Home హెల్త్ diabetes: డయాబెటిస్‌ను జయించి ఒంట్లో కొవ్వు కరిగించాలంటే .. నా అనుభవం ఇదీ

diabetes: డయాబెటిస్‌ను జయించి ఒంట్లో కొవ్వు కరిగించాలంటే .. నా అనుభవం ఇదీ

diabetes

1. పన్నీర్, సొయా, ఆకుకూరలు, ఎగ్‌ వైట్, చికెన్, మటన్, ఫిష్‌.. వీటితో పాటు కాయగూరలు మాత్రమే ఉన్న డైట్‌ మూడు నెలలు తీసుకోవాలి. శాఖాహారులు కేవలం పనీర్, సొయా, ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. వీటిని ఎలా వండుకొంటారు అనేది మీ ఇష్టం. ఈ మూడు నెలలు ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ఆహార పదార్థం కూడా తీసుకోకూడదు. అవునండీ .. మూడో పూట్లా ఇవే. ఇవి కాకుండా ఇంకేదీ తినకూడదు.

2. ముఖ్యంగా చక్కర, తేనె, బెల్లంతో చేసిన పదార్థాలు.. అంటే స్వీట్స్‌ పూర్తిగా మానెయ్యాలి. పళ్ళు కూడా తీసుకోకూడదు. నీరు బాగా తాగాలి. కాఫీ టీ వద్దు.

3. చికెన్, మటన్, సొయా, గుడ్డు, పన్నీర్‌ లాంటి వాటి ద్వారా మన శరీరానికి ప్రోటీన్‌ బాగా అందుతుంది. ఆకుకూరలు, కాయగూరల నుంచి పీచు, విటమిన్లు , మినరల్స్‌ అందుతాయి.

అలాగే తక్కువ మొత్తంలో పిండిపదార్తాలు కూడా అందుతాయి. ఈ వంటకాల తయారీలో మనం వాడే నూనె నుంచి ఫ్యాట్స్‌ అందుతాయి. గానుగ నూనె బెస్ట్‌.

ఇలా తింటే శరీరానికి కార్బోహైడ్రేట్స్‌ అందవు.. దీని వల్ల సమస్యలు వస్తాయి అని ఒక అపవాదు ఉంది. ఇది అవగాహన లోపం. వంద గ్రాముల బియ్యం లో సుమారుగా 25 గ్రాముల పిండిపదార్థం మన శరీరానికి అందుతుంది. అదే వంద గ్రాముల బెండకాయల నుంచి ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్స్‌ అందుతాయి. కాబట్టి ఇది నో కార్బ్‌ డైట్‌ కాదు.

ఇలా తింటే బలహీనత వస్తుందా?

అయ్యా .. మొదటి రెండు మూడు రోజులు కొద్దిగా నీరసం అనిపిస్తుంది. అంతే .. నేను గత నాలుగు నెలలుగా ఈ డైట్‌ లో ఉంటున్నా. జిమ్‌లో 50 నుంచి వంద కిలోల బరువులతో రఫ్‌ ఆడిస్తున్నా. నీరసం ఎక్కడిది?

అసలు డయాబెటిస్‌ అంటే ఏంటో తెలుసా? ఒంట్లో కొవ్వు పేరుకొని పోయి లావెక్కడం, బీపీ పెరగడం ఎందుకు జరుగుతుందో తెలుసా?

మన శరీరానికి 1. కార్బోహైడ్రేట్స్, 2. ప్రోటీన్స్, 3. ఫ్యాట్స్‌ వీటితో పాటు పీచు, మినరల్స్‌ , విటమిన్స్‌ సమపాళ్ళలో కావాలి. కార్బోహైడ్రేట్స్‌ అంటే పిండిపదార్థాలు 40 నుంచి 60 శాతానికి మించ కూడదు.
కానీ మీరు ఎలాంటి ఆహారం తీసుకొంటున్నారో చూడండి. అన్నం, అది కడుపులోకి వెళ్ళడానికి సాంబారు, రసం, పెరుగు వాడుతున్నారు.

