చిలగడదుంపతో కూర వండుకుని తినడం ఎప్పుడూ వినలేదా? చిలగడదుంప వంకాయ కూర సూపర్ ఉంటుందండి బాబూ.. వీటిని ఎక్కువగా ఉడకబెట్టుకుని తింటారు. కొద్దిమంది మాత్రమే కూరగా వండుకుంటారు. చిలగడదుంపలను ఎలా తీసుకున్నా ఆరోగ్యకరమే. మామూలుగా దుంపల కూరలలో బంగాళదుంప, చామదుంప సాధారణంగా వండుకునేవే. అయితే చిలగడదుంప కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఎర్రదుంప లేదా స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు. వట్టి చిలగడదుంప కూర వండుకునే కంటే అందులో వంకాయ వేసి వండితే కొద్దిగా డిఫెరెంట్‌గా, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చిలకడదుంప కూర అన్నం లేదా చపాతీకి కూడ పర్ఫెక్ట్‌గానే ఉంటుంది. దీన్నెలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
చిలగడదుంప వంకాయ కూరకు కావలసిన పదార్థాలు:
- చిలగడదుంప – 200 గ్రాములు
- వంకాయలు – నాలుగు
- ఉల్లిపాయ ముక్కలు – కప్పు
- పచ్చిమిర్చి – రెండు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
- కారం – ఒక టేబుల్ స్పూన్
- పసుపు – చిటికెడు
- ఉప్పు- తగినంత
- కరివేపాకు – కొద్దిగా
- ధనియాల పొడి – ఒక స్పూన్
- జీలకర్ర పొడి – ఒక స్పూన్
- గరం మసాలా – ఒక స్పూన్
- ఆవాలు – ఒక స్పూన్
- శనగపప్పు – ఒక స్పూన్
- కొత్తిమీర – కొద్దిగా
- నూనె – రెండు స్సూన్లు
- టమాటాలు – రెండు
చిలగడదుంప వంకాయ కూర తయారీ విధానం:
- ముందుగా స్టౌ మీద కుక్కర్ పెట్టుకుని నూనె పోసుకుని వేడికాగానే అందులో ఆవాలు, శనగపప్పు వేసి కొద్దిగా వేయించాలి.
- ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
- తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకూ వేయించాలి.
- ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిలగడదుంప, వంకాయ ముక్కలను అందులో వేసి కలపాలి.
- ముక్కలు కొద్దిగా మగ్గడానికి ఉప్పు వేయాలి. అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలపాలి.
- చిలకడదంప, వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత దానిలో టమాటా ముక్కలను వేసి మెత్తబడే వరకూ ఒక నిమిషం పాటు ఉంచాలి.
- కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలుపుకుని మరొక నిమిషం పాటు ఉండనివ్వాలి.
- ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఆపై స్టౌ అఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి.
అంతే ఎంతో టేస్టీగా ఉండే చిలగడదుంప వంకాయ కూర రెడీ. అన్నం, చపాతీ, రోటీ.. ఇలా దేనికైనా పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్