మీ ఆర్థిక తప్పిదాలు (ఫైనాన్షియల్ మిస్టేక్స్) మీకు తెలియకపోవడం వల్లే నెలకు ఆరంకెల సంపాదన ఉన్నా.. అప్పుల పాలవుతున్నారు. కొందరిది అతి జాగ్రత్త అయితే.. మరి కొందరిది లెక్కలేనితనం. కొందరు తమ సంపాదనను ఇంట్లోనే మూటలు కట్టిపెడుతుంటే.. మరికొందరు అనవసరమైన ఖర్చు చేస్తున్నారు.
నిజానికి ఈ రెండింటితోనూ నష్టమే. మన దేశంలో చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయంటే దానికి కారణం.. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ తెలియకపోవడమే. డబ్బు విషయంలో చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ చేతులు కాల్చుకోవడం ఓ అలవాటుగా మారింది.
డబ్బుల విషయంలో అసలు మనం చేస్తున్నతప్పులేంటో తెలుసుకుంటే.. మన ఆర్థిక సమస్యలకు సగం పరిష్కారం దొరికినట్లే. డియర్ అర్బన్ డాట్ కామ్ మీకోసం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ..
ఖర్చుకు లెక్కేది?
♦ రెండు చేతులా సంపాదిస్తున్నాం కదా అని అంతకు మించిన స్థాయిలో ఖర్చు పెట్టేస్తుంటాం. ఎవరైనా డిస్కౌంట్ అంటే చాలు ఎగబడి కొనేస్తాం. అది మనకు అవసరమా కాదా అన్నది కూడా పట్టించుకోం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో సేల్ అని కనిపిస్తే చాలు.. ఆర్డర్ చేసేస్తాం. నిజానికి మన వీక్‌నెసే వాళ్లకు పెట్టుబడి. అందుకే వీళ్లు దాదాపు ప్రతి నెలా ఏదో ఒక సేల్ పెడుతూనే ఉంటారు.
♦ ఇక ఏడాదంతా కష్టపడి ఉద్యోగంలో హైక్ సంపాదిస్తాం. బోనస్‌లూ అందుకుంటాం. కానీ జీతం పెరిగింది కదా అని లగ్జరీల వైపు చూస్తాం. చిన్న ఇల్లు వదిలేసి పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవడం.. చిన్న కారు పక్కన పడేసి పెద్ద కారు కొనడంలాంటివి. ఇలా చేస్తూ పోతే ఇక సేవింగ్స్ ఎక్కడ ఉంటాయి?
♦ ఎవరైనా సోషల్ మీడియాలో ఆ టూర్‌కి వెళ్లొచ్చాం.. సూపర్‌గా ఉంది తెలుసా అని చెబితే చాలు.. ఖర్చుకు కూడా వెనుకాడకుండా వెంటనే లగేజ్ సర్దేస్తాం. తీరా వెళ్లొచ్చాక ఖర్చు లెక్కలు వేసుకొని బాధపడుతుంటాం.
♦ ఐదు రోజులు చాలా కష్టపడిపోయాం.. వీకెండ్ రెండు రోజులు తెగ ఎంజాయ్ చేసి రిలాక్స్ కావాల్సిందే అనుకుంటాం. వీకెండ్ పార్టీల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టేస్తాం. నెల తిరగ్గానే చేతిలో చిల్లగవ్వ కూడా ఉండదు.
♦ అతి కొద్ది మంది మాత్రమే తాము చేస్తున్న ఖర్చుల లెక్కలు ఎప్పటికప్పుడు చూసుకుంటారు. పరిస్థితికి తగినట్లు నడుచుకుంటారు. కానీ చాలా మందికి అసలు తాము సంపాదించింది ఎలా ఖర్చయిపోయిందో కూడా తెలియదు.
లగ్జరీతో లాసే..
♦ మనకు ఫ్యాన్సీ అన్నా, లగ్జరీ అన్నా చాలా ఇష్టం. ఫ్యాన్సీ ఫోన్ నెంబర్, ఫ్యాన్సీ కారు, ఫ్యాన్స్ వాచ్, ఫ్యాన్సీ ఇల్లు.. ఇలా ఏది ఫ్యాన్సీ అనిపిస్తే దానికి ఎంతైనా ఖర్చు పెట్టేస్తాం. కానీ ఆ ఫ్యాన్సీ వస్తువుల వల్ల మనకు వచ్చేదెంత అన్నది ఆలోచించం.
♦ ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే బంగారం కనిపిస్తే చాలు కొనేస్తారు. సగటు మధ్య తరగతి వారి దగ్గర కూడా ఓ మోస్తరు బంగారం కచ్చితంగా ఉంటుంది. అయితే చాలా వరకు ఈ బంగారమంతా లాకర్లలోనే మూలుగుతుంది. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు వాటిని పెట్టుకొని మురిసిపోవడానికి లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేస్తాం.
♦ పిల్లల పెళ్లిళ్లపై భారీగా ఖర్చు చేసేయడం కూడా మన అలవాటు. కూడబెట్టుకున్న డబ్బంతా ఖర్చు చేసైనా.. అవసరమైతే అప్పు చేసైనా.. మర్యాదలకు ఏ లోటూ రాకుండా పెళ్లిళ్లు చేస్తాం. రానురానూ ఈ ఖర్చులు మరింత పెరిగిపోతున్నాయి. ఏమైనా అంటే.. జీవితంలో ఒకేసారి జరుపుకునే వేడుక.. ఆ మాత్రం ఖర్చు చేస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తారు. కానీ ఆ ఒక్క పెళ్లి మీ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసేస్తుందన్న విషయాన్ని గమనించరు.