ఇది కాకుండా స్వీట్స్‌ .. ఇలా చూస్తే మీరు తినే ఆహారంలో పిండి పదార్థాలు 80 నుంచి 90 శాతం దాకా ఉంది . పిండి పదార్థాలను అరిగించాలంటే ఇన్సులిన్‌ కావాలి.
ఎక్కువ పిండిపదార్థాలు తింటే ఎక్కువ ఇన్సులిన్‌ కావాలి. ఇన్సులిన్‌ను మన శరీరం లోని క్లోమ గ్రంధి ఉత్పత్తి చేస్తుంది. డయాబెటిస్‌ అంటే క్లోమం తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయకపోవడం.

ఇన్సులిన్‌ ఉత్పత్తి కానిపక్షంలో అప్పుడేమవుతుంది?

క్లోమ గ్రంథి సరిగా పనిచేస్తున్నప్పుడు రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ 90 నుంచి 140 మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే క్లోమ గ్రంధి తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదో అప్పుడు షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయి. షుగర్‌ లెవెల్స్‌ 180 దాక పెరిగినా ఫరవా లేదు. కానీ కొంతమందిలో ఇది 200 దాటి మూడు వందలు నాలుగు వందల దాక చేరుకొంటుంది. అప్పుడు రక్తం చిక్క బడుతుంది.

ఒక సన్నటి పైపు గుండా నీరు ప్రవహిస్తోంది అనుకోండి. ఆ నీరు మామూలుగా ఉంటే ఏమీ కాదు. అదే బురద నీరు అనుకోండి. నీరు ఒక వైపు నుండి మరో వైపుకు సక్రమంగా వెళుతుందా ? లేదు కదా? అలాగే రక్త నాళం పైపు లాంటిది . అందులో చక్కర శాతం ఎక్కువయితే అది బురద నీరు లాంటిది అయిపోతుంది. కళ్ళకు సక్రమంగా రక్తం ప్రసారం కాకపోతే ? కంటి చూపు దెబ్బతింటుంది. కాళ్లకు రక్త ప్రసారం జరగక పొతే ? కాళ్ళు తీసేయాల్సిన స్థితి .

అసలు క్లోమ గ్రంధి ఎందుకు దెబ్బ తింటుంది?

ఎవడెన్ని చెప్పినా దీనికి ప్రధాన కారణం టెన్షన్‌. మీ చుట్టుపక్కల కొంత మందిని గమనించండి. నిమ్మళంగా ఉంటారు. ఎలాంటి టెన్షన్‌ తీసుకోరు. వీరికి డయాబెటిస్‌ ఉండదు. ఆధునిక జీవనం అంటేనే టెన్షన్‌. టెన్షన్‌ తగ్గించుకోవాలి.. నిజమే కానీ మరీ నిమ్మకు నీరెత్తనట్టు ఉంటే ప్రొఫషనల్‌ లైఫ్‌ సక్సెస్‌ వచ్చే అవకాశం తగ్గి పోతుంది కదా ? .

డయాబెటిస్‌ రాని వారు అదష్టవంతులు కదా? అలాగేని ఏమీ లేదు. ‘అమ్మయ్య .. నాకు చక్కర వ్యాధి లేదు. నాతోటి వారు అన్నం సరిగ్గా తినలేరు. స్వీట్స్‌ అసలే తినలేరు. నేను చాలా లక్కీ‘ .. అని వీరు తెగ తింటారు. శరీరంలోకి అధిక క్యాలరీలు వెళితే? అది కొవ్వుగా మారుతుంది.

