Home మనీ Home loan interest rates: బ్యాంకు వారీగా హోం లోన్ వడ్డీ రేట్లు ఇలా

Home loan interest rates: బ్యాంకు వారీగా హోం లోన్ వడ్డీ రేట్లు ఇలా

home loan
హోం లోన్లపై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు (image: Unsplash)

Home loan interest rates: హోం లోన్ వడ్డీ రేట్లు ఈ మధ్య కాలంలో భారీగా పెరిగాయి. ధరల పెరుగుదలను అరికట్టేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్ల(రెపో రేటు)ను నాలుగు విడుతలుగా 1.90 శాతం మేర వడ్డీ రేట్లను పెంచింది. అంటే ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు 4 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. దీనిని అనుసరిస్తూ బ్యాంకులు కూడా ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. రెపో రేటు పెరగకముందు హోం లోన్లు ఒక దశలో 6.10 శాతంగా ఉండేవి. కానీ ఇప్పుడు 8 శాతం నుంచి 9.50 శాతానికి పెరిగాయి. ఈ ప్రభావం ఇప్పటికే ఫ్లాట్లు, ఇళ్ల అమ్మకాలపై పడింది. ఇంతకుముందు పర్సన్ లోన్ వడ్డీ రేట్లు 10 శాతంగా ఉండేవి. ఇప్పుడు హోం లోన్ వడ్డీ రేట్లు వాటిని అందుకుంటున్నాయి.

SBI Home loan interest rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) హోం లోన్ ఎంత వడ్డీ రేటు ఎంత?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విభిన్న రకాలుగా హోంలోన్లు ఆఫర్ చేస్తోంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా హోం లోన్లపై 8.4 శాతం నుంచి 9.05 శాతం వరకు వసూలు చేస్తోంది. క్రెడిట్ స్కోరు 800 దాటితే మీకు తక్కువలో తక్కువ 8.4 శాతం వడ్డీ రేటు పడుతుంది. సిబిల్ స్కోర్ ఇంతకంటే తక్కువ ఉంటే వడ్డీ రేటు పెరిగిపోతుంది. అలాగే లోన్ అమౌంట్ రూ. 40 లక్షల కంటే పెరిగితే వడ్డీ రేటు కూడా పెరుగుతుంది.

HDFC bank home loan interest rate: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోం లోన్ వడ్డీ రేటు ఎంత?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా హోం లోన్లపై వడ్డీ రేట్లు బాగానే వసూలు చేస్తోంది. మహిళలైతే 8.60 శాతం నుంచి 8.65 శాతం వరకు ఆఫర్ చేస్తోంది. ఇతరులైతే రూ. 30 లక్షల లోపు రుణాలపై 9.1 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సిందే. ఒకవేళ లోన్ అమౌంట్ రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల మధ్య అయితే వడ్డీ రేటు 8.85 శాతం నుంచి 9.40 శాతం ఉంటుంది. సిబిల్ స్కోరు 800 పైన ఉంటే వడ్డీ రేటు 8.85 శాతం వర్తింపజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ICICI Bank home loan interest rate: ఐసీఐసీఐ బ్యాంక్ హోం లోన్ వడ్డీ రేటు ఎంత?

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా హోం లోన్లపై విభిన్న రకాల వడ్డీ రేట్లను వర్తింపజేస్తోంది. హోం లోన్ దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు అమలు చేస్తోంది. తక్కువలో తక్కువగా 8.4 శాతం, గరిష్టంగా 9.5 శాతం వడ్డీ రేట్లపై హోం లోన్లు అందిస్తోంది. హోం లోన్లలో ఐసీఐసీఐ బ్యాంక్ కూడా పాపులర్ బ్యాంక్‌గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఆమోదం పొందిన హౌజింగ్ ప్రాజెక్టులను సంబంధిత వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

PNB Home Loan Interest rate: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)హోం లోన్ వడ్డీ రేటు ఎంత?

ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) హోం లోన్లపై 8.20 శాతం నుంచి 9.35 శాతం మధ్య వడ్డీ రేట్లను వర్తింపజేస్తోంది. దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే రూ. 30 లక్షల లోపు రుణాలపై 8.65 శాతం వరకు వడ్డీ రేట్లు అమలు చేస్తోంది. క్రెడిట్ స్కోరు బాగా లేకుంటే మాత్రం గరిష్టంగా 9.35 శాతం వరకు వడ్డీ చెల్లించాలి.

Exit mobile version