Home లైఫ్‌స్టైల్ Side Effects of Shapewear: అమ్మాయిలూ.. షేప్‌వేర్ ధరిస్తున్నారా.. అయితే మీ యోని జాగ్రత్త

Side Effects of Shapewear: అమ్మాయిలూ.. షేప్‌వేర్ ధరిస్తున్నారా.. అయితే మీ యోని జాగ్రత్త

shape wear
షేప్ వేర్ ధరిస్తున్నారా? అయితే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి (Pexels)
side effects of shapewear: అమ్మాయిలూ షేప్‌వేర్ ధరిస్తున్నారా.. దీని వల్ల కలిగే ఇబ్బందులు తెలుసా? అమ్మాయిలు సన్నగా ఉండేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే అప్పుడే వారికి నచ్చిన దుస్తులు వేసుకోగలరు. అయితే కొందరు బొద్దుగా ఉంటారు. అలాంటి సమయంలో నచ్చిన దుస్తులు వేసుకుని.. పొట్టను కవర్ చేసేందుకు షేప్ వేర్ ఉపయోగిస్తారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కాలం మారేకొద్ది అందానికి, శరీరానికి అనువుగా చాలా ప్రొడెక్ట్స్ మార్కెట్లలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఈజీగా ఉందని, అందంగా చూపిస్తుందని ఏదిపడితే అది వాడితే మొదటికి మోసం వస్తుంది అంటున్నారు నిపుణులు. వాటిలో షేప్‌వేర్స్ కూడా ఒకటి. షేప్‌వేర్ తక్షణ స్లిమ్మింగ్ ఎఫెక్టులు అందిస్తాయి. అందుకే వీటికి విపరీతమైన ప్రజాధారణ ఉంది. అయితే ఈ షేప్‌వేర్ ఎక్కువసేపు, తరచుగా ధరిస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (యూటీఐ), ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. 
 
అవునండి. ఎక్కువగా, తరచుగా షేప్‌వేర్ ధరించడం వల్ల జననాంగ ప్రాంతంలో తేమ, వేడి ఎక్కువైపోతుంది. తద్వార బ్యాక్టీరియా పెరుగుదలకు అనువుగా మారుతుంది. అంతేకాకుండా షేప్‌వేర్ సాధారణంగా పొత్తికడుపు చుట్టూ బిగుతుగా ఉంటుంది. ఇది యోని ప్రాంతంలో గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీని కారణంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దీనివల్ల వాపు, దురద, చికాకు, యోని డిశ్చార్జ్ అవుతుంది. 
 
షేప్‌వేర్ ధరించడం వల్ల యూటీఐ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని జర్నల్ ఆఫ్ లోయర్ జెనిటల్ ట్రాక్ట్ డిసీజెస్లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. బిగుతుగా ఉండే దుస్తులు.. ముఖ్యంగా షేప్‌వేర్ యూటీఐ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు షేప్‌వేర్‌కు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఎక్కువసేపు లోదుస్తులను, షేప్‌వేర్‌లను ధరించకపోవడమే బెటర్. లేదంటే మీరు అనేక దీర్ఘకాలిక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

నరాలు పట్టేస్తాయి..

ఎక్కువ సమయం షేప్‌వేర్ ధరించడం వల్ల నరాలు పట్టేస్తాయి. దీనివల్ల కడుపు చుట్టూ.. తిమ్మిరి లేదా జలదరింపు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ షేప్‌వేర్‌ను సర్దుబాటు చేయాలి. లేదంటే అది నాడిపై ఒత్తిడిని పెంచుతుంది. సర్దుబాటుతో పని జరగకపోతే వెంటనే దాన్ని తీసేయండి. 

రక్త ప్రసరణ ఆగిపోతుంది..

మీరు మంచి లుక్ కోసం బిగుతుగా ఉండే షేపర్‌లను ధరిస్తే.. అది మీకే ప్రమాదమవుతుంది. రక్త ప్రసరణ తగ్గిపోయి.. రక్తం గడ్డకడుతుంది. కొన్నిసార్లు చర్మంపై మచ్చలు ఏర్పడిపోతాయి. కళ్లుతిరగడం, నడుస్తున్నప్పుడు నొప్పి కలుగుతాయి. ఒక వేళ మీకు మధుమేహం లేదా గుండె జబ్బులు వంటి సమస్యలు ఉంటే అది మీ ప్రాణాలకే ప్రమాదం తీసుకొస్తుంది.  

జీర్ణ సమస్యలు

మీ పొట్ట చుట్టూ బిగుతుగా ఉండే షేపర్‌లు ధరిస్తే.. అది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కడుపుపైన ఒత్తిడి పెరిగి జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. తద్వార గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పెరుగుతాయి. షేప్‌వేర్ ధరించడం వల్ల తరచుగా మూత్రవిసర్జన, మూత్రాశయం మీద బలమైన ఒత్తిడి పడుతుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వ్యక్తులు షేప్‌వేర్ ధరించడం మానుకోవాలి. ఎందుకంటే పరిస్థితి మరింత దిగజారిపోతుంది.

చర్మ సమస్యలకు కారణం

షేప్‌వేర్ మీ చర్మానికి పైన ఉంటుంది. అదనంగా దీనిని ధరించడం వల్ల మీకు ఎక్కువ చెమట పట్టవచ్చు. కాబట్టి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఎక్కువసేపు ధరించడం వల్ల చర్మంపై చికాకు ఏర్పడుతుంది. ఇది చర్మ వ్యాధులు లేదా దురద సమస్యలకు దారితీస్తుంది. మీకు ఇప్పటికే ఈ సమస్యలు ఉంటే వాటిని ధరించడం మానేయడమే మంచిది.
Exit mobile version