస్‌పై క్లిక్‌ చేసి.. మీ వృత్తి నిపుణుడికి ఏ నగరంలో సగటు జీతం ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

అలాగే ఫైండ్‌ రెజ్యుమె ఆప్షన్‌ కూడా ఇండీడ్‌ అందిస్తోంది. దీనిద్వారా కంపెనీలు తమకు కావాల్సిన అభ్యర్థులను ఆయా రంగం, ప్రదేశాన్ని బట్టి సెర్చ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్లకు ఈ జాబ్‌ వెబ్‌సైట్‌ బెస్ట్‌ ఆప్షన్‌. https://www.indeed.co.in/?r=usలోకి వెళ్లి రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

జాబ్‌సర్కారీ (jobsarkari)

పేరులోనే ఉన్నట్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ల కోసం ఈ వెబ్‌సైట్‌. ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఉద్యోగాల్లో లక్షల జీతాలు సంపాదిస్తున్న వాళ్లు కూడా ఈ మధ్య గవర్న్‌మెంట్‌ జాబ్స్‌వైపు చూస్తున్నారు. ఉద్యోగ భద్రత దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు పబ్లిక్‌ సెక్టార్‌లో ఉన్న ఉద్యోగాల వివరాలను ఈ జాబ్‌సర్కారీ వెబ్‌సైట్‌ అందిస్తోంది. ఎప్పటికప్పుడు వెలువడే నోటిఫికేషన్ల వివరాలన్నీ ఇందులో చూడొచ్చు.  ఆయా ఉద్యోగాల వివరాలతోపాటు అడ్మిట్‌ కార్డులు, ఫలితాలను కూడా ఇందులో చూసుకునే వీలుంటుంది.

ఇండియన్‌ రైల్వేస్‌, ఇతర పబ్లిక్‌ సెక్టార్ బ్యాంకులు వెలువరించే నోటిఫికేషన్లను అత్యంత వేగంగా అభ్యర్థులకు చేరవేస్తోందీ జాబ్‌సర్కారీ వెబ్‌సైట్‌. మీ సొంత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నేరుగా సెర్చ్‌ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యం అయితే.. ఈ జాబ్‌ వెబ్‌సైట్‌ మీకు బెస్ట్‌ ఆప్షన్‌. https://www.jobsarkari.com/ లోకి వెళ్లి తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను చూడండి. జాబ్ వెబ్‌సైట్స్ లో ఉత్తమ మైన వెబ్ సైట్లు ఏవో తెలుసుకున్నారు కదా.. ఈ వివరాలు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయడం మరిచిపోకండి.

ఇవి కూడా చదవండి

♦ హాబీతో ఆదాయ మార్గాలు ఇవీ

♦ యూత్ మెచ్చే యాప్ తో డబ్బు సంపాదించండి

Exit mobile version