Home ఎంటర్‌టైన్‌మెంట్‌ టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ: జొన్నలగడ్డ సిద్దు టిల్లు క్రేజ్ కంటిన్యూ చేశాడా?

టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ: జొన్నలగడ్డ సిద్దు టిల్లు క్రేజ్ కంటిన్యూ చేశాడా?

tillu square movie poster
టిల్లు స్క్వేర్ మూవీలో జొన్నలగడ్డ సిద్దు, అనుపమ పరమేశ్వరన్

టిల్లు స్క్వేర్ మూవీ డీజే టిల్లు క్రేజ్‌ని నిలబెట్టుకుందా? సినీ ఇండ‌స్ట్రీలో టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఈ శుక్రవారం మార్చి 29, 2024న థియేటర్లలో విడుదలైంది. డీజే టిల్లుతో మంచి క్రేజ్‌ ద‌క్కించుకున్న సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ త‌న‌దైన శైలిలో యాక్టింగ్ చేస్తూ ఒక డిఫ‌రెంట్ ట్రెండ్‌ని క్రియేట్ చేశాడు. డీజే టిల్లు సినిమా పాటలు, డైలాగులు బ్రేకప్ అయిన కుర్రాళ్లకు మాంచి కిక్కిచ్చింది. సీక్వెల్‌గా వ‌చ్చిన టిల్లు స్క్వేర్ ఎలా ఉందో ఈ మూవీ రివ్యూలో ఇక్కడ తెలుసుకోండి.

టిల్లు స్క్వేర్ కథ ఇదే

సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ డీజే టిల్లు పేరుతో త‌న ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో క‌లిసి ఈవెంట్ల‌ను కండక్ట్ చేస్తుంటాడు. ఈ టైంలో టిల్లు‌కి లిల్లి(అనుప‌మ పరమేశ్వరన్)అనే ఆమ్మాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. వాళ్లు అనుకోకుండా ఒక ప‌బ్‌లో క‌లుసుకుంటారు. 

టిల్లు మాట, అత‌ని స్టైల్ అంతా న‌చ్చి తొలిచూపులోనే ప‌డిపోయానన్నట్టు టిల్లుతో పెద‌వి క‌లుపుతుంది. ఆవిధంగా వాళ్లిద్ద‌రూ ఫిజిక‌ల్‌గా ద‌గ్గ‌ర‌వుతారు. అంతే ఇంకేముంది? తెల్లారేస‌రికి చూస్తే టేబుల్‌పై లెట‌ర్ పెట్టి లిల్లీ వెళ్లిపోతుంది. ఆ లెట‌ర్ చూసి టిల్లు మైండ్ బ్లాక్ అవుతుంది.

ఆ ఒక్క రోజులోనే టిల్లు త‌న‌పై ప్రేమను పెంచుకుని పిచ్చ‌వాడిలా లిల్లీని వెతికేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అలాంటి సంద‌ర్భంలో ఒక రోజు లిల్లి ఒక ఆస్ప‌త్రిలో టిల్లుకి ఎదురై త‌ను ప్రెగ్నెంట్ అని టిల్లుకి చెప్ప‌డంతో త‌ను ఆశ్చ‌ర్య‌పోతాడు. 

ఇలా షాక్‌లో ఉండ‌గానే టిల్లు బ‌ర్త్ డే వ‌చ్చేస్తుంది. ఈ సంద‌ర్భంగా ఆ రోజే లిల్లీ టిల్లును త‌న అపార్ట్‌మెంట్‌కి ర‌మ్మ‌ని చెప్తుంది. టిల్లు ఉత్సాహంతో వెళ్లేస‌రికి అక్క‌డ లిల్లీకి బ‌దులు రాధిక (నేహ శెట్టి) ఉండ‌డంతో మ‌ళ్లి షాక్ అవుతాడు టిల్లు. అస‌లు లిల్లీ ఉండాల్సిన చోట రాధిక ఎందుకు ఉంది? లిల్లీకి, రాధిక‌కి సంబంధం ఏమిటి? టిల్లూకి లిల్లీ ఎందుకు ద‌గ్గ‌రయింది? టిల్లు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు? ఈ క‌థ‌లో మ‌హ‌బూబ్ ఆలీ (ముర‌ళీ శ‌ర్మ‌) ఎవ‌రు? ఇవ‌న్నీ తెలియాలంటే టిల్లు స్క్వేర్ చూడాల్సిందే. 

టిల్లు స్క్వేర్ విశ్లేష‌ణ

టిల్లు స్క్వేర్ సినిమా క‌థ మొత్తం రెండున్న‌ర గంట‌ల పాటు వినోదాన్ని పంచింది.  సాలిడ్‌గా కామెడీ అందివ్వ‌డంతోపాటు సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ డైలాగ్ డెలివ‌రీ ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని చెప్ప‌వ‌చ్చు. టిల్లు క్యారెక్ట‌ర్‌కి ధీటుగా లిల్లీ పాత్రలో హిరోయిన్ అన‌ప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా మంచి అభినయం ప్రదర్శించింది. గతంలో లేనంత డిఫరెంట్ లుక్, క్యారెక్ట‌ర్‌తో, త‌న అంద‌చందాల‌తో ఆడియ‌న్స్‌ని వావ్ అనిపించింది. 

ఇక మిగిలిన న‌టీన‌టులు ముర‌ళీ శ‌ర్మ‌, ప్రిన్స్ త‌దిత‌రులు త‌మ త‌మ పాత్ర‌ల్లో న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. అయితే సెకండాఫ్‌లో కొన్ని సీన్స్, కొన్ని ట్విస్ట్‌లు సినిమాకి మైన‌స్‌గా చెప్ప‌వ‌చ్చు. సంగీతం, టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమాకి రామ్ మిర్యాల‌, భీమ్స్ సిసిరోలియో సంగీతం ఆకట్టుకుంది. డీజే టిల్లు మ్యూజిక్ ఏ విధంగా మారుమోగిందో అదే స్థాయిలో టిల్లు స్క్వేర్‌లో కూడా భీమ్స్ త‌న సంగీతంతో యూత్‌ని ఉర్రూత‌లూగించార‌ని చెప్ప‌వ‌చ్చు. సాయి ప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ ఆకట్టుకుంటుంది. ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తన మ్యాజిక్ కామెడీని కంటిన్యూ చేయ‌డంతో సినిమాకి ప్ల‌స్ పాయింట్‌గా మారింది.

ఇంట‌ర్వెల్ నుంచి ఎన్నో ఊహించ‌ని ట్విస్టుల‌తో సినిమా సాగుతుంది. కాక‌పోతే కొన్ని సీన్లు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి ఇబ్బంది క‌లిగించ‌డం, సెకండాఫ్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ త‌గ్గ‌డం దీనికి మైన‌స్‌గా చెప్ప‌వ‌చ్చు. 

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version