ఆస్తి ఏది.. అప్పు ఏది?
♦ మనలో చాలా మందికి ఆస్తి ఏది అన్నదానిపై స్పష్టత ఉండదు. కారు కొని దాన్నో ఆస్తి అనుకుంటారు. కానీ కారు ఆస్తి కాదు. దాని మెయింటనెన్స్‌కు, ఇంధనానికి మనం ఖర్చు చేస్తూనే ఉండాలి. పైగా దాని విలువ రోజురోజుకూ తగ్గుతుందే కానీ పెరగదు. కొంత మంది అయితే లోన్ తీసుకొని మరీ కార్లు కొంటారు. ఇది చాలా తప్పు.
♦ అవసరం లేని వాటి కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసే మనం.. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మాత్రం వెనుకాడతాం. దానికి ఎందుకంత ఖర్చు పెట్టడం అన్న ఫీలింగ్‌లో ఉంటారు చాలా మంది. తీరా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, పెద్ద జబ్బు చేసినప్పుడో లక్షలు ఖర్చు చేస్తాం. ఇన్సూరెన్స్ విలువ మనకు అప్పుడు తెలుస్తుంది.
♦ సంపాదించడానికి టైమ్ సరిపోవడం లేదు.. రోజుకు 48 గంటలు ఉంటే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటారు. కానీ ఇంకొంత మంది మాత్రం ఉన్న టైమ్‌నూ వేస్ట్ చేస్తారు. తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే నైపుణ్యాలను నేర్చుకోకుండా.. సోషల్ మీడియా, యూట్యూబ్, ఇంటర్నెట్‌లతోనే కాలక్షేపం చేస్తుంటారు. టైమ్ ఈజ్ మనీ అన్న సంగతి గుర్తు పెట్టుకోండి.
♦ చాలా మందికి జీవితంలో ఏదో సాధించాలన్న లక్ష్యం ఉంటుంది కానీ.. ఆర్థిక లక్ష్యాలు మాత్రం ఉండవు. అందుకే అలాంటివాళ్లు అసలు సేవింగ్స్ గురించి పట్టించుకోరు. తొలి జీతం అందుకున్నప్పటి నుంచే పొదుపు నేర్చుకోండి. అది భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని ఎంతగా మెరుగు పరుస్తుందో మీకే తెలుస్తుంది.
ఇన్వెస్ట్‌మెంటూ ఓ కళే..
♦ డబ్బు సంపాదించడానికి ఈ మధ్య చాలా మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ స్టాక్స్‌పై సరైన అవగాహన లేకుండానే ఇన్వెస్ట్ చేసి నష్టపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరో ఇచ్చిన టిప్స్‌ను గుడ్డిగా ఫాలో అయిపోయి చేతులు కాల్చుకుంటున్నారు. అధ్యయనం లేకుండా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే ఆ సొమ్ము కోల్పోయినట్టే అనే సూత్రం గుర్తు పెట్టుకోండి.
♦ కొంతమంది తాము కూడబెట్టుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఒకేదాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్‌లోనో, బంగారంలోనో, స్టాక్ మార్కెట్‌లోనో.. ఇలా ఒకేదాన్ని నమ్ముకోవడం చాలా ప్రమాదం. అన్నింట్లోనూ కొంత ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని గుర్తించండి.
♦ రిస్క్ తీసుకోవడానికి మనలో చాలా మంది వెనుకాడతాం. ఎంతో కొంత రిటర్న్స్ వస్తే చాలని ఏడాదికి ఆరేడు శాతం వడ్డీ ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లకే పరిమితమవుతాం. ఇంకొందరు ఇంట్లోనే డబ్బు మూటలు పెట్టుకొని కూర్చుంటారు. దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.
సహనం చాలా ముఖ్యం
♦ డబ్బు సంపాదనలో మనిషికి సహనం కూడా ముఖ్యమే. నేను పెట్టిన డబ్బు ఓవర్‌నైట్ డబుల్ అయిపోవాలి అనుకుంటే దారుణంగా దెబ్బ తింటారు. స్టాక్ మార్కెట్‌లో చాలా మంది నష్టపోవడానికి ఈ అత్యాశే కారణం. కాస్త ఆలస్యమైన మంచి రిటర్న్స్ ఇచ్చే షేర్లను కొనుగోలు చేస్తే మంచిదని గ్రహించండి.
♦ మనమంతా చేసే పెద్ద తప్పు మరొకటి ఉంది. అదేంటంటే ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన డబ్బును ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిన డబ్బును ఖర్చు చేయడమన్నది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది.
♦ చివరిగా ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు.. సంపాదించిన దానిని ఎలా మేనేజ్ చేస్తున్నామన్నది ముఖ్యమని గ్రహించండి. ఈ దిశగా మీ ఆర్థిక తప్పిదాలు ఏవో గుర్తించి వాటిని ఒక చోట రాసి పెట్టుకుని తరచూ చదువుకోండి.
ఇవీ చదవండి