దీని వల్ల ఊబ కాయం.. కొవ్వు పేరుకొని పోతుంది . లేస్తే కూర్చోలేరు .. కూర్చుంటే లేవలేరు.. వంగ లేరు .. పరుగెత్త లేరు. బీపీ, కీళ్ల నొప్పులు .. ఇలాంటివి బోనస్‌గా వస్తాయి .

మరి డయాబెటిస్‌ వస్తే హ్యాపీ గా మందులు తీసుకోవచ్చు కదా? డయాబెటిస్‌ వచ్చిన వారికి తోలి దశలో ఇచ్చే మందు మెట్ఫార్మిన్‌ .. సింపుల్‌ గా చెప్పాలంటే ఇది ఆకలిని తగ్గిస్తుంది. చెయ్యాల్సింది ఏమిటి? ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవడం.

చేస్తున్నదేమిటి ? ఆకలిని చంపెయ్యడం. వివాదాల్లోకి తలదూర్చడం నాకు ఇష్టం లేదు. నా అనుభవం చెబుతాను . 2010లో నాకు డయాబెటిస్‌ వచ్చింది. డాక్టర్‌ ఈ టాబ్లెట్‌ తినమన్నారు.

తింటే ఆరు నెలల్లో పీనుగలా తయారయ్యాను . మీరు చూసారా ? డయాబెటిస్‌ వచ్చిన వారు కొంత మంది బాగా సన్నబడి అనారోగ్యంగా కనిపిస్తారు. ఆరోగ్యంగా సన్నపడడం అంటే శరీరం లో కొవ్వు కరిగించడం. కండరాలు, ఎముకలు బలంగా ఉండడం.

ఆకలిని చంపేస్తే? పై టాబ్లెట్‌తో ఆకలి పూర్తిగా చావదు కానీ తినాలనిపించదు. ఏదో కాస్త తింటాము. ఒక చెట్టుకు నీరు పోయకుండా ఎరువు వెయ్యకుండా ఉంటే? అది చచ్చి ఊరుకొంటుంది. మరి మనిషి?.

ఈ టాబ్లెట్‌ను ఎక్కువ కాలం తీసుకొంటే? చక్కర మాత్ర .. వైకుంఠ యాత్ర . సింపుల్‌ గా అదీ పాయింట్‌. అంటే వెంటనే పోతారని కాదు. స్లో గా ఒక్కో రోగం ఆడ్‌ అవుతూ కొంత కాలానికి ఇక అంతే.

నిజానికి ఈ మాత్ర తొలిదశలోనే పని చేస్తుంది . కొంత కాలానికి ఇన్సులిన్‌ పొడిపించుకోవాల్సి వస్తుంది. అసలు డయాబెటిస్‌ అంటేనే ఇన్సులిన్‌ లోపం .. మరి ఇన్సులిన్‌ పొడిపించుకొంటే సరి పోతుంది కదా? చాలా మంది ఇలాగే అనుకొంటారు. ఇన్సులిన్‌ సహజంగా శరీరం లో ఉత్పత్తి కావడం వేరు. మనం పొడిపించుకోవడం వేరు. ఇలా పొడిపించుకొంటే శరీరంలో సిగ్నలింగ్‌ వ్యవస్థ దెబ్బతిని పోతుంది. క్రమంగా లివర్, కిడ్నీలు పోతాయి. ఇది సైన్స్‌ .

కాబట్టి డయాబెటిస్‌ కు ఒక్కటే పరిష్కారం.. అదేంటి ?

డయాబెటిస్‌ రోగం కాదు. లైఫ్‌ స్టైల్‌ డిజార్డర్‌. జీవన శైలికి సంబందించిన అపశృతి. దీనికి సరైన పరిష్కారం జీవన శైలిని మార్చుకోవడం. ఇలా చేస్తే డయాబెటిస్‌ ఒక వరం అవుతుంది. అవును ఇదొక వరం.

