Home మనీ పర్సనల్‌ లోన్‌ ఎలా తీసుకోవాలి?

పర్సనల్‌ లోన్‌ ఎలా తీసుకోవాలి?

personal loan
Image by Nattanan Kanchanaprat from Pixabay

పర్సనల్‌ లోన్ వేతన జీవులకు ఆర్థిక అవసరాలకు స్నేహితుడిలా ఆదుకుంటుంది. బయట రెండు లేదా మూడు రూపాయల వడ్డీ కట్టలేని సగటు మధ్య తరగతి ఉద్యోగికి ఈ పర్సనల్‌ లోన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

పైగా రుణాలు ఇవ్వడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. తరచూ బ్యాంకుల నుంచే మీకు లోన్‌ కావాలా అంటూ కాల్స్‌ కూడా వస్తుంటాయి. అయితే మన వివరాలు అన్నీ చెప్పి, లోన్‌ కోసం అప్లై చేసుకున్న తర్వాత అవి రిజెక్ట్‌ అవుతుంటాయి.

ఇలా ఎందుకు జరుగుతుందో, అసలు పర్సనల్‌ లోన్‌ రావాలంటే ఏం చేయాలో చాలా మందికి అంతుబట్టదు. కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని లోన్‌ కోసం ప్రయత్నిస్తే కచ్చితంగా ఏ బ్యాంకూ మీ అప్లికేషన్‌ను తిరస్కరించే అవకాశమే ఉండదు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మీ క్రెడిట్‌ స్కోరు చెక్‌ చేసుకోండి

పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలన్న ఆలోచన వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన మొట్ట మొదటి పని మీ క్రెడిట్‌ స్కోర్‌ చెక్‌ చేసుకోవడం. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ క్రెడిట్‌ స్కోరు ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా ప్రతి ఏడాది ఒకసారి సిబిల్లో ఉచితంగా ఈ క్రెడిట్‌ స్కోర్‌ కాపీ పొందే అవకాశం మీకు ఉంటుంది. బ్యాంక్ బాజార్ డాట్ కామ్, పైసా బాజార్ డాట్ కామ్ వంటి వెబ్ సైట్లలో రిజిస్టర్ చేసుకుంటే క్రెడిట్ స్కోరు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు.  మీ క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తున్న పొరపాట్లను  గమనించి, వాటిని సరి చేసుకొనే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. వాటిని సరి చేసుకొని లోన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

అసలు క్రెడిట్‌ స్కోరు లేకపోతే ఇలా చేయండి

చాలా మందికి పర్సనల్‌ లోన్ అవసరం ఉంటుంది. కానీ వాటిని పొందడానికి కావాల్సినంత క్రెడిట్‌ స్కోరు మాత్రం ఉండదు. అలాంటి సమయంలో క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్న వ్యక్తిని పూచీకత్తుగా దరఖాస్తులో చేర్చండి. ఇలా చేయడం వల్ల మీకు లోన్‌ వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

ఇలా క్రెడిట్‌ స్కోరు ఎక్కువగా ఉన్న వ్యక్తుల పూచీకత్తు వల్ల మరింత ఎక్కువ లోన్‌ వచ్చే చాన్స్‌ కూడా ఉంటుంది. లోన్‌ తీసుకున్న తర్వాత సకాలంలో తిరిగి చెల్లించగలిగితే మీ క్రెడిట్‌ స్కోరు కూడా మెరుగవుతుంది.

పర్సనల్‌ లోన్ కు ఎక్కువ అప్లికేషన్లు వద్దు

పర్సనల్‌ లోన్‌ కోసం వివిధ బ్యాంకులకు అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పంపించారో మొదటికే మోసం వస్తుంది. ఎన్ని ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటే మీ క్రెడిట్‌ స్కోరుకు అంత దెబ్బ పడుతుందన్న విషయం గమనించండి. ఇలా ఎక్కువ దరఖాస్తులు చేసుకోవడం వల్ల మీరు లోన్‌ కోసం పెద్ద ఎత్తునే ప్రయత్నాలు చేస్తున్నారని బ్యాంకులు భావిస్తాయి.

