Home పేరెంటింగ్ జూల్‌ పాడ్స్‌ .. సిగరెట్ల కన్నా డేంజర్‌..!

జూల్‌ పాడ్స్‌ .. సిగరెట్ల కన్నా డేంజర్‌..!

juul pod
Image by Kjerstin Michaela Haraldsen from Pixabay

జూల్‌ పాడ్స్‌ ( JUUL PODS ) .. ఇప్పుడు మన రాష్ట్రం, దేశమనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ వణికిస్తున్న వ్యసనమిది. సిగరెట్లు మానేయడానికి చాలా మంది ఈ-సిగరెట్లపై ఆధారపడుతుంటారు. ఈ జూల్‌ పాడ్స్‌ కూడా అలాంటివే. అయితే ఇవి సిగరెట్ల కన్నా డేంజర్‌. ఒక ప్యాకెట్‌ సిగరెట్లలో ఉండేంత నికొటిన్‌ ఒక్క జూల్‌ పాడ్‌లో ఉంటుంది. ఈ-సిగరెట్‌లాంటి ఈ జూల్‌పాడ్స్‌కు ఇప్పుడు టీనేజర్లు బానిసలవుతున్నారు. అరచేతిలో ఇమిడిపోయే వీటిని తల్లిదండ్రులకు కూడా తెలియకుండా చాలామంది పిల్లలు మెయింటేన్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలాంటి నగరాల్లోనూ చాలా మంది టీనేజర్లు జూల్‌ పాడ్స్‌ బారిన పడుతున్నారు. అసలు ఈ జూల్‌ పాడ్స్‌ ఉంటాయని కూడా చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. ఈ నేపథ్యంలో అసలేంటీ జూల్‌ పాడ్స్‌.. వీటి వల్ల జరిగే నష్టాలేంటి.. అన్నది ఇప్పుడు చూద్దాం.

జూల్‌ (JUUL) అంటే ఏంటి?

ఇదొక ఇన్‌హేలర్‌లాంటి డివైస్‌‌. సిగరెట్‌ను నోటితో ఎలా పీలుస్తారో ఇదీ అంతే. దీనిని గట్టిగా పీల్చగానే అందులోని లిక్విడ్‌ వేడెక్కి.. ఆవిరి రూపంలో లోనికి వెళ్తుంది. డివైస్‌కు ఓ కార్ట్రిడ్జ్‌ ఉంటుంది. దీనిని జూల్‌ పాడ్‌ అంటారు. ఈ పాడ్‌లలో కొంత మొత్తంలో లిక్విడ్‌ ఉంటుంది. ఇతర ఎలక్ట్రానిక్‌ డివైస్‌లలాగే ఈ జూల్‌ను చార్జ్‌ చేసుకోవచ్చు.

జూల్‌.. ఓ వ్యసనం

సిగరెట్‌లు మానేయడానికి చాలా మంది ఈ-సిగార్‌లపై ఆధారపడతారు. ఇది కూడా అలాంటిదే అయినా.. ఇందులో నికొటిన్‌ భారీ స్థాయిలో ఉంటుంది. ఒక పాడ్‌లోనే ప్యాకెట్‌ సిగరెట్లలో ఉండేంత నికొటిన్‌ ఉంటుంది. దీంతో జూల్‌ను అలవాటు చేసుకున్న వారు దానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. పైగా చాలా మంది చెయిన్‌ స్మోకర్ల కంటే ఎక్కువ నికొటిన్‌.. ఈ జూల్‌ పాడ్ల ద్వారా టీనేజ్‌లోనే పిల్లల శరీరాల్లోకి వెళ్లిపోతుంది.

ఆకర్షించే ఫ్లేవర్లతో చిత్తు

హైదరాబాద్‌ లాంటి నగరాల్లో యువత హుక్కాకు బానిసవడం మనం చూస్తూనే ఉన్నాం. రకరకాల ఫ్లేవర్స్‌తో ఈ హుక్కా యువతను చిత్తు చేస్తోంది. జూల్‌ కూడా అలాంటిదే. ఈ జూల్‌ పాడ్స్‌ కూడా రకరకాల ఆకర్షణీయమైన ఫ్లేవర్స్‌తో వస్తున్నాయి. దీంతో ఈ టేస్ట్‌కు టీనేజర్లు ఫిదా అయిపోతున్నారు. మింట్‌, ఫ్రూట్‌ ఫ్లేవర్స్‌.. తెలియకుండానే వాళ్ల శరీరాల్లోకి నికొటిన్‌ను తీసుకెళ్తున్నాయి. సిగరెట్లు డేంజర్‌ కానీ.. ఇలాంటి డివైస్‌లతో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని పిల్లలు అనుకుంటారు. కానీ వాటిలో నికొటిన్‌లాంటి ప్రమాదకర పదార్థంలో అందులో ఉంటుందని తెలియదు. ఫ్లేవర్లకు ఆకర్షితులై.. జూల్‌ పాడ్స్‌కు బానిసలవుతున్నారు. రాను రాను అదొక వ్యసనంలా మారిపోతోంది.