2010 వరకు నేను ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకొనే వాడిని కాను. ఏది పడితే అది తినేవాడిని. రాత్రి కడుపునిండా తెల్ల అన్నం తిని అటు పై రెండు అరటి పళ్ళు చెక్కర, తేనేతో క్రష్‌ చేసి ఫ్రూట్‌ సలాడ్‌ లాగా చేసి తినేవాడిని.

ఎంత అజ్ఞానం? అంటే కేవలం రాత్రే నేను సుమారుగా వెయ్యి కెలోరీలు శరీరం లోకి తోసేవాడిని . మనకు రోజంతా కావాల్సింది 2300 కెలోరీలు. అధిక కెలోరీలు కొవ్వు .. ఊబకాయానికి దారితీస్తుంది. అసలు డయాబెటిస్‌ రాకుండా ఉంటే నేను ఇప్పటికి ఎలా ఉండేవాడినో? ఊబకాయంతో లేస్తే కూర్చోలేని స్థితి వచ్చి ఉండేది . బహుశా కరోనా సోకి పైకి పోయి ఉండేవాడిని.

బుజ్జి కన్న .. స్వీట్‌ డార్లింగ్‌ … డయాబెటిస్‌ వచ్చింది . తత్త్వం బోధ పడింది . మందులు మానేసి సంవత్సరంలో దాన్ని పంపేసాను . నేను చేసుకొన్న మంచి అలవాట్ల కారణంగా ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ వచ్చింది.

ఏమి చెయ్యాలి?

1. పైన నేను చేప్పిన ఆహారం మూడు నెలలు తీసుకోండి . కొవ్వు కరిగి పోతుంది. సన్న పడుతారు. ఆరోగ్యంగా సన్న పడుతారు. ప్రోటీన్‌ లు తగినంత తీసుకోవడం వల్ల కండరాలు బలం అవుతాయి. తగినంత మినరల్స్, విటమిన్స్, పీచు ఉన్న కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవం వల్ల ఆరోగ్యం మీ సొంతం. ప్రతి పూట కీర దోసకాయ తప్పని సరి.

2. టెన్షన్‌ తగ్గించుకోవాలి. పాజిటివ్‌ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. యోగ ఇందుకు సహకరిస్తుంది.

3. వారంలో అయిదు రోజులు వ్యాయామం తప్పని సరి. జిమ్‌ అయితే బెస్ట్‌. జిమ్‌లో ట్రైనర్‌ ఉంటే ఉత్తమం. కనీసం నడక అవసరం. జిమ్‌కు పోయినా ట్రెడ్‌ మిల్‌పై నడక తప్పని సరి.

ఏదో వయ్యారంగా సుకుమారంగా ఫోన్‌ మాట్లాడుతూ పక్క వారితో బాతాఖానీ కొడుతూ కాదు. వేగంగా నడవాలి. గంటకు ఆరు కిలో మీటర్ల వేగం ఉండాలి. కనీసం అర గంట నడవాలి. నుదుట చెమటలు రావాలి.

4. పైన చెప్పిన డైట్‌ మూడు నెలలు తీసుకోండి. ఇంట్లో షుగర్‌ టెస్టింగ్‌ మెషిన్‌ పెట్టుకొని మీరు ఆహారం తీసుకొన్న 90 నిముషాలకు రీడింగ్‌ చెక్‌ చేసుకోండి. గతంలో మీరు టాబ్లెట్‌ వేసుకున్నా, ఇన్సులిన్‌ తీసుకొన్నా ఆ రీడింగ్‌ 200 కంటే ఎక్కువ ఉండేదా? ఇప్పుడు అది 140 లోపే ఉంటుంది.

ఇది కీటో డైట్‌ .. ఇలా చేస్తే కిడ్నీ లు పోతాయి అంటారు . ఇది నిజమేనా? పచ్చి అబద్దం. ఇది కీటో డైట్‌ కాదు. నో కార్బ్‌ డైట్‌ కూడా కాదు. లో కార్బ్‌ డైట్‌. అంటే తక్కువ మొత్తంలో పిండిపదార్తాలు ఉండే ఆహారం ..

