Home మనీ క్రెడిట్ కార్డ్ మిస్టేక్స్ .. ఈ 7 నివారించండి..

క్రెడిట్ కార్డ్ మిస్టేక్స్ .. ఈ 7 నివారించండి..

credit card mistakes

క్రెడిట్ కార్డ్ మిస్టేక్స్ తెలుసుకోవడం ద్వారా సమర్థవంతంగా దానిని ఉపయోగించవచ్చు. మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ వాడడంలో సాధారణంగా మనం చేసే పొరపాట్లను డియర్ అర్బన్ డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

1. కార్డు వివరాలు బహిర్గత పరచడం

క్రెడిట్ కార్డ్ మిస్టేక్స్ లో అందరూ సాధారణంగా చేసేది ఇదే. కార్డ్ వివరాలను ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైనా ఫోన్ కాల్ చేసి లాటరీ గెలుచుకున్నారని, క్రెడిట్ లిమిట్ పెరిగిందని, ఇంకా ఏదైనా చెప్పి కార్డ్ నెంబర్ ఇతర వివరాలు అడుగుతుంటారు. మీరు ఆయా వివరాలు చెబితే మోసం బారిన పడ్డట్టే.

ఒకసారి మీ నుంచి ఆ వివరాలు బయటకు వెళ్తే మీ క్రెడిట్ కార్డు మీద మొత్తం ఖర్చు చేసేస్తారు. అలాగే మనం షాపుల్లో క్లబ్బుల్లో ఇంకా ఎక్కడైనా రెస్టారెంట్లలో మన క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్ బంక్ వద్దా జాగ్రత్తగా ఉండాలి.

మన కళ్లముందే స్వైప్ చేయమని అడగడం చాలా ఉత్తమం. పిన్ నెంబర్ ఎవరికి ఇవ్వకపోవడం అత్యంత క్షేమకరం నాలుగు అడుగుల దూరం వేసి మనమే స్వైప్ మిషన్ దగ్గర బిల్లు కట్టడం చాలా ఉత్తమం. తద్వారా మానసిక ప్రశాంతత మన నుంచి దూరంగా వెళ్ళదు. కొన్ని అంతర్జాతీయ వెబ్ సైట్లు పిన్ నెంబర్ లేకుండా కూడా, కేవలం కార్డ్ నెంబర్, సీవీవీ నెంబర్ ద్వారా బిల్లింగ్ చేసేస్తాయి. ఇలాంటి సైట్లకు దూరంగా ఉండడం మేలు.

2. గడువు దగ్గరపడుతున్నా చెల్లించకపోవడం

రెండో అతి ముఖ్యమైన పొరపాటు క్రెడిట్ కార్డ్ బిల్లు గడువు దగ్గరపడుతున్నా చెల్లించకపోవడం. ప్రతి నెల క్రమం తప్పకుండా గడువు తేదీ కంటే రెండు మూడు రోజులు ముందే బిల్లు కట్టేయడం చాలా మంచిది.

మన బిల్ నెలవారీ అలర్ట్ వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఉంటే మంచిది. మన పని ఒత్తిడిలో ఉండి మరిచిపోతే బిల్లు పైన ఆలస్య రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు ఆలస్యంగా కట్టడంవల్ల కేవలం జరిమానా భారం,  వడ్డీ భారం మాత్రమే కాకుండా వచ్చే మాసంలో మనం వడ్డీరహిత రుణ వెసులుబాటును పొందలేం.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. భవిష్యత్తులో మనం పొందాల్సిన అన్ని రుణాల పైన ఈ క్రెడిట్ స్కోర్ ఇబ్బంది పెడుతుంది. బిల్లు తేదీ, గడువు తేదీ వంటివి గుర్తించుకోవడం ఇబ్బందికరం అని భావించినప్పుడు ఆటో డెబిట్ ద్వారా మన బ్యాంకు ఖాతా నుంచి నెలనెలా ఒక నిర్దిష్ట తేదీతో క్రెడిట్ కార్డ్ బిల్లు చేయొచ్చు. 

3. మినిమం బిల్లు కట్టేసి వదిలేయడం

కొన్నిసార్లు అత్యవసర ఖర్చుల వల్ల మన క్రెడిట్ కార్డ్ బిల్లు మన నెలవారీ బడ్జెట్ దాటి పోవచ్చు. అప్పుడు సాధారణంగా మనం చేసే పొరపాటు మినిమం బిల్లు కట్టేసి చేతులు దులుపుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా మీరు చెల్లించాల్సిన బకాయి పైన రెండు నుంచి నాలుగు శాతం వడ్డీ పడుతుంది.

అంటే ఇది దాదాపు 24 నుంచి 48 శాతం వార్షిక వడ్డీ రేటుకు సమానం. వాడుక భాషలో చెప్పాలంటే మీ రెండు రూపాయల వడ్డీ నుంచి 4 రూపాయల వడ్డీ వరకు అవుతుంది.

