మనిషి జీవితంలో జ్ఞాపకాలు మిఠాయి డబ్బా లాంటివి, ఒక్కసారి తెరిస్తే ఒక ముక్క తిని ఆపలేం.. ఇది యే జవానీ హై దివానీ చిత్రంలో నైనా తల్వార్ (దీపికా పదుకొణే) చెప్పిన మాట. నిజజీవితంలో మనిషికి జ్ఞాపకాలు అన్నవి ఎంత ముఖ్యమో ఈ చిత్రం మనకు గుర్తు చేస్తుంది.
చిన్నప్పటి నుంచి చదువు పేరుతో తన తల్లిదండ్రులు తనను నాలుగు గోడల మధ్య బందీ చేశారని, ప్రపంచాన్ని చూసే అవకాశం ఇవ్వలేదని మదనపడుతుంటుంది నైనా. దీంతో ఒక రోజు ఇంట్లో చెప్పకుండా ట్రెక్కింగ్ కు మనాలి బయలుదేరుతుంది.
అలా రైల్వే స్టేషన్ కు బయలుదేరిన నైనాకు కబీర్ తాపర్-బన్ని (రణ్ బీర్ కపూర్) తారసపడతాడు. అలా మొదలైన వీరి ప్రయాణంలో కబీర్ తో నైనా ప్రేమలో పడుతుంది. తనకు నచ్చింది చేస్తూ, నచ్చిన చోటుకు వెళ్తూ జీవితం సాగించే కబీర్ తన చుట్టూ ఉన్న వాళ్ల గురించి, తన కుటుంబం, స్నేహితుల గురించి పట్టించుకోడు.
వారి భావోద్వేగాలను, మనోభావాలను గుర్తించడు. తనకు నచ్చిన పని పేరుతో విదేశాలు తిరుగుతుంటాడు. అలా తిరుగుతున్న క్రమంలో తండ్రి చనిపోయాడన్న విషయం కూడా సకాలంలో తెలుసుకోలేడు. ఇలా తన ఆనందం తప్ప ఇతరుల మనోభావాలు, బంధాల గురించి పట్టించుకోని కబీర్ తిరిగి స్వదేశానికి వస్తాడు. ఒక సందర్భంతో మళ్లీ నైనాను కలుస్తాడు.
సాయత్రం వేళ సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆస్వాదించడం, పాప్ కార్న్ తింటూ థియోటర్లో డీడీఎల్జే (దిల్ వాలే దుల్హానియా లేజాయేంగె) చిత్రాన్ని చూడడం లాంటి చిన్నచిన్న జ్ఞాపకాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం నేర్చుకున్న నైనా.. కబీర్ కు హితబోధ చేస్తుంది.
వ్యక్తిగత ఆనందాన్ని పొందడానికి ప్రపంచమంతా తిరగాల్సిన పని లేదు. మనం ఉన్న చోటే, మన చుట్టూ చోటుచేసుకొనే విషయాలను మనవాళ్లతో కలసి ఆస్వాదిస్తూ మనం పొందే జ్ఞాపకాలు చాలు మనిషి ఆనందంగా బతికేందుకు అని తన జీవన శైలితో వివరిస్తుంది.
దీంతో ప్రాణ స్నేహితుల మనోభావాల్ని, గతంలో తండ్రి చూపించిన ప్రేమను గుర్తు చేసుకొని ప్రపంచలోని ఆనందాన్ని ఆస్వాదించే వేటలో తను ఏం కోల్పోయాడో తెలుసుకుంటాడు. చివరికి తన విదేశీ ప్రణాళికలు అన్నీ వదులుకొని తన తదుపరి జీవితం నైనాతో గడపాలని నిశ్చయించుకుంటాడు కబీర్.
ఇలా ప్రతి మనిషి ఆనందం వేటలో పడి తను చుట్టూ ఉన్న నా అనుకున్న వాళ్ల బంధాలను గుర్తించలేకపోతున్నాడు. వారితో జీవితానికి కావాల్సిన కొన్ని మధుర జ్ఞాపకాలను గడపలేకపోతున్నాడు. ఇలా జీవితం, ఆనందం, జ్ఞాపకాలు, ప్రేమ తాలూకు మూలాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించిన, నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన యే జవానీ హై దివానీ చిత్రం నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను దీపిక, కరణ్ చిత్ర నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ అందరితో పంచుకుంది.