దీని వల్ల క్లోమ గ్రంధి పై ఒత్తిడి తగ్గిపోతుంది. షుగర్‌ లెవెల్స్‌ తగ్గిపోతాయి. ఒంట్లో ఉన్న కొవ్వు కరిగి ఆరోగ్య కరంగా సన్న పడుతారు.

దుంప కూరలు వద్దు..

ఒక ముఖ్యమైన విషయం. కాయగూరలు తీసుకోవాలి అన్నాను కదా అని దుంప కూరలు తీసుకోకండి. బంగాళా దుంప లాంటి దుంప కూరల్లో బియ్యం కంటే ఎక్కువ కార్బ్స్‌ ఉంటాయి . దుంప కూరలు వద్దు.

మరి మూడు నెలల తరువాత ? తక్కువ స్థాయిలో బ్రౌన్‌ రైస్‌ తీసుకోవచ్చు. లేదా మీ శరీరంలో ఇంకా కొవ్వు ఉంటే పది రోజులు బ్రేక్‌ ఇచ్చి తిరిగి లో కార్బ్‌ డైట్‌ మరో రెండు నెలలు .

అటుపై బ్రౌన్‌ రైస్‌ కొద్దిమొత్తంలో తీసుకోవచ్చు. వ్యాయామానికి ముందు అంటే పొద్దునే లేదా సాయంకాలం ఒక పండు తీసుకోవచ్చు. అరటి పండు వద్దు. జామ బెస్ట్‌. పళ్లలో ఆంటీ ఆసిడ్‌లు ఉంటాయి. కాన్సర్‌ నుంచి రక్షణ. అలాగే ఇన్సులిన్‌ ఎక్కువ ఉత్పత్తికి తోడుపడుతాయి.

నేను డాక్టర్‌ని కాను…

నేను డాక్టర్‌ని కాను. నా అనుభవాన్ని చెప్పాను. అన్నిటి కంటే ముఖ్యంగా నేను చెప్పింది మందులు మాకులు కాదు. కేవలం లైఫ్‌ స్టైల్‌ మార్పు. డయాబెటిస్‌కి ఇదే నిజమైన చక్కటి పరిష్కారం అని నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. మీ వయసు బట్టి మీ ఆరోగ్య స్థితి బట్టి డాక్టర్‌ సలహాతో వీటిని పాటించవచ్చు. నేను చెప్పింది టైపు 2 డయాబెటిస్‌ గురించి . చిన్న పిల్లల్లో వచ్చే టైపు వన్‌ గురించి నాకు పెద్దగా తెలియదు .

మీరు లో కార్బ్‌ డైట్‌ లోకి షిఫ్ట్‌ అయినా తరువాత మందులు ఇంజక్షన్‌ లేకుండా షుగర్‌ లెవెల్స్‌ చెక్‌ చేసుకోండి. అది 140 లోపు ఉంటే మందులు అవసరం లేదు. అటు పైన బ్రౌన్‌ రైస్‌ ఒకటి రెండు కప్పులు మాత్రమే తీసుకున్నప్పుడు షుగర్‌ లెవెల్స్‌ పెరిగాయా? 180 దాక ఉంటే ఏమీ కాదు. దాన్ని దాటితే మెంతులు ట్రై చేయండి.

రాత్రి పూట ఒక స్పూన్‌ మెంతులు నాన బెట్టి పరగడుపున తాగండి. అప్పుడప్పుడు పరగడుపున కాకర కాయ రసం తాగండి. తాగగలిగితే నెలకోసారి వేపాకుల రసం తాగండి. ఇవన్నీ షుగర్‌ లెవెల్స్‌ తగ్గిస్తాయి.