పైగా మన కార్డు పైన చెల్లించాల్సిన మొత్తం బకాయిగా ఉంటే మనం వడ్డీరహిత కొనుగోలు జరపలేం. అంటే మనం కార్డ్ వినియోగించినప్పుడు దాదాపు 50 రోజుల వరకు ఎలాంటి వడ్డీ రుసుము లేకుండా కొనుగోలు జరుపుకోవచ్చు కదా. మినిమం కట్టేసి ఊరుకుంటే ఈ వెసులుబాటు మనం కోల్పోతాం.

4. క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు విత్ డ్రా

అత్యంత మూల్యం చెల్లించాల్సిన క్రెడిట్ కార్డ్ మిస్టేక్స్ లో ఇదొకటి. కార్డ్ ద్వారా మనం నగదును ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకునేందుకు కంపెనీలు అవకాశం కల్పిస్తాయి. ఉదాహరణకు మన కార్డు పైన రూ. 1,50,000 క్రెడిట్ లిమిట్ ఫెసిలిటీ ఉంటే దాదాపుగా రూ. 40 వేల వరకు మనం నగదు ఏటీఎం నుంచి తీసుకోగలిగే సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ సౌకర్యం ఉంది కదా అని వాడుకుంటే కార్డ్ సంస్థలు మనల్ని వాడేసుకుంటాయి.

ఎందుకంటే కార్డ్ నుంచి మనము నగదు స్వీకరిస్తే చాలా చాలా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. మనం తీసుకున్న నగదు మొత్తంలో రెండున్నర శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అలాగే తీసుకున్న మొత్తం పైన రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయల వరకు వడ్డీ ఉంటుంది.

మామూలుగా కార్డ్ ఉపయోగించినప్పుడు బిల్లింగ్ తేదీ నుంచి 50 రోజుల వరకు వడ్డీరహిత వినియోగ వెసులుబాటు ఉంటుంది. కానీ నగదు స్వీకరించినప్పుడు స్వీకరించిన మరుక్షణం నుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉండి నగదు తీసుకోవాల్సి వస్తే అదనపు ఫీజులు ఉంటాయి.

5. రివార్డుల కోసం క్రెడిట్ కార్డ్ వినియోగించడం

మన మిత్రులు మనం ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మన దగ్గర నుంచి నగదు తీసుకుని వాళ్ల క్రెడిట్ కార్డ్ మీద బిల్లు కట్టేస్తారు. వాళ్లకు కొన్ని రివార్డ్ పాయింట్లు లభిస్తాయని అలా చేస్తారు. కార్డ్ మీద మనం ఎక్కువ ఖర్చు చేస్తే అలా క్రెడిట్ కార్డ్ సంస్థలు ఈ రివార్డు పాయింట్లు ఇచ్చి ప్రోత్సహిస్తాయి.

కానీ ఇది మంచిది కాదు. అనవసరంగా మన క్రెడిట్ కార్డ్ లిమిట్ మనం వాడుకున్నట్టు అవుతుంది. ఈ రివార్డ్ పాయింట్లను కూడా మనం ఏడాదికోసారి వినియోగించుకోవడం మేలు.

6. పూర్తి లిమిట్ వాడేసుకోవడం

ఫుల్ లిమిట్ వాడుకోవడం వల్ల మన క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. తద్వారా మన క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. అనవసరంగా ఖర్చు చేస్తారనే అపోహ వల్ల మనకు రుణ వితరణ సంస్థలు రుణాలను ఇచ్చేందుకు ముందుకు రావు.

7. ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డు లో వాడడం

క్రెడిట్ కార్డ్ మిస్టేక్స్ లో అందరూ చేసే పొరపాటే ఇది. ఎక్కువ సంఖ్యలో కార్డులు వాడడం వల్ల కొంత మేలు జరుగుతుంది కానీ వీటిపై మనకు పూర్తి నియంత్రణ ఉన్నప్పుడే అలా వినియోగించడం మంచిది.

ఉదాహరణకు ఈ కామర్స్ వెబ్ సైట్లు సరుకుల కొనుగోలుపై ఫలానా క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా నెలనెలా ఆఫర్లు ఇస్తుంది అని అనుకుందాం. కానీ ఆ ఆఫర్ శాశ్వతంగా ఉంటుందా? ఉండకపోవచ్చు. ఉంటుందనే నమ్మకం ఉన్నప్పుడు మనం ఆ క్రెడిట్ కార్డు కూడా తీసుకోవచ్చు.

కానీ 1 నుంచి 3 కు మించి కార్డులు ఉండడం వల్ల మనం వాటిని సరైన స్థాయిలో నియంత్రించలేం. జీవితాన్ని సింపుల్ గా మార్చుకోవడం ఇబ్బందిగా పరిణమిస్తుంది. క్రెడిట్ కార్డులు మన జీవనయానాన్ని సులభతరం చేయాలి. కానీ సంక్లిష్టంగా మార్చకూడదు.

ఇవి కూడా చదవండి

 

Exit mobile version