భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా .. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో వస్తున్న కొత్త సినిమా. ఇది ఫస్ట్ లుక్ విడుదలైంది. ఓ చారిత్రక సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. 1971లో ఇండియా– పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు గుజరాతీ మహిళ సుందర్‌బెన్ జెఠా మధర్‌పర్యా అనే సాహసవంతురాలు 299 మంది మహిళలతో భారత సైన్యానికి మద్దతుగా నిలిచిన సంఘటనలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇండియా–పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ భుజ్‌లోని ఎయిర్ బేస్‌పై బాంబులతో దాడి చేసింది. 14 రోజుల పాటు 35 సార్లు దాడిచేసింది. 92 బాంబులు, 22 రాకెట్లను ఈ దాడికి ఉపయోగించింది.
భుజ్ కచ్ జిల్లాలో ఉంది. భుజ్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్ బేస్ ఉంది. ఎయిర్‌బేస్ ధ్వంసం చేసినప్పుడు మూడు రోజుల్లోనే తిరిగి నిర్మించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ సాహసవంతమైన కార్యాన్ని సుందర్‌బెన్ జెఠా ఎలా పూర్తిచేశారు? అందుకు తోటి మహిళలు ఎలా సహకరించారు? ఆమెను భారత ప్రభుత్వం ఎలా సత్కరించింది? వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో సోనాక్షి సిన్హా ధీర వనితగా ముందుకు నడుస్తున్న చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
అజయ్ దేవ్‌గన్ ఈ చిత్రంలో విజయ్ కార్నిక్ పాత్రలో నటిస్తున్నారు. విజయ్ కార్నిక్ ఎయిర్‌ఫోర్స్ అధికారి. భుజ్ ఎయిర్ బేస్ కు కమాండర్ గా ఉన్నారు. ఈయనే ఈ మూడు వందల మంది మహిళలకు ఎయిర్ బేస్ పునర్నిర్మాణం చేపట్టేందుకు ప్రేరణ కల్పించారు.
సంజయ్‌దత్, రాణా దగ్గుబాటి, ప్రణితా సుభాష్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ 2019లోనే ప్రారంభమైంది. కరోనా ఎఫెక్ట్‌తో ఆలస్యంగా నిర్మితమవుతోంది.
డిస్నీ హాట్‌స్టార్‌లో భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
భుజ్ మూవీ డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న చిత్రాల జాబితాలో ఇది కూడా చేరింది. ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. అభిషేక్ దుధైయ్యా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం ఆరో ప్రవో ముఖర్జీ అందిస్తున్నారు.