Home మనీ health insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ : ఆరోగ్య బీమాతో ఫ్యామిలీకి ధీమా

health insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ : ఆరోగ్య బీమాతో ఫ్యామిలీకి ధీమా

health insurance in telugu
Photo by Anna Shvets from Pexels

health insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, వైద్య బీమా.. పేరేదైనప్పటికీ ఫ్యామిలీ మొత్తానికి ఆపద్బాంధవుడిలా ఆదుకునేందుకు ఒక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఉండాలి. మన ఆర్థిక ప్రణాళికలో మనకు తప్పనిసరిగా ఉండాల్సిన వాటిలో ఆరోగ్య బీమా పాలసీ చాలా ముఖ్యమైంది.

లైఫ్‌ స్టయిల్‌లో మార్పలు సంభవిస్తున్నట్టే కొత్తకొత్త వ్యాధులు మానవాళిని ముంచెత్తుతున్నాయి. కరోనా, కోవిడ్, స్వైన్‌ ఫ్లూ, రకరకాల వైరస్‌లు.. ఇలా నిత్యం వార్తాంశాలు మనల్ని భయపెడుతుంటాయి. అందువల్ల మనకు, మనపై ఆధారపడి ఉన్న వారికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం చాలా ఉత్తమం.

when did health insurance applicable: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎప్పుడు వర్తిస్తుంది

ఒక్కో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఒక్కో తీరుగా ఉంటుంది. చాలా వరకు అన్ని వ్యాధులకు ఆరోగ్య బీమా వర్తించదు. కార్డు పొందేటప్పుడే అన్ని వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. సాధారణంగా ఈ వైద్య బీమా ప్లాన్లలో కొన్ని షరతులు ఇలా ఉంటాయి.

– కనీసం 24 గంటల పాటు ఇన్‌ పేషెంట్‌గా ఆసుపత్రిలో అడ్మిట్‌ అయి ఉండాలి. అడ్మిట్‌ అయ్యే సమయంలో ఆ ఆసుపత్రి మన బీమా సంస్థకు సంబంధించిన నెట్‌ వర్క్‌ ఆసుపత్రిలో ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఉంటే ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యేటప్పుడే ఆ కార్డు, మన గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది.

– అయితే ఇప్పుడిప్పుడే స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటి సంస్థలు ఔట్‌ పేషెంట్‌ కేర్‌ వంటి వెసులుబాటు కూడా అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు డే కేర్‌ ట్రీట్‌మెంట్‌ వసతి కూడా అందిస్తున్నాయి.

– వైద్య బీమా పాలసీలు చాలావరకు గతంలో ఉన్న వ్యాధులకు వర్తించవు. పాలసీ తీసుకోకముందే పాలసీదారుడు ఏదైనా వ్యాధికి గురై ఉంటే ఆ వ్యాధికి నిర్ధిష్ట కాలం వరకు బీమా వర్తించదు. అంటే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని బట్టి రెండేళ్ల వరకు నిర్ధిష్ట వ్యాధులకు పాలసీ వర్తించదు. పాత వ్యాధులకు మూడు సంవత్సరాల వరకు పాలసీ వర్తించదు.

– తొలి మూడు నెలల వరకు కొన్ని పాలసీలపై సాధారణ అనారోగ్యానికి బీమా వర్తించదు. అయితే ప్రమాదాలు సంభవించినప్పుడు ఇలాంటి షరతులేవీ వర్తించవు. నగదు రహిత చికిత్స పొందవచ్చు.

– అయితే కొన్ని సంస్థలు ఇచ్చే పాలసీల్లో మాత్రం ప్రసూతి ఖర్చుల నుంచి మొదలు దంత ఖర్చుల వరకు బీమా వర్తిస్తుంది. పాత వ్యాధులతో ఇక్కడ సంబంధం ఉండదు.

– ఉద్యోగులకు కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే వైద్య బీమా పాలసీల్లో షరతులు తక్కువగా ఉంటాయి. సహజంగానే ఈ పాలసీ ప్రీమియం కాస్త ఎక్కువగానే ఉంటుంది.

health insurance benefits: ఆరోగ్య బీమా పాలసీ ద్వారా అందే ప్రయోజనాలు

– 24 గంటల పాటు ఆసుపత్రిలో అడ్మిట్‌ అవ్వాల్సిన సందర్భాల్లో, పైన చెప్పిన షరతులకు లోబడి, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పొందవచ్చు.

