Home హెల్త్ లాక్టోజ్ ఇంటోలరెన్స్: కన్నబిడ్డకు తల్లిపాలే పడకపోతే..?

లాక్టోజ్ ఇంటోలరెన్స్: కన్నబిడ్డకు తల్లిపాలే పడకపోతే..?

mother child
Photo by Aditya Romansa on Unsplash

అమృతంతో పోల్చే అమ్మపాలు కూడా ఒక్కోసారి కన్నబిడ్డకు హాని చేస్తాయి. ఆ హాని పేరే ‘లాక్టోజ్ ఇంటోలరెన్స్’. చంటిబిడ్డల పాలిట శాపం ఇది. ఎన్ని బంధాలున్నా తల్లీబిడ్డల అనుబంధం అనిర్వచనీయమైనది. వారి బంధం మరింత బలపడేది తల్లిపాలను బిడ్డకు అందించడంతోనే. కాస్త అవగాహన ఉంటే లాక్టోజ్ ఇంటోలరెన్స్ బారి నుంచి సులువుగానే బిడ్డను కాపాడుకోవచ్చు. నిజానికి ఈ సమస్య పెద్దల్లో కూడా ఉంటుంది. కానీ పెద్దగా ప్రభావం చూపించదు. కానీ రోజులు, నెలల పిల్లల్లో మాత్రం ఈ సమస్య కాస్త కలవరపెట్టేదే. 

లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య గురించి చాలా తక్కువ మందే వినుంటారు. కానీ సమస్య మాత్రం ఈనాటిది కాదు. పూర్వం నుంచీ ఉంది. దీనిపై అవగాహన లేక చంటి పిల్లల పరిస్థితి చేయిదాటిపోయేది. మరణాలు కూడా సంభవించేవి. ఆధునిక కాలంలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేలా నేటి వైద్య శాస్త్రం ఎదిగింది.

కానీ ఇప్పటికీ ఈ సమస్యకు చికిత్స ఉంది కానీ ఔషధాలు లేవు. అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే సమస్య కారకాన్ని సమూలంగా నిర్మూలించే మందులు లేవు.. ఆ సమస్యను తగ్గించి పిల్లల ప్రాణాలను కాపాడే చికిత్స విధానాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. 

లాక్టోజ్ ఇంటోలరెన్స్ లక్షణాలేంటి?

పుట్టుకతోనే మన పేగుల్లో లాక్టోజ్ అనే చక్కెర (ఎంజైమ్) ఉంటుంది. ఇది పాలల్లో ఉండే లాక్టోజెన్ అనే పదార్థాన్ని అరిగిస్తుంది. లాక్టోజెన్ తల్లిపాలతో పాటూ, ఆవు, గేదె పాలల్లో కూడా ఉంటుంది. లాక్టోజెన్ను అరిగించే లాక్టోజ్ కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే లోపిస్తుంది.

దీని వల్ల తల్లిపాలు తాగాక ఆ పాలు అరగక చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. ప్రపంచంలో దాదాపు 50 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య ఉంటుంది. పుట్టుకతోనే వచ్చే ఈ ఎలర్జీని ‘కంజెనిటల్ లాక్టోజెన్ ఇంటాలరెన్స్’ అంటారు. 

లాక్టోజన్ ఇంటాలరెన్స్ లక్షణాలు స్పష్టంగా ఉంటాయి.  పుట్టిన వారం తరువాత లేదా నెల తరువాత ఈ లక్షణాలు బయటపడతాయి. పాలు తాగిన తరువాత నీళ్ల విరేచనాలు అవ్వడం, తాగిన పాలు తాగినట్టే వాంతులు కావడం, పొట్ట ఉబ్బినట్టుగా ఉండడం, విపరీతంగా అపానవాయువు (గ్యాస్) బయటికి రావడం, పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తుండడం, బరువు సరిగా పెరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలా వాంతులు, విరేచనాలు కావడం వల్ల పిల్లలు త్వరగా డీ హైడ్రేషన్ కు గురవుతారు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇదొక సమస్య ఉందని చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు.

