Home ఎంటర్‌టైన్‌మెంట్‌ క్లాసిక్‌ మూవీ : ది పర్‌స్యూట్‌ ఆఫ్‌ హాపీనెస్‌ : మనల్ని మార్చేసే మూవీ

క్లాసిక్‌ మూవీ : ది పర్‌స్యూట్‌ ఆఫ్‌ హాపీనెస్‌ : మనల్ని మార్చేసే మూవీ

the pursuit of happyness
the pursuit of happyness
[yasr_overall_rating size=”–” postid=”2357″]

ది పర్‌స్యూట్‌ ఆఫ్‌ హాపీనెస్‌ మూవీ 2006లో విడుదలైన హాలీవుడ్‌ క్లాసిక్‌ మూవీ. చిన్న కష్టమొస్తేనే మనం విలవిలలాడిపోతాం. ఇన్ని కష్టాల మధ్య మన కలల్ని కాపాడుకోవాలన్న ఆలోచనైనా వస్తుందా? ఉన్న పళంగా నిలువ నీడ లేక, ఒక పూట భోజనం కూడా దొరకని పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? ఒక్కడంటే తట్టుకోవచ్చేమో.. కానీ ఐదేళ్ల చిన్నారితో తనతో పాటూ ఉంటే.. ఆ చిన్నారికి కూడా భోజనం పెట్టలేని పరిస్థితి ఎదురైతే మనం తట్టుకోగలమా? అలాంటి ఎన్నో కష్టాలను తట్టుకుంటూ తన కలను నిలబెట్టుకున్న ఓ సేల్స్‌మెన్‌ నిజజీవిత గాథ ఈ ది పర్‌స్యూట్‌ ఆఫ్‌ హాపీనెస్‌.

మూవీ రివ్యూ : ది పర్‌స్యూట్‌ ఆఫ్‌ హాపీనెస్‌
రేటింగ్‌ : 4.25/5
నటీనటులు : విల్‌స్మిత్, జేడెన్‌ స్మిత్, తాండీ న్యూటన్‌
ప్రొడ్యూసర్‌ : విల్‌స్మిత్, టాడ్‌ బ్లాక్‌
దర్శకుడు : గాబ్రియేల్‌ మ్యూసినో
విడుదల : డిసెంబర్‌ 25, 2006
నిడివి : 117 నిమిషాలు
ఓటీటీ : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్

ది పర్‌స్యూట్‌ ఆఫ్‌ హాపీనెస్ స్టోరీ

అమెరికాకు చెందిన క్రిస్‌ గార్డ్‌నర్‌ తన పొదుపు డబ్బులు మొత్తం వెచ్చించి పోర్టబుల్‌ బోన్‌ డెన్సిటీ స్కానర్లను కొనుగోలు చేస్తాడు. వీటిని అమ్ముతూ ఉపాధి పొందాలన్నది ఆయన లక్ష్యం. అయితే అప్పటివరకు ఉన్న స్కానర్లతో పోలిస్తే అవి అధునాతనమైనప్పటికీ వాటి ధర ఎక్కువ కావడంతో డాక్టర్లు వాటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపరు. నెలకొక్క స్కానర్‌ అమ్ముడవడమే మహా కష్టంగా ఉంటుంది.

తన భార్య లిండా చిరుద్యోగం చేస్తుంటుంది. అయితే ఇంటి అద్దె, ఖర్చులు, ఐదేళ్ల చిన్నారి క్రిస్టోఫర్‌ జూనియర్‌ డే కేర్‌ కోసం ఫీజు.. వీటన్నింటికీ వీరిద్దరి సంపాదన సరిపోదు. పైగా సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నందున తన కార్‌ పార్కింగ్‌ చేసిన ప్రతి చోట పార్కింగ్‌ వసతి లేకపోవడంతో జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

ఆర్థిక కష్టాలు క్రిస్‌ వైవాహిక బంధాన్ని అవహేళన చేస్తాయి. భార్య లిండా కొడుకును తీసుకుని దూరంగా వెళ్లిపోతుంది. కానీ కొడుకు మీద ఉన్న అపారమైన ప్రేమ కారణంగా క్రిస్‌ తన జూనియర్‌ క్రిస్టోఫర్‌ను ఇంటికి తెచ్చకుంటాడు. భార్య మరో నగరం వెళ్లిపోతుంది. ఇక అక్కడి నుంచి క్రిస్‌ కష్టాలు మొదలవుతాయి.

ఈ సేల్స్‌మెన్‌ వృత్తితో ఆర్థికంగా గట్టెక్కడం కష్టమని భావించిన క్రిస్‌.. స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీలోని ఉద్యోగులంతా హాపీగా ఉండడం చూసి అక్కడ ఇంటర్న్‌షిప్‌ సంపాదిస్తాడు. ఆరు నెలల వరకు అక్కడ పైసా రాదని తెలిసి, ఆరు నెలల తరువాత కూడా ఎంపికవుతానో కానోనని కూడా తెలిసీ అందులో చేరిపోతాడు.

