Home మనీ యూత్ మెచ్చే యాప్ తో డబ్బు సంపాదించండి

యూత్ మెచ్చే యాప్ తో డబ్బు సంపాదించండి

app
Image by ijmaki from Pixabay

యాప్‌.. ఈ స్మార్ట్‌ ప్రపంచంలో ఈ పదం తెలియని యువత ఉండదు. టీనేజ్‌లోనే చేతిలో స్మార్ట్‌ ఫోన్స్‌.. ఏ పని కావాలన్నా చేసి పెట్టే యాప్స్‌. నిత్య జీవితంలోని మన అవసరాలన్నింటికీ ఇప్పుడు ఒక్కో యాప్‌ అందుబాటులో ఉంది. ఇంకా రోజుకో యాప్‌ పుట్టుకొస్తూనే ఉంది. ముఖ్యంగా యువత.. అంటే.. 15 నుంచి 24 ఏళ్ల వయసు వాళ్లు ఎక్కువగా వాడే ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో.. వాళ్లకు నచ్చిన యాప్స్‌ను క్రియేట్‌ చేస్తేనే వాటికి మనుగడ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఓ అధ్యయనంలో ప్రతి రోజూ యువత సగటున 387 సార్లు తమ స్మార్ట్‌ఫోన్‌ చెక్‌ చేసుకుంటున్నట్లు తేలింది. దీనిని బట్టే యూత్‌ ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా ఓ యాప్‌ డెవలపర్‌ అయితే.. యూత్‌ మెచ్చే యాప్ తయారు చేయడం ముఖ్యమని గుర్తుంచుకోండి. మరి యూత్‌ను మెప్పించేలా యాప్‌ రూపొందించడం ఎలా? అసలు వాళ్ల అవసరాలేంటి? లక్షల సంఖ్యలో ఉన్న యాప్స్‌లో మీ యాప్‌ మనుగడ సాగించడం ఎలా.. ఈ అంశాలన్నింటినీ ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

యూత్ మెచ్చే యాప్స్‌ ఏంటి?

యువతకు ఎలాంటి యాప్స్‌ నచ్చుతున్నాయన్నదానిపై ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు జరిగాయి. వాటన్నింటి సారాంశాన్ని ఒకసారి చూస్తే.. ఏయే రకాల యాప్స్‌ను యువత బాగా ఫాలో అవుతున్నారో ఒకసారి చూద్దాం.

  • ఎంటర్‌టైన్‌మెంట్‌ (గేమ్స్‌, మ్యూజిక్‌, మూవీ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌)
  • సోషల్‌ నెట్‌వర్క్స్‌
  • మెసెంజర్‌/చాట్‌
  • ఫొటో ఎడిటర్స్‌
  • ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
  • హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌
  • లొకేషన్‌ ఆధారిత సర్వీసులు
  • లొకేషన్‌ ఆధారిత డేటింగ్‌ యాప్స్‌

 

ఇప్పటి యువతకు జీవితంపై ఓ స్పష్టత ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒక్కటే జీవితం కాదు.. తమ కెరీర్‌ను బిల్డ్‌ చేసుకోవడం.. సంపాదన మార్గాలు తెలుసుకోవడం.. ఫిట్‌గా ఉండటం.. సరైన లైఫ్‌ పార్ట్‌నర్‌ను ఎంపిక చేసుకోవడం.. ఇలా అన్నింటిపైనా వాళ్లకు క్లారిటీ ఉంది. వాళ్లకు కావాల్సిందల్లా.. సరైన గైడెన్స్‌. దీనికోసం యాప్స్‌పై ఆధారపడుతున్నారు. వాళ్ల ప్రశ్నలకు, సమస్యలకు సరైన సమాధానం, పరిష్కారాల కోసం వెతుకుతున్నారు. కూపన్స్‌, డిస్కౌంట్లు ఇచ్చే నమ్మదగిన యాప్స్‌, ఫిట్‌నెస్‌ ట్రాకింగ్ యాప్స్‌, చాట్‌ యాప్స్‌లాంటివి యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. అందుకే మీరు యాప్‌ డెవలప్‌ చేసే ముందు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి.

వాళ్ల అవసరాన్ని తీర్చేలా ఉండాలి

సమాజంలో వచ్చే మార్పులకు ఎక్కువగా ప్రభావితమయ్యేది యువతే. అలాగే కొత్త కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలకు ఊపిరిలూదేది కూడా వాళ్లే. అందువల్ల వాళ్ల ఆలోచనలు, అవసరాలను ప్రతిబింబించేలా యాప్‌ రూపొందించాల్సిన అవసరం ఉంది. వాళ్ల ఆలోచనలను పది మందితో పంచుకోవాలని అనుకుంటారు. తమ సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతుంటారు. వ్యక్తిగత విషయాలపై చర్చించి, వాటికి సలహాలు, సూచనలు ఇచ్చే యాప్‌ రూపొందిస్తే ప్రయోజనం ఉంటుంది.

సలహాలు, సూచనలు ఇచ్చేలా…

ఫిట్‌గా ఉండటానికి ప్రతిరోజూ ఎక్సర్‌సైజులు చేయాలని అనుకుంటారు. కానీ పొద్దున్నే లేవాలంటే బద్ధకం. కాస్త  మోటివేషన్‌ కావాలి. తనలాగే రోజూ జిమ్‌కు వెళ్లేవాళ్లతో కలుస్తూ, మాట్లాడుతూ ఉంటే బద్ధకం వదిలి వెళ్లాలన్న ఆసక్తి కలుగుతుంది. ఇలాంటి ఆలోచనతో వచ్చిందే వన్‌సెట్‌ సోషల్‌ మీడియా యాప్‌. ఇలాంటి వాళ్లందరినీ ఒక వేదికపైకి చేర్చేందుకు రూపొందించిన ఈ యాప్‌ సక్సెస్‌ అయింది. 