తల్లిపాలు పడకపోవడం ఏంటీ? అంటూ విమర్శలు, అనవసర చర్చలు కూడా ఇంట్లో మొదలవుతాయి. కానీ ఇది పచ్చినిజం. దీన్ని పట్టించుకోకుండా విరేచనాలు అవుతున్నా, వాంతులు అవుతున్నా, పొట్ట ఉబ్బుతున్నా పట్టించుకోకపోతే బిడ్డ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది. అయితే ఈ విషయంలో ఊరటనిచ్చే విషయం ఏంటంటే… ఈ సమస్య చికిత్స క్లిష్టంగా ఉండదు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. 

లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎలా గుర్తిస్తారు?

శిశువు లాక్టోజ్ ఇంటాలరెన్స్ తో బాధపడుతున్నట్టు.. చూడగానే వైద్యుడు కూడా చెప్పలేరు. వాళ్లు పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తారు. చిన్నబిడ్డల్లో కేవలం మల పరీక్ష ద్వారానే ఈ సమస్యను నిర్ధారిస్తారు. మల పరీక్షలో పీహెచ్ విలువ 5.5 కన్నా తక్కువ వస్తే ఆ శిశువుకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య ఉన్నట్టు నిర్ధారిస్తారు. అదే పెద్దల్లో అయితే నిర్ధారించేందుకు నాలుగైదు రకాల పరీక్ష విధానాలు ఉన్నాయి.

చికిత్స ఏంటి?

పిల్లల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ లక్షణాలు కనిపించగానే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. వైద్యులు కొన్ని రోజుల పాటూ తల్లిపాలు ఆపి, లాక్టోజన్ లేని పాల మిశ్రమాన్ని పిల్లలకు పట్టమని చెప్పే అవకాశం ఉంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ బారిన పడిన పిల్లల కోసం లాక్టోజ్ లేని పాల పొడులు మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉంటున్నాయి.

వీటిలో కూడా పసిపిల్లలకు కావాల్సిన పోషకాలు నిండుగా ఉంటాయి. అలాగే విరేచనాలు ఆగేందుకు కూడా వైద్యులు మందులు ఇస్తారు. కేవలం అయిదు రోజుల్లో సమస్య తగ్గుముఖం పడుతుంది. మళ్లీ తల్లిపాలు పట్టొచ్చు. కానీ సమస్య మళ్లీ ప్రతి పదిహేను రోజులకోసారి లేదా నెల రోజులకోసారి ఎదురవుతుంది.

కనుక రోజులో పది సార్లు బిడ్డ పాలు తాగితే… ఓసారి తల్లిపాలు, మరోసారి లాక్టోజెన్ లేని పాల పొడిని కలిపి తాగిస్తే సమస్య ఎదురవ్వకుండా చూసుకోవచ్చు. కొందరి పిల్లల్లో ఏడాది వయసు దాటగానే లాక్టోజ్ను అరిగించుకునే శక్తి వచ్చేస్తుంది. మరికొందరిలో కేవలం ఆరునెలల వయసుకే ఆ శక్తి పుంజుకుంటుంది.

కొందరి పిల్లల్లో ఎప్పటికీ రాకపోవచ్చు. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అమెరికాలాంటి దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. అక్కడ చాలా మంది వృద్దాప్యంలో కూడా పాలలోని లాక్టోజన్ను అరిగించుకోలేక వాటికి దూరంగా ఉంటున్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుంది?

బిడ్డకు ప్రాణాంతకమైనప్పుడు తల్లి పాలను సైతం నిలిపివేయడమే ఉత్తమం. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్ధేశాల ప్రకారం లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య వల్ల పద్నాలుగు రోజుల పాటూ పసిపిల్లలకు ఆగకుండా వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు, తద్వారా బిడ్డ బరువు కోల్పోతున్నప్పుడు… తల్లి పాలను పూర్తిగా ఆపేయాలని చెబుతోంది. ప్రత్యామ్నాయాలైన పాలపొడులపై ఆధారపడాలని చెబుతోంది.


ఇవి కూడా చదవండి

  1. న్యూ పేరెంట్స్ బడ్జెట్ సిద్ధం చేయండిలా
  2. మంచి తల్లిదండ్రులుగా ఉండేందుకు మార్గాలు
  3. హైపర్ యాక్టివా? ఏడీహెచ్‌డీ ఉందా?

 

Exit mobile version