సాధారణంగా ఇలాంటి కస్టమర్లు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించరన్న అభిప్రాయం బ్యాంకులకు ఉంటుంది. దీంతో మీ దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం ఉంది. అలాగే మీరు కొన్ని ఆన్ లైన్ వెబ్ సైట్లలో పర్సనల్ లోన్ కోసం గానీ, క్రెడిట్ కార్డు కోసం గానీ ఎంక్వైరీ చేసినా మీ క్రెడిట్ స్కోరు ప్రభావితమవుతుంది. తప్పనిసరిగా తీసుకోవాలనుకున్నప్పడే లోన్ కోసం ఎంక్వైరీ చేయాలి. 

పర్సనల్‌ లోన్ అందించే ఇతర సంస్థలు

సాధారణంగా చాలా మంది పర్సనల్‌ లోన్ల కోసం సాంప్రదాయ బ్యాంకులపైనే ఆధారపడతారు. ఆ బ్యాంకులు తమ లోన్‌ అప్లికేషన్లను నిరాకరిస్తే నిరాశ చెందుతారు. అయితే ఇలాంటి వాళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను పరిశీలించాలి. ఇలాంటి లోన్లు ఇచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా వరకు సాధారణ బ్యాంకుల కన్నా మెరుగైన వడ్డీ రేట్లకు కూడా పర్సనల్‌ లోన్లు ఇస్తుంటాయి.

పాత బాకీలు లేకుండా చూసుకోండి

గతంలోనే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేక వాటిని తిరిగి చెల్లించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో లోన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే.. దానిని బ్యాంకులు కచ్చితంగా తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కొత్త రుణం తీసుకునే ముందే ఎలాగోలా పాత బాకీలు తీర్చేస్తే మీ క్రెడిట్‌ స్కోరు మెరుగై.. రుణం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం గుర్తుంచుకోండి.

ఏది బెస్ట్‌ ఆఫరో తెలుసుకోండి

పర్సనల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మార్కెట్లో వివిధ బ్యాంకులు ఇస్తున్న ఆఫర్లు తెలుసుకోండి. ఆన్‌లైన్‌లోనే ఈ వివరాలు తెలుసుకునే వీలు కూడా ఉంది. దీని ద్వారా అతి తక్కువ వడ్డీ రేటుకు ఎవరు లోన్‌ ఇస్తున్నారన్న విషయంపై మీకు స్పష్టత వస్తుంది.

ఎంత వస్తుందో ముందుగానే చూసుకోండి

ఏదైనా పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు మీకు ఎంత వరకు రుణం వస్తుందో చూసుకోవడం మంచిది. దీనివల్ల మీ అవసరాలు, ఆర్థిక పరిస్థితి, బ్యాంకులు ఇచ్చే రుణాన్ని బట్టి తిరిగి ఆ లోన్‌ ఎలా చెల్లించాలన్నదానిపై మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. పర్సనల్ లోన్ వడ్డీ క్యాలుక్యులేటర్లు కూడా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్లో వెతికితే ఈ టూల్స్ దొరుకుతాయి.

పర్సనల్‌ లోన్ ఎంత వరకు తీసుకోవచ్చు?

పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు నెలవారీ ఎంత చెల్లించాల్సి ఉంటుంది? అంత మొత్తం చెల్లించే సంపాదన మీకు ఉందా లేదా అని చూసుకోవడం మంచిది. మీరు నెలవారీ ఎంత తిరిగి చెల్లించగలరో ఆ మేరకే రుణం తీసుకుంటే ఎలాంటి చిక్కులు ఉండవు. మీకు అవసరమున్న లోన్‌ కంటే కూడా ఎక్కువగా ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి.