– దంత వైద్య ఖర్చులు, ప్రసూతి ఖర్చులు, పాత వ్యాధులకు ఖర్చులు కూడా కొన్ని వైద్య బీమా పాలసీ ద్వారా పొందవచ్చు.

– ఆసుపత్రి గది అద్దె (ఏసీ గది లేదా నాన్‌ ఏసీ గది), నర్సింగ్‌ అండ్‌ బోర్డింగ్‌ ఛార్జీలు, ఆపరేషన్‌ థియేటర్, ఐసీయూ సేవలు, వైద్యుల ఫీజలు, మందులు, ఆక్సిజన్‌ ఇలా అన్నింటికీ అయ్యే ఖర్చుకు పాలసీ వర్తిస్తుంది.

– ఆసుపత్రిలో చేరడానికి ముందు, డిశ్చార్జి అయ్యాక అయ్యే వ్యయం కూడా వర్తిస్తుంది.

– అంబులెన్స్‌ ఖర్చును కూడా వైద్య బీమా పాలసీ భరిస్తుంది. అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు వినియోగించుకుంటే ఎయిర్‌ ఆంబులెన్స్‌ ఖర్చు కూడా అందిస్తాయి.

– ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వైద్య చికిత్సలకూ పాలసీలు వర్తిస్తాయి.

– పాలసీదారుడు తన జీవిత భాగస్వామి, పిల్లలకు, తన తల్లిదండ్రులకు ఉమ్మడిగా పాలసీ తీసుకోవచ్చు. లేదా తల్లిదండ్రులకు విడిగా తీసుకోవచ్చు.

– కొన్ని సంస్థలు మనం ఆరోగ్య బీమా వాడుకోనప్పుడు బోనస్‌గా హెల్త్‌ చెకప్‌ వంటి ప్రయోజనాలు, లేదా తదుపరి ప్రీమియంలో కొంత మినహాయింపు వంటి వెసులుబాట్లు కల్పిస్తాయి.

– టాపప్‌ పాలసీలు కూడా తీసుకోవచ్చు. అంటే మనం రూ. 5 లక్షల మేర వైద్య ఖర్చులకు బీమా తీసుకున్నామనుకోండి. ఇవి సరిపోదని భావిస్తే రూ. 10 లక్షల వరకు టాపప్‌ పాలసీ కూడా ఎంచుకోవచ్చు. టాపప్‌ పాలసీకి ప్రీమియం తక్కువగానే ఉంటుంది.

– విదేశాల్లో చేయించుకునే చికిత్సలకు కూడా వర్తించేలా వైద్య బీమా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. మాక్స్‌ బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ గరిష్టంగా రూ. 3 కోట్ల వరకు బీమా తీసుకునేందుకు వీలుగా మాక్స్‌ బూపా హెల్త్‌ ప్రీమియా పేరుతో పాలసీ తెచ్చింది. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఇందులో అంతర్గతంగా ఉంటుంది.

– కాన్సర్, గుండె జబ్బులకు కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు ప్రత్యేక ప్లాన్లు అందిస్తున్నాయి. మనం ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని గడుపుతుంటే సంబంధిత వ్యాధులు కవర్ అయ్యేలా ప్లాన్ తీసుకోవడం ఉత్తమం.

health insurance tax benefit: ప్రీమియానికి ఆదాయ పన్ను మినహాయింపు ఇలా

ఆసుపత్రుల్లో నగదు రహిత (క్యాష్‌ లెస్‌) ట్రీట్‌మెంట్‌ అందజేయడమే కాకుండా.. మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై వెచ్చించే ప్రీమియంపై ఆదాయ పన్ను సెక్షన్‌ 80 డీ కింద మినహాయింపు కూడా పొందవచ్చు.

ఆరోగ్య బీమా పాలసీదారులు, వారి తల్లిదండ్రులు 60 ఏళ్ల లోపు వారైతే పాలసీదారు, భార్య లేదా భర్త, పిల్లలకు చెల్లించే ప్రీమియం రూ. 25 వేల వరకు, తల్లిదండ్రులకు చెల్లించే ప్రీమియం రూ. 25 వేల వరకు ఈ 80 డీ కింద మినహాయింపు పొందవచ్చు.

ఒకవేళ పేరెంట్స్‌ 60 ఏళ్ల పైబడి ఉన్నవారైతే రూ. 50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ పాలసీదారు, అతడిపై ఆధారపడిన వారు, తల్లిదండ్రులు.. ఇలా అందరూ 60 ఏళ్లపైబడి ఉంటే రూ. 1 లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు. ఇందులో ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌లకు కూడా మినహాయింపు వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

Exit mobile version