ఈలోగా ఇంటి ఓనర్‌ అద్దె చెల్లించలేదని ఖాళీ చేయిస్తాడు. అక్కడి నుంచి కొడుకుతో సహా చిన్న మోటెల్‌కు చేరుకున్న క్రిస్‌… ఉన్న కొద్దిపాటి డబ్బులతో కొద్దిరోజులు గడుపుతాడు. అక్కడ డబ్బులు ఇవ్వడం లేదని ఓనర్‌ క్రిస్‌ లగేజీని బయటపడేస్తాడు.

మిగిలిన ఒక స్కానర్, లగేజీ, కొడుకును తీసుకుని ఎక్కడికో తెలియని గమ్యం ప్రారంభిస్తాడు. చివరకి రైల్వే స్టేషన్‌లోని వాష్‌ రూమ్‌లో కొడుకుతో సహా ఓ రాత్రి గడిపేస్తాడు. చివరకు ఉచితంగా దొరికే డార్మెటరీ కోసం మరుసటి రోజు నుంచి సాయంత్రం ఐదుగంటలకే లైన్లో ఉండాడు. ఒక్కోసారీ అదీ దొరకదు. జేబులో డబ్బలు అయిపోవడంతో రెస్టారెంట్లో ఉచితంగా దొరికే భోజనం చిన్నారి క్రిస్టోఫర్‌కు ఇప్పిస్తాడు.

అయితే ఇన్ని కష్టాల మధ్య చలించకుండా, కుమారుడిని అంతకంటే రెట్టింపు ప్రేమతో చూసుకుంటూ చివరికి క్రిస్‌ ఎలా విజయం దక్కించుకుంటాడు? చివరకు ఏమవుతాడన్నది ఈ కథ. 

హృదయాన్ని కదలించే సన్నివేశాలు..

రైల్వేస్టేషన్‌ మరుగుదొడ్డిలో ఉండాల్సి వచ్చినప్పుడు కుమారుడిని ఒళ్లో పడుకోబెట్టుకుని తను మాత్రం కన్నీరు కారుస్తాడు క్రిస్‌. మనకు కష్టమొస్తే మన చిరాకును ఇతరుల మీద కనబరుస్తాం. భరించే శక్తి ఉండదు. కానీ క్రిస్‌ ఓపిక, తన కలపై తనకు ఉన్న నమ్మకం, కుమారుడిపై, ఇతరులపై కురిపించే అపారమైన ప్రేమ మనల్ని కదిలిస్తుంది. చేతిలో పదిహేను డాలర్లు మాత్రమే ఉన్నప్పుడు, కుమారుడికి సరైన భోజనం కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో 5 డాలర్లు ఇంకొకరు అడిగితే ఇచ్చేంత పెద్ద మనసు.

చిత్రంలో క్రిస్‌ గార్డ్‌నర్‌ పాత్రను పోషించిన విల్‌స్మిత్‌ అద్భుతంగా ఒదిగిపోయాడు. కొడుకు క్రిస్టోఫర్‌ జూనియర్‌ పాత్రలో నటించిన చిన్నారి విల్‌ స్మిత్‌ కుమారుడే. చిన్నారి పేరు జేడెన్‌స్మిత్‌. తన అద్భుత నటనతో అనేక ప్రశంసలు మూటగట్టుకున్నాడు.

కలల్ని కాపాడుకోవాలన్న గొప్ప సందేశం.. కష్టించి సాధించడంలో అసలైన అనందం ఉందన్న సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది. భార్య వెళ్లిపోయినా కుంగిపోలేదు. తన కలల్ని పేదరికం వెక్కరించిందే గానీ.. సాధించకుండా అడ్డుకోలేదు. జీవితం కొన్నిసార్లు చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. కరోనా లాంటి గడ్డు పరిస్థితుల్ని తెస్తుంది. అయినా ముందుకు పోవాల్సిందే. భవిష్యత్తు ఏం తెస్తుందో తెలియదు. అయినా మనం ముందుకు సాగుతూనే ఉండాలి. మనం చేయాల్సిందంతా చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మన కలల్ని ఇతరులు నిరుత్సాహ పరిచే ఛాన్స్ ఇవ్వకూడదు.. ఇలాంటివెన్నో పాఠాలను మనకు ఈ మూవీ బోధిస్తుంది.

హాలీవుడ్‌ క్లాసిక్‌ మూవీస్‌లో ఒకటైన ది పర్‌స్యూట్‌ ఆఫ్‌ హాపినెస్‌ తప్పకచూడాల్సిన చిత్రం. కుటుంబ సభ్యులతో సహా చూడాల్సిన మంచి చిత్రం ఇది. అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

Exit mobile version