 తమ ఆలోచనలను నిర్భయంగా పంచుకోవాలి. కానీ పబ్లిగ్గా చెబితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అన్న బెరుకు ఉంటుంది. యిక్‌ యాక్‌, విస్పర్‌లాంటి సోషల్‌ మీడియా యాప్స్‌ ఇలా పుట్టుకొచ్చినవే. ప్రతి ఒక్కరూ ఈ యాప్స్‌లో తమ ఆలోచనలను నిర్భయంగా పంచుకోవచ్చు. వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉండటం వల్ల టెన్షన్‌ పడాల్సిన పనిలేదు. 

సంపాదన మార్గాలు చెప్పండి

సాధారణంగా 15  నుంచి 25 ఏళ్ల వయసులోపు ఉన్న వాళ్లకు ఎక్కువ సంపాదన ఉండదు. అప్పుడప్పుడే తమ చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌మనీ లేదా పార్ట్‌టైమ్‌ సంపాదనలతోనే ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇలాంటి వాళ్లను ఆకర్షించాలంటే.. మంచి మంచి డిస్కౌంట్లు, ఆఫర్లు, కూపన్లు, రివార్డులు ఇచ్చే యాప్‌ క్రియేట్‌ చేయడం మంచిది. ఈ స్మార్ట్‌ యుగంలో సంపాదించడానికి సాంప్రదాయ ఉద్యోగాలు, వ్యాపారాలే కాదు.. ఎన్నో ఇతర మార్గాలు ఉన్నాయి. యువత తమ డబ్బును ఆదా చేసుకోవడం, కొత్త మార్గాల్లో డబ్బు ఎలా సంపాదించాలో చెప్పే యాప్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఇలాంటి వాటిని ట్రై చేయండి. 

వినోదాన్ని పంచాలి

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ మన జీవితాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువైపోయింది. అందుకే స్మార్ట్‌ఫోన్స్‌లో మ్యూజిక్‌, గేమ్స్‌, సినిమాలు ఉండే యాప్స్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ వినోదం అంటే.. గేమ్స్‌, మ్యూజిక్‌, సినిమాలే కాదు. ఓ సీరియస్‌ యాప్‌ను క్రియేట్‌ చేసినా.. అది వాళ్లకు వినోదాన్ని పంచగలిగేలా ఉండాలి. అలాంటి యాప్‌ ఏదైనా సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాట్‌ యాప్స్‌లో ఈ మధ్య వాడుతున్న ఎమోజీలను యువత ఎంతలా ఇష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఎమోజీల ద్వారా తమ ఫీలింగ్స్‌ను ఒక్క బొమ్మతో చెప్పేయగలుగుతున్నారు. ఇది కూడా వాళ్లకు వినోదమే. ఇలాంటి వాటితో ఓ బ్యాంకింగ్‌ యాప్‌ను కూడా ఆసక్తికరంగా రూపొందించే అవకాశం ఉంటుంది. డబ్బు మీ అకౌంట్‌లోకి రాగానే ఎగిరి గంతేసే ఓ యానిమేటెడ్‌ బొమ్మను క్రియేట్‌ చేయండి. అది యూత్‌ను ఎంతగా ఆకర్షిస్తుందో చూడండి. ఒక్కమాటలో చెప్పాలంటే.. యాప్‌ ద్వారా వాళ్లు చేసే ప్రతి పనీ వాళ్లకు వినోదాన్ని పంచేలా తీర్చిదిద్దితే ప్రయోజనం ఉంటుంది. 

లక్ష్యాన్ని సాధించడంలో సాయపడండి

నేటి యువతకు కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. వాటిని సాధించాలనే పట్టుదల కూడా ఉంది. కెరీర్‌లో కావచ్చు.. వ్యక్తిగత జీవితంలో కావచ్చు.. సమాజానికి సేవ చేసే విషయంలో కావచ్చు.. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. కానీ వాటి కోసం ఏం చేయాలన్నదానిపై సరైన అవగాహన ఉండదు. ఇలాంటి వాటి కోసం చాలా మంది యువత.. యాప్స్‌పై ఆధారపడుతున్నారు. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే సాధనంగా యాప్స్‌ను భావిస్తున్నారు. ఆ దిశగా యువతకు సాయపడే యాప్స్‌ను రూపొందించే ఆలోచన చేయండి. వాళ్ల లక్ష్యాలను తెలుసుకొని, వాటికి అనుగుణంగా విలువైన సలహాలు, సూచనలు, నిపుణులతో శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేయండి. వన్‌ మిలియన్‌ డ్రీమ్స్‌ అనే యాప్‌ ఇలా సక్సెస్‌ సాధించిందే. 

చివరగా..

యూత్‌కు నచ్చే, వాళ్లు మెచ్చే యాప్‌ను రూపొందించాలని అనుకుంటే.. ఈ అంశాలను కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవడం మరచిపోవద్దు. కింది ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే.. మీ యాప్‌ యూత్‌ను ఆకర్షించేదే అవుతుంది.

  • మీ యాప్‌లో ప్రైవసీ ఫీచర్స్‌ ఉన్నాయా? వ్యక్తుల గోప్యతను కాపాడుతుందా?
  • యువతకు నచ్చే ఫిట్‌నెస్‌, ఎడ్యుకేషన్‌, ట్రావెల్‌, డేటింగ్, కెరీర్‌లాంటి అంశాలు ఉన్నాయా?
  • మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వినోదాన్ని పంచుతుందా?
  • వాళ్ల జీవితాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి సులువైన, చవకైన పరిష్కారం చూపగలుగుతుందా?
Exit mobile version