ఇన్ని చేసినా మీ షుగర్‌ లెవెల్స్‌ 200 కంటే తగ్గడం లేదంటే మీ క్లోమము బాగా దెబ్బతిన్నట్టు. అప్పుడు మీకు ఇన్సులిన్‌ తప్పని సరి కావొచ్చు. అన్నింటికీ మించి కావాల్సింది దృఢచిత్తం. మన శరీరంలో 78 అంగాలు ఉన్నాయి. అందులో నాలుక ఒక్కటి. రుచి అవసరమే. కానీ మీరు రుచులకు బానిస అయిపోయి స్వీట్లు, హాట్లు, మురుకులు, తెల్ల అన్నం ఇలా తింటూ నాలుకను సంతోష పెట్టే వ్యసనానికి బానిసగా మారిపోయి ఉంటే మిమల్ని ఎవరూ రక్షించలేరు.

ఇలాంటి వారే.. తెగ ఫిలాసఫీ మాట్లాడుతుంటారు . ఇవన్నీ సాధ్యం కాదు .. అదీ ఇదీ అని తమలోని గిల్ట్‌ ఫీలింగ్‌ నొక్కేసి అడిక్షన్‌ను కొనసాగిస్తారు. వీరి గమనం రోజుకు ఒక్క టాబ్లెట్‌తో మొదలువుతుంది. అటు పై అది నాలుగు అయిదు.. బీపీ టాబ్లెట్‌… షుగర్‌ టాబ్లెట్‌ .. ఇలా పెరుగుతూ పోతుంది.

గుండె పోటు, పక్షవాతం, కిడ్నీ, డయాలిసిస్, కాళ్ళు నరుక్కోవడం .. ఒక మాటలో చెప్పాలంటే వీరు కార్పొరేట్‌ ఆసుపత్రులకు మహారాజ పోషకులు. ఒక కోణం నుంచి ఆలోచిస్తే వారే లేకపోతే హెల్త్‌ ఇన్సూరెన్సు కంపెనీలు మొదలు కొని స్టార్‌ ఆసుపత్రుల దాక ఏమై పోతాయో అనిపిస్తుంది.

ఇలాంటి వారికి నాపై కోపం వస్తుంది. వీడు కరోనా గురించి ఏదో సోది చెప్పేవాడు. ఇప్పుడు ఆగిపోయింది. ఇది బయటకు తీసాడు అనుకొంటారు.

వీరు మహారాజపోషకులు.. మహనీయులు.. కొవ్వొత్తి తాను కరుగుతూ లోకానికి వెలుగు నిచ్చినట్టు వీరు తాము నాశనం అయిపోతూ స్టార్‌ ఆసుపత్రులను బతికిస్తుంటారు. వారు చల్లగా ఉండాలంటే వీరి రుచుల వ్యసనం సాగాలి. దాని కోసం ఒక జస్టిఫెక్షన్‌ కావాలి. ఒక పిలాసఫి కావాలి. వారిని వదిలెయ్యండి.

అయ్యా.. అమ్మా.. మీరు మారాలి. తప్పక మారుతారు. మీ కోసం .. మీ పిల్లల కోసం .. మీ కుటుంబం కోసం మారాలి. ఇదేదో పెద్ద విషయం కాదు. కాస్త పట్టుదల. క్రమశిక్షణ. అంతే.

దగ్గర దారులు లేవు. ఆరోగ్యానికి ఉన్నది ఒకటే దారి. రహదారి. సిక్స్‌ లైన్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు లాంటిది. అదే నా దారి. మరి మీ దారి? సరైన నిర్ణయం తీసుకోండి.

మీకు అయినవారితో ఈ మెసేజ్‌ పంచుకోండి. నా పేరు అక్కర లేదు. క్రెడిట్స్‌ అక్కర లేదు. అజ్ఞాత వాసి అనుకోండి. అలాగే వెబ్‌ సైట్స్‌ వారు కూడా దీన్ని వాడుకోవచ్చు.

– వాసిరెడ్డి అమర్‌ నాథ్‌

Exit mobile version