ఊపిరితిత్తులు, మెదడుకు ప్రమాదం

టీనేజర్లు ఈ జూల్‌ పాడ్స్‌ను వాడటం వల్ల వాళ్ల ఊపిరితిత్తులు, మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. టీనేజ్‌లో వాళ్ల లంగ్స్‌ కానీ, బ్రెయిన్‌ కానీ ఇంకా పూర్తిగా వృద్ధి చెంది ఉండవు. ఇలాంటి సమయంలోనే జూల్‌లాంటి ఈ-సిగరెట్ల వల్ల వాళ్లు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడుతున్నారు. జూల్‌ పాడ్స్‌లో ఉండే నికొటిన్‌ మెదడులోని కీలకమైన కణాల వృద్ధిని దెబ్బ తీస్తుంది. ఇదొక వ్యసనంలా మారితే దాని నుంచి బయటపడటం చాలా కష్టమని డాక్టర్లు చెబుతున్నారు. మామూలు సిగరెట్ల కంటే ఒకటిన్నర రెట్లు వేగంగా ఈ జూల్‌ పాడ్స్‌.. నికొటిన్‌ను శరీరంలోకి పంపిస్తాయి.

ఈజీగా దొరికేస్తున్నాయి

జూల్‌ పాడ్స్‌ను వాడే వారి సంఖ్య ఏపీ, తెలంగాణాల్లో వేగంగా పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఏపీలోనే ఈ జూల్‌ పాడ్స్‌ బారిన పడిన టీనేజర్లు ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఏపీలోని ఆరు జిల్లాల్లో ఈ వ్యసనం అధికంగా ఉంది. హైదరాబాద్‌లాంటి నగరాల్లో జూల్‌ పాడ్స్‌ లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉండటంతో యువత చేతికి ఈజీగా వచ్చేస్తున్నాయి. సుమారు రూ. 4 వేలకు ఆన్‌లైన్‌లో ఈ జూల్‌ డివైస్‌ను అమ్ముతున్నారు. ఈ డివైస్‌లో ఉంచే కార్ట్రిడ్జ్‌లను పాడ్స్‌ అంటారు. నాలుగు పాడ్స్‌ రూ. 1250కి అందుబాటులో ఉన్నాయి.

ఎలా బయటపడేది?

సిగరెట్ల కన్నా ప్రమాదకరమైన ఈ జూల్‌ పాడ్స్‌ బారిన తమ పిల్లలు పడుతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. మీ పిల్లల దగ్గర కూడా ఈ డివైస్‌ ఉందేమో చూడండి. దాని వల్ల జరిగే నష్టాల గురించి తెలియకే చాలా మంది టీనేజర్లు వాడుతున్నారు. అందువల్ల వాళ్లను కూర్చోబెట్టి.. ఈ జూల్‌ పాడ్స్‌ ఎంత ప్రమాదమో వివరించే ప్రయత్నం చేయండి. అందులోని నికొటిన్‌ భవిష్యత్తులో వారిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తుందో చెప్పండి.

నిపుణులు ఏమంటున్నారు?

ఈ-సిగరెట్ల వ్యసనం నుంచి విజయవంతంగా బయటపడిన టీనేజర్లు, కాలేజీ విద్యార్థులతో కొందరు నిపుణులు మాట్లాడి వాళ్ల అభిప్రాయాలు సేకరించారు. ఈ జూల్‌ పాడ్స్‌ బారి నుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలో చెబుతూ ఓ ఫ్రీ టెక్ట్స్‌ మెసేజ్‌ ప్రోగ్రామ్‌ను వాళ్లు ప్రారంభించారు. దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే.. DITCHJUUL అని టైప్‌ చేసి 88709కి ఎస్‌ఎంఎస్‌ చేయండి. లేదంటే This is Quitting, BecomeAnEX లాంటి వెబ్‌సైట్లలోకి వెళ్లి చూడండి.

Exit mobile version