Home ఎంటర్‌టైన్‌మెంట్‌ sushant singh rajput: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదా? అతనిది హత్యేనా?

sushant singh rajput: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదా? అతనిది హత్యేనా?

sushant singh rajput
sushant singh rajput

sushant singh rajput: సీరియల్ నటుడిగా బుల్లితెరపై మెరిసి, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెండితెరకు పరిచయమైన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. వరుస అవకాశాలు అందుకుంటూ, స్టార్ హీరో అవ్వడానికి కొద్ది దూరంలో ఉండగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త వచ్చింది. ఆ వార్త ఒక్కసారిగా బాలీవుడ్‌ను కుదిపేసింది. కెరీర్ పీక్ స్టాయిలో ఉన్న సమయంలో అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అనుమానం అందరికి వచ్చింది. కానీ కారణాన్ని మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. అసలు అతని ఆత్మహత్యను సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించలేదు. అతను ఆత్మహత్య చేసుకున్నాక ఒక్క స్టార్ హీరో కానీ,హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ… మద్దతుగా ఒక్క పోస్టు చేసింది లేదు. గట్టి దర్యాప్తుకు పట్టుపట్టింది లేదు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సినిమాలలో ఎదిగిన స్టార్ సుశాంత్, అలాంటి వ్యక్తి చనిపోతే వేయి గొంతుకలున్న బాలీవుడ్ మూగబోయింది కానీ, ఎక్కడా గొంతెత్తి మాట్లాడింది లేదు. అదే నాన్నల, తాతల నుంచో వారసత్వంగా వచ్చిన హీరోయిజాన్ని అనుభవిస్తున్న ఏ హీరో అయినా ఇలా అర్థాంతరంగా కన్నుమూస్తే ఈపాటికి ట్విట్టర్ జామ్ అయిపోయేది. పైస్థాయి నుంచి ఒత్తిళ్లు తెచ్చి మరీ హంతకులెవరో తేల్చేవారు. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో అలా జరుగలేదు. అందుకే ఆయన ఆత్మహత్య కేసులో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు.

నోరు విప్పిన మార్చురీ సిబ్బంది

సుశాంత్ 34 ఏళ్ల వయసులో 2020లో జూన్ 14 తన బాంద్రా నివాసంలోనే శవమై కనిపించాడు. పోస్టుమార్టంలో ఊపిరి ఆడక మరణించినట్టు తేలింది. అతడి మరణంపై అనేక వివాదాలు రేగడంతో సీబీఐకి అప్పగించారు.కానీ ఇంతవరకు కేసు తేలలేదు. ఇప్పుడు ఆ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. సుశాంత్ మరణించాక అతడిని శవ పరీక్ష నిమిత్తం ముంబైలోని కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే అటాప్సీ నిర్వహించారు. అందులో ఆయన ఉరివేసుకోవడం వల్ల ఊపిరి ఆడక మరణించినట్టు నివేదికను ఇచ్చారు. అప్పట్లో మార్చురీ యూనిట్లో పనిచేసిన రూప్ కుమార్ ఇన్నాళ్లు తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ శవానికి పోస్టుమార్టం చేస్తున్నప్పుడు తాను అక్కడే ఉన్నానని చెప్పుకొచ్చాడాయన. శవం చూసిన వెంటనే ఆత్మహత్య అనిపించలేదని చెప్పాడు. తాను 28 ఏళ్ల పాటూ అదే ఉద్యోగంలో ఉన్నట్టు తెలిపాడు. సుశాంత్ శరీరంపై గాయాలు ఉన్నాయని, అతని ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయని చెప్పాడు. తాను అదే విషయాన్ని అక్కడున్న తన సీనియర్ ఉద్యోగులకు చెప్పానని, వారు నీపని నువ్వు చూసుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు చెప్పాడు రూప్ కుమార్. సుశాంత్ మెడపై రెండు నుంచి మూడు గుర్తులు కూడా ఉన్నాయని చెప్పాడు. నిజానికి పోస్ట్‌మార్టం రికార్డ్ చేయాల్సి ఉండగా, ఆ రోజు కేవలం ఫోటోలను మాత్రమే తీయాలని ఉన్నతాధికారులు చెప్పారని,తాము ఆ ప్రకారమే చేశామని తెలిపాడు. ఈయన చెప్పిన ప్రకారం చూస్తే మరణానికి ముందు సుశాంత్‌కు భౌతిక గాయాలు తగిలినట్టు అర్ధం అవుతుంది. రూప్ కుమార్ అభిప్రాయం ప్రకారం అతడిని ఎవరైనా కొట్టి, చివర్లో ఉరి వేసినట్టు అర్థమవుతోంది.

