Home మనీ Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరం?

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరం?

health insurance
Photo by Hush Naidoo Jade Photography on Unsplash

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తప్పనిసరి అవసరంగా మారింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ తగినంతగా చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంత తీసుకోవాలి?

చాలా మంది శాలరీ ఆధారిత వ్యక్తులు కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సరిపోతుందనుకుంటారు. మనం ఉద్యోగం చేసే కంపెనీలు కూడా అనేక రకాల పాలసీలు ఎంచుకుంటాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగి నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయవు. కానీ కొద్ది మొత్తంలోనే హెల్త్ ఇన్సూరెన్స్‌ చేయిస్తాయి. మరికొన్ని కంపెనీ మనం ప్రీమియం చెల్లించే స్థోమతను బట్టి పాలసీ ఎంచుకోమని చెబుతాయి. ఆయా యాజమాన్యాలు ప్రీమియం చెల్లించవు. ఉద్యోగి పూర్తిగా ప్రీమియం చెల్లించాలి.

కంపెనీ కొద్ది మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినప్పుడు.. అంటే రూ. 2 లక్షలో, రూ. 3 లక్షలకో పాలసీ ఉచితంగా చేయించనప్పుడు మనం అదనపు వ్యక్తిగత పాలసీ చేయించుకోవడం బెటర్. అలాగే కంపెనీ పాలసీలకు మనం ప్రీమియం చెల్లించినప్పుడు కూడా అదనంగా బయట హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం మంచిది.

ఇలా ఎందుకంటే కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం ఆయా పాలసీల్లో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకుముందు ఉన్న వ్యాధులకు కూడా పాలసీ వచ్చిన తొలి రోజు నుంచే చికిత్సకు అయ్యే ఖర్చు వర్తిస్తుంది. అలాగే మెటర్నిటీకి, కంటి చికిత్సలు, పంటి చికిత్సలకు కూడా సదరు గ్రూప్ పాలసీ వర్తిస్తుంది.

కానీ వ్యక్తిగత కుటుంబ పాలసీలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. కంపెనీ గ్రూప్ పాలసీతో పోలిస్తే ప్రీమియం కూడా తక్కువే ఉంటుంది. ఇంతకుముందు ఉన్న వ్యాధులకు తొలి రెండేళ్లు వర్తించవు. ఒక ఏడాది పూర్తిచేస్తే కొన్ని వ్యాధులపై షరతులు తొలగిపోతాయి. రెండేళ్లు పూర్తయితే ఇక అంతకుముందు ఉన్న వ్యాధులకూ వర్తిస్తాయి. అందువల్ల ఇప్పటికే వ్యాధులు ఉన్న వారు చికిత్స అవసరమైనప్పుడు ఉద్యోగం చేస్తున్న చోట ఎక్కువ మొత్తంలో పాలసీ చేయించుకోవడం మేలు. వ్యాధులు లేనట్లయితే కంపెనీ పాలసీ తక్కువ మొత్తంలో చేయించుకుని ప్రయివేటుగా ఎక్కువ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకోవడం మేలు.

మరి ఎంత మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలన్నప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీ వృత్తి ప్రమాదకరమైందా? లేక మీరు మెట్రో సిటీస్‌లో నివసిస్తున్నారా? మీరు నివసించే ప్రాంతంలో హాస్పిటల్ బిల్లులు ఎక్కువవుతాయా? ప్రయాణాలు ఎక్కువగా చేస్తారా? మీకు దగ్గరలో ప్రభుత్వ వైద్య సేవలు మెరుగ్గా ఉంటాయా? ఇలాంటి అంశాలన్నీ బేరీజు వేసుకోవాలి. అలాగే మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా? అన్న అంశం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మీ అవసరాలే ప్రాతిపదికగా పాలసీలు పరిశీలించాలి.

Health Insurance: వయస్సు, ఆరోగ్యం ముఖ్యం..

హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపికలో మీ వయస్సు, ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తాయి. 30 ఏళ్ల వయస్సులో ఒకతీరుగా, 40 ఏళ్ల వయస్సులో ఒక తీరుగా, 50 ఏళ్ల వయస్సులో ఇంకో తీరుగా మీ ఆరోగ్య అవసరాలు ఉంటాయి. అందువల్ల మీ ఆరోగ్య పరిస్థితి, వాటికి భవిష్యత్తులో అయ్యే సర్జరీలు, ఖర్చులు, మందులు అవసరాలు గమనించాలి. అలాగే ఏటా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. భరించే స్థోమతను కూడా అంచనా వేసుకోవాలి.

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ కనీస పరిమితి రూ. 10 లక్షలు

ఇప్పుడు కనీసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో రూ. 2 లక్షలు, రూ. 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేవారు. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా లక్షలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు వైద్యం మరీ ఖరీదైనందున రూ. 5 లక్షల పాలసీ సరిపోదని, కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నప్పుడు కనీసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలపై నో క్లెయిమ్ బోనస్ ఇస్తున్నాయి. అంటే మీరు మొదటి సంవత్సరంలో పాలసీని వాడుకోని పక్షంలో ఆ మొత్తం మరుసటి ఏడాది మొత్తానికి జమవుతుంది. అంటే రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మొదటి ఏడాది మీరు దానిని వాడుకోని పక్షంలో మీరు రెన్యువల్ చేయించుకున్నప్పుడు మీకు రూ. 20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుంది.

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఎంత ఖర్చవుతుంది?

మీ వయస్సు, మీకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధులను బట్టి ప్రీమియం వసూలు చేస్తారు. ఉదాహరణకు మీకు 40 ఏళ్ల వయస్సు ఉండి రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే వార్షిక ప్రీమియం రూ. 20 వేలకు అటుఇటుగా ఉంటుంది. ఒకవేళ మీకు డయాబెటీస్, హైబీపీ, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉంటే అదనపు ప్రీమియం పడుతుంది. మీకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధులను పాలసీ తీసుకునేటప్పుడు మెన్షన్ చేయడం మంచిది. క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Exit mobile version