Home న్యూస్ రియల్‌ ఎస్టేట్‌ అమ్మకాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి..!

రియల్‌ ఎస్టేట్‌ అమ్మకాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి..!

real estate sales
Image by Paul McGowan from Pixabay

హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ అమ్మకాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయని నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించింది. ఈ ఏడు తొలి ఆరు నెలల్లో కేవలం 59,538 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదేకాలంతో పోల్చితే ఇది 54 శాతం తక్కువ.

హైదరాబాద్‌లో ఈ సంఖ్య కేవలం 4,782 యూనిట్లు మాత్రమే. అంటే గత ఏడాది ప్రథమార్థంతో పోలిస్తే 42 శాతం తక్కువ. ‘ఇండియా రియల్‌ ఎస్టేట్‌ – హెచ్‌ 1 2020’ పేరుతో నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించిన నివేదిక ఈ గణాంకాలు ప్రచురించింది.

ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. వ్యాపారం డల్‌ అయ్యింది. ఎంత కాలం ఉంటుందో తెలియదు. కరోనా కంటే ముందే రియల్‌ ఎస్టేట్‌ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. డెవలపర్లు, బ్రోకర్ల అత్యాశతో రియల్‌ ఎస్టేట్‌ ధరలను అనూహ్యంత 40 శాతం పెంచి కూర్చున్నారు. కరోనా దెబ్బతో వాటివైపు చూసే సాహసం చేయడం లేదు.

ముడిపదార్థాల కొరత, కార్మికుల కొరత కూడా డెవలపర్లు ఎక్కువ సంఖ్యలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లను నిర్మించి  డెలివరీ చేయలేకపోయారని కూడా ఈ సంస్థ చెప్పింది. కానీ మార్కెట్లో ఉన్న అనేక యూనిట్లు అమ్ముడుపోకుండా ఉండడానికి కారణం రియల్‌ ఎస్టేట్‌ ధరలు ఆకాశంలో కూర్చోవడమే.

ఏప్రిల్‌–జూన్‌ కాలంలో ఏకంగా 84 శాతం అమ్మకాలు పడిపోయాయి. దేశవ్యాప్తంగా కేవలం 9,632 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదే కాలంలో హైదరాబాద్‌లో అసలు కొనుగోళ్లు, అమ్మకాలే లేవు.

అయితే కొనుగోళ్ల వైపు చూసేందుకు కనిపిస్తున్న ఒకే ఒక సానుకూల అంశం వడ్డీరేట్లు కాస్త తగ్గడం. ఎస్బీఐ హౌజింగ్ లోను వడ్డీ రేట్లు 6.95 నుంచి 7.35 శాతం మధ్య ఉన్నాయి. హెచ్.డి.ఎఫ్.సి. కూడా క్రెడిట్ స్కోర్ 780 పైగా ఉన్న వారికి 6.95 శాతానికి రుణం అందిస్తోంది.

మార్జిన్‌ మనీ అందుబాటులో ఉండి.. రుణ అర్హత కలిగి ఉంటే ఇళ్ల వేట షురూ చేసి ఎక్కడో ఒక చోట అడ్వాన్స్‌ ఇచ్చేయడం ఉత్తమం. ఇప్పటికే హైదరాబాద్‌లో 5.2 శాతం ధరలు తగ్గాయని మాజిక్‌ బ్రిక్స్‌ సంస్థ వెల్లడించింది.

మరో ఒకటీ రెండు నెలల్లో ఇంకాస్త ధరలు తగ్గే అవకాశం ఉన్నందున ఇళ్ల కోసం వెతుకులాట మొదలుపెట్టొచ్చు.

Exit mobile version