సీబీఐ పట్టించుకుంటుందా?

ఈ వార్తలను చదివిన సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ సీబీఐకి లేఖ రాసింది. సుశాంత్‌ది హత్యకు గురయ్యాడన్న వాదనలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆమె తన లేఖలో కోరింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఆత్మహత్యగా కనిపించడం లేదని ముంబైలోని కూపర్ హాస్పిటల్ మార్చురీ యూనిట్ ఉద్యోగి చెప్పిన ఒక రోజు తర్వాత, బీహార్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుప్తేశ్వర్ పాండే కూడా మీడియాతో అదే విషయం మాట్లాడారు. ఆయన ప్రస్తుతం మతబోధకుడిగా మారారు. అంతకుముందు ఆయన సుశాంత్ కేసు దర్యాప్తు బృందానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడైనా నిజం బయటికి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. సుశాంత్ స్వస్థలం బీహార్లోని పాట్నా. అందుకే ఆయన ముంబైలో చనిపోయినా కూడా ముంబై పోలీసులతో పాటూ, బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. బీహార్ నుంచి వచ్చిన టీమ్‌కు గుప్తేశ్వర్ పాండే నాయకుడిగా ఉన్నారు. ఆయన బీహార్ నుంచి దర్యాప్తు నిమిత్తం ముంబైకు టీమ్‌ను పంపినప్పటికీ, ముంబై పోలీసుల నుంచి ఎలాంటి సహకారం అందలేదని చెప్పారు. మాకు వారు సహకారం అందించినట్టయినా లేక మరో  15 రోజులు సమయం ఇచ్చినా కచ్చితంగా కేసు చేధించే వారమని చెప్పారు. సుశాంత్ మరణించాక కొన్ని రోజులకే కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఇంజినీరింగ్ మధ్యలో వదిలి…

వెండితెరపై వెలగాలన్న కోరికతో ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలి నటనవైపు వచ్చాడు సుశాంత్. ఇతనిది బీహార్లోని పూర్నియా.సుశాంత్ స్కూలు చదువు పాట్నాలోనే సాగింది. కాలేజీ విద్యకు ఢిల్లీ చేరుకున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్లో చేరినప్పటికీ నటన, డ్యాన్సుపై ఆసక్తితో చదువును నిర్లక్ష్యం చేశాడు. దీంతో మూడో ఏడాదిలో ఇంజినీరింగ్ వదిలి నటన వైపు వచ్చేశాడు. 2008లో హిందీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టాడు. ఆయన నటించిన పవిత్ర రిష్తా సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే డ్యాన్సు రియాల్టీషోలలో కూడా పాల్గొన్నాడు. అతని గ్రేస్, డ్యాన్సు చూసి సినిమా అవకాశాలు వచ్చాయి. 2013లో ‘కాయ్ పో చె’, శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాల్లో నటించాడు. అందులో శుద్ధ్ దేశీ రొమాన్స్ సూపర్ హిట్ కొట్టింది. ఆ తరవుాత పికె, రాబ్తా, ఎంఎస్ ధోనీ, వెల్కమ్ టు న్యూయార్క్, కేదార్ నాథ్, చిచ్చోరే వంటి సినిమాల్లో నటించాడు. తక్కువ సమయంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోగా ఎదిగాడు. ఆర్ధికంగానూ ఉన్నత స్థితిలో ఉన్న హీరో సుశాంత్. అప్పటికే చాలా సినిమాలకు కమిట్ అయ్యాడు. అయినా ఆయన ఆత్మహత్య చేసుకోవడం అందరికీ అనుమానాలు పెంచింది.

Exit mobile version