ఈ అక్టోబరు నెలలో సూర్య గ్రహణం, అలాగే చంద్ర గ్రహణం ఏర్పడబోతున్నాయి. అక్టోబరు 14న సూర్య గ్రహణం, అక్టోబరు 28న చంద్ర గ్రహణం ఏర్పడనున్నాయి. ఆయా గ్రహణాల గురించి ఇక్కడ సమగ్రంగా తెలుసుకోండి.
సూర్య గ్రహణం ఎప్పుడు?
సూర్య గ్రహణం అక్టోబరు 14, శనివారం ఏర్పడుతుంది. రాత్రి 8 గంటల 34 నిమిషాలకు ప్రారంభమై తెల్లవారు జామున 2.24 వరకు ఉంటుంది. అయితే ఇది భారతదేశంలోని వివిధ నగరాలను బట్టి మారుతుంది. అయితే ఈ సూర్య గ్రహణం మన దేశంలో కనిపించదు. పశ్చిమ అమెరికా, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన దేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.
సూర్యుడి కాంతి భూమికి చేరుకోకుండా మధ్యలో చంద్రుడు తాత్కాలికంగా అవరోధంగా కనిపిస్తాడు. దీనినే సూర్య గ్రహణం అంటారు. అక్టోబరు 14న చంద్రుడి అంచుల సూర్యరశ్మి వలయాకారంలో కనిపిస్తుంది. దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు.
చంద్రగ్రహణం ఎప్పుడు?
ఈనెల 28న చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. దీనిని సంపూర్ణ చంద్రగ్రహణంగా అభివర్ణిస్తున్నారు. అక్టోబరు 28 తెల్లవారుజామున ఒంటి గంటకు ప్రారంభమై తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యుడికి, చంద్రుడికి భూమి అడ్డుగా ఉన్నప్పుడు చంద్రుడి ఉపరితలంపై నీడ పడుతుంది. దీనినే చంద్ర గ్రహణం అంటారు. ఇది ఇండియా, అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో కనిపించనుంది. చంద్రగ్రహణం మన దేశంలో ఉన్నందున హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణ నియమాలు పాటించాలని జ్యోతిష శాస్త్ర పండితులు సూచిస్తున్నారు.