Home ట్రావెల్ బండి బండి రైలు బండి.. వేళకంటూ వచ్చిందండి

బండి బండి రైలు బండి.. వేళకంటూ వచ్చిందండి

trains
Image Source: ministry of railways

రైలు బండి ఈ రోజైనా సమయానికి గమ్యం చేరుతుందా.. ఇది సగటు భారత రైలు ప్రయాణికుడు రైలెక్కిన ప్రతీసారి అనుకొనే మాట. భారత రైల్వే కూత సమయపాలనకు దూరంగా.. ఆలస్యానికి దగ్గరగా కూస్తూ వచ్చింది. నిర్దిష్ట సమయానికి మన రైలు గమ్యం చేరదన్న విషయం మనలో వేళ్లూనుకుపోయిన సత్యం.

రైల్వే వ్యవస్థపై పడ్డ ఈ మచ్చను తొలగించడానికి రైల్వే శాఖ చేయని ప్రయత్నమంటూ లేదు. అందుకే ఈ మధ్య ఢిల్లీ, లక్నో మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రయాణించే వారికి రైలు ఆలసమైన మొదటి ఒక గంటకు రూ. 100, రెండో గంటకు రూ. 250 అని పరిహారం ఇచ్చే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది రైల్వే వ్యవస్థ.

ఇలా సమయపాలన పాటించడానకి, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది తప్పా.. మొత్తం వ్యవస్థను పూర్తిగా గాడిన పెట్టలేకపోయింది. ఏళ్ల రైల్వే చరిత్రలో సమయపాలన ప్రశ్నార్ధకంగా మిగిలిన అంశం. సగటు ప్రయాణికుడు కోరుకొనే నిర్దిష్ట సమయానికి గమ్యం చేరుకొనే కోరినను భారత రైల్వే వ్యవస్థను ఇప్పటి వరకు తీర్చలేదు.

కానీ.. చరిత్రలో మొదటి సారిగా 100 శాతం సమయపాలను సాధించింది మన రైల్వే వ్యవస్థ. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత మూడు నెలల నుంచి సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితి. ఈ మధ్య ఇచ్చిన కొన్ని సడలింపుల నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపింది.

ప్రయాణికుల తరలింపునకు 201 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కాయి. ఇది మన రైల్వేలో ఉన్న రైళ్ల సంఖ్యలో రెండు శాతం కంటే కూడా తక్కువే. కాబట్టి ఇన్నాళ్లు సమయంపాలనపై పెద్దగా దృష్టి పెట్టని రైల్వే శాఖ ఈ విషయంలో జోన్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అన్ని జోన్ల నుంచి ప్రారంభమయ్యే రైళ్లు నిర్ధిష్ట సమయానికి గమ్యం చేరేలా చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేసింది.

దీంతో జూలై 1న దేశ్యాప్తంగా నడించిన 201 రైళ్లు వంద శాతం సమయపాలన సాధించి నిర్దిష్ట సమయానికి గమ్యం చేరాయి. మనుపెన్నడూ జరగని రీతిలో రైల్వే శాఖ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టైంది. అంతకు ముందు జూన్ 23వ తేదీన నడిచిన రైళ్లు 99.54 శాతం సమయపాలన పాటించి రికార్డు సాధిస్తే, జూలై 1న వంద శాతం సాధించాయి.

ఇదొక రికార్డన్న రైల్వే మంత్రి

దీనిపై స్పందించిన రైల్వే మంత్రి పియూష్ గోయల్.. ‘ఫాస్ట్ లైన్ లో రైళ్లు: ఊహించని స్థాయిలో సేవలను మెరుగుపరుస్తున్నాం. జూలై 1,2020న భారత రైల్వే 100 శాతం సమయపాలన సాధించి చరిత్ర సృష్టించింది’ అని అన్నారు.

రెండు కంటే తక్కువ శాతం రైళ్లను పట్టాలెక్కించి వంద శాతం సమయపాలన సాధించిన రైల్వే శాఖ.. మున్ముందు వంద శాతం రైళ్లు పట్టాలెక్కాక సమయపాలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి..! ఈ సారికైతే బండి బండి రైలు బండి.. వేళకైతే వచ్చిందండి.

Exit mobile version