ఎక్కువగా ఇస్తున్నారు కదా అని తీసుకున్నారో.. దానిని తిరిగి చెల్లించడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మీ క్రెడిట్‌ స్కోరుపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అలాగే భవిష్యత్తులో మీరు హౌజింగ్ లోన్ తీసుకోవాలనుకుంటే పర్సనల్ లోన్ తీసుకోకపోవడమే ఉత్తమం. మనకు పర్సనల్ లోన్ ఇఎంఐ ఎంత ఉందో బేరీజు వేసుకుని ఆమేరకు హౌజింగ్ లోన్ మొత్తాన్ని బ్యాంకులు తగ్గించి ఇస్తాయి.

డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి

పర్సనల్‌ లోన్‌ పొందాలంటే బ్యాంకులు వివిధ పత్రాలను అప్లికేషన్‌తోపాటు జత చేయమని అడుగుతాయి. అందులో ముఖ్యంగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ట్యాక్స్‌ రిటర్న్స్‌, మీ ఉద్యోగ సంబంధిత రికార్డులన్నీ ఉండేలా చూసుకోవాలి. ఈ డాక్యుమెంట్లన్నీ పక్కాగా ఉంటే.. లోన్‌ వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

ఏజెంట్‌తో నేరుగా మాట్లాడండి

సరైన క్రెడిట్‌ స్కోరు లేదనో, అవసరమైన పత్రాలు అన్నీ జత చేయలేదనో, మరే ఇతర కారణం వల్లో మీకు లోన్‌ ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తాయి. అందువల్ల లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ముందే సదరు బ్యాంకు ఏజెంట్‌తో వ్యక్తిగతంగా మాట్లాడితే మంచిది.

నేరుగా మాట్లాడటం వల్ల మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీ వ్యక్తిత్వం ఎలాంటిది, తిరిగి సకాలంలో లోన్‌ చెల్లించే సామర్థ్యం మీకు ఉందా లేదా అన్న అంశాలపై సదరు ఏజెంట్‌ ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చే వీలుంటుంది. ఇది మీకు లోన్‌ వచ్చే అవకాశాలను మరింత మెరుగు పరుస్తుంది. 

ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకోవచ్చా?

నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ మీకు అవసరమైతేనే. అది కూడా వడ్డీ తక్కువగా ఉన్నప్పుడే. మీ శాలరీ ఖాతా ఉన్న ఎస్ బి ఐ వంటి బ్యాంకులు, మీకు క్రెడిట్ కార్డును ఆఫర్ చేసిన సంస్థలు మీ క్రెడిట్ స్కోరును బట్టి ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ చేస్తాయి.

ఇందుకోసం మీరు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఆయా సంస్థల యాప్ లో అవి ఆఫర్ చేసిన చోట ఓకే అని క్లిక్ చేస్తే సెకండ్లలో మీ బ్యాంకు ఖాతాల్లో వచ్చి చేరుతాయి. మీ పర్సనల్ లోన్ ఖాతా మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాలో కనిపిస్తుంది.

పర్సనల్‌ లోన్ వడ్డీ రేటు ఎంతుండాలి?

సాధారణంగా మీ క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే 10.99 శాతం నుంచి 13 శాతం మధ్య వడ్డీ రేటును బ్యాంకులు వసూలు చేస్తాయి. కొన్ని సంస్థలు ప్రాసెసింగ్ ఫీజు, మరికొన్ని సంస్థలు ఇతర రుసుములు వసూలు చేస్తాయి.

ఈ రేట్ల మధ్య పర్సనల్‌ లోన్ తీసుకోవడం కోసం మీరు ఆయా సంస్థల ప్రతినిధులతో బార్గేయిన్ చేయొచ్చు. ఇంతవరకూ పర్సనల్ లోన్ లేనట్లయితే ఒక చిన్న మొత్తాన్ని లోన్ గా తీసుకోండి. ఆ తదుపరి లోన్ తక్కువ వడ్డీ రేటుకే దొరుకుతుంది. 

ఇవి కూడా చదవండి

author

రచయిత: హరిప్రసాద్ శీలమంతుల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version