హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్, బిర్యానీలకు ఫేమస్. దేశ విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు కూడా వీటిని టేస్ట్ చేయందే వెళ్లరు. ఇరానీ చాయ్ రుచులు పాతబస్తీలోని ప్రతి కేఫ్‌లో దొరుకుతాయి. ఇక బిర్యానీకి ప్యారడైజ్, కేఫ్ బహార్, బావర్చిలాంటి రెస్టారెంట్లు ఉండనే ఉన్నాయి. భాగ్యనగరాన్ని ప్రత్యేకంగా చూడటానికి వచ్చిన వారికి ఇవి భిన్నమైన రుచులను పంచుతాయి. కానీ హైదరాబాద్ లోనే నివసించేవారికి కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనిపిస్తుంది. దీనికోసం మీరు నగరం విడిచి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. అవును.. బిర్యానీ రుచులే కాదు.. మీకు మొత్తంగా ఓ వింత అనుభూతిని పంచే థీమ్ రెస్టారెంట్లు సిటీలో చాలానే ఉన్నాయి.
అక్కడికి వెళ్తే మిమ్మల్ని మీరు మరచిపోతారు. ఓ కొత్త లోకంలో విహరిస్తున్న ఫీల్‌ను వివిధ రెస్టారెంట్ నిర్వాహకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రొటీన్ రెస్టారెంట్లు, బిర్యానీ రుచులతో విసిగిపోయిన వాళ్లు వీటిని ట్రై చేయొచ్చు.
డైలాగ్ ఇన్ ద డార్క్
పేరులో ఉన్నట్లే ఈ రెస్టారెంట్ మొత్తం చిమ్మచీకటిగా ఉంటుంది. టేస్ట్ ఆఫ్ డార్క్‌నెస్ అనే ట్యాగ్‌లైన్‌తో ఉండే ఈ రెస్టారెంట్‌లో అన్నీ వింతే. మీరు అందులోకి అడుగుపెడితే అంతా చీకటి. ఏమీ కనిపించదు. మిమ్మల్ని డైనింగ్ ఏరియా దగ్గరికి తీసుకెళ్లేందుకు కొందరు అంధ దివ్యాంగులు అక్కడ సిద్ధంగా ఉంటారు. టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత కూడా చిమ్మ చీకట్లోనే మీకు ఆహారాన్ని వడ్డిస్తారు. వెలుతురును ప్రసారం చేసే ఏ వస్తువులనైనా అంటే.. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, వాచ్‌లు, లైటర్స్‌ను లోపలికి అనుమతివ్వరు. అంతేకాదు 8 ఏళ్లలోపు చిన్నారులను కూడా ఈ రెస్టారెంట్‌లోకి అనుమతించరు. నిత్య జీవితంలో అంధులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారో తెలియచెప్పడమే తమ ఉద్దేశమని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.
మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్ ఐదో అంతస్తులో ఈ రెస్టారెంట్ ఉంటుంది. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల వరకు, సోమవారం రాత్రి 7.30 నుంచి 10.00 గంటల వరకు, మంగళవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు ఈ రెస్టారెంట్ ఓపెన్ ఉంటుంది.
బీచ్ హౌజ్
హాయిగా ఇసుక తెన్నెల్లో కూర్చొని పక్కనే ఉన్న సముద్రాన్ని చూస్తూ వెన్నెల్లో భోజనం చేయాలని చాలా మంది అనుకుంటారు. గోవాలాంటి టూరిస్ట్ ప్లేస్‌లలో ఇలాంటి అవకాశం ఉంటుందని చాలా మంది వెళ్తుంటారు. కానీ ఇప్పుడదే ఎక్స్‌పీరియన్స్ మన హైదరాబాద్‌లోనే దొరుకుతుంది. మాదాపూర్‌లోని బీచ్ హౌజ్ రెస్టారెంట్‌కు వెళ్తే బీచ్‌కు వెళ్లిన ఫీలే కలుగుతుంది. క్యాండిల్ లైట్ డిన్నర్ కావాలంటే బుధవారాలు, మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయాలంటే శనివారాలు ఈ బీచ్ హౌజ్ రెస్టారెంట్‌కు వెళ్లొచ్చు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర్లోని కావూరీ హిల్స్‌లో ఈ రెస్టారెంట్ ఉంటుంది. ఇద్దరు డిన్నర్ చేయాలంటే ట్యాక్స్‌లు కాకుండా సుమారు రూ.700 వరకు ఖర్చవుతుంది. ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారు.
ది గ్రాండ్ ట్రంక్ రోడ్
ఈ రెస్టారెంట్ పూర్తిగా డిఫరెంట్. ఓ హైవే దాబాను పోలిన సెటప్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రెండు లారీలు కూడా ఉంటాయి. ఒకదాంట్లో ఓ పెద్ద గ్రూపు కూర్చొని భోజనం చేసే వీలుంటుంది. ఇక్కడి గోడలపై పెయింటింగ్స్, ఆంబియన్స్ అదుర్స్ అనేలా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, బ్రంచ్ అన్నీ దొరుకుతాయి. అయితే బఫెట్ ఎంజాయ్ చేయాలని అనుకున్నవాళ్లు ఈ రెస్టారెంట్‌కు రావచ్చు.
బఫెట్‌లోని అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి. నార్త్ ఇండియన్, చైనీస్, మొఘలాయ్ వెరైటీలను టేస్ట్ చేయొచ్చు. ఇద్దరికి వెయ్యి రూపాయల వరకు అవుతుంది. మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్ రోడ్‌లో ఈ రెస్టారెంట్ ఉంది.
రోబో కిచెన్
ఇది హైదరాబాద్‌లోనే తొలి రోబో థీమ్ రెస్టారెంట్. జూబ్లీహిల్స్‌లోని అల్కాజార్ మాల్ రెండో అంతస్తులో ఉంటుంది. ఇక్కడ రోబోలే మీకు సర్వ్ చేస్తాయి. రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టగానే రోబోనే వెల్‌కమ్ చెబుతుంది. మీ టేబుల్ వరకు తీసుకెళ్తుంది. అంతేకాదు మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఓ ట్యాబ్‌ను చేతిలో పెడతారు. అందులో నుంచే మీకు కావాల్సినవి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. నిమిషాల్లో మీకు నచ్చిన ఫుడ్‌ను రోబోలు తెచ్చి వడ్డిస్తాయి. చైనీస్, థాయ్, నార్త్ ఇండియన్ వంటకాలకు ఈ రెస్టారెంట్ ఫేమస్. ఎల్‌ఈడీ లైట్ల ధగధగలు, మనసును ఆహ్లాదపరిచే మ్యూజిక్ మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడ డిన్నర్ చేస్తే ఇద్దరికి ట్యాక్స్‌లు కాకుండా కనీసం 1200 వరకు ఖర్చవుతుంది.
ఖైదీ కిచెన్
సంగారెడ్డిలో ఓ జైలు గురించి తెలుసు కదా. ఒక రోజుకి రూ.500 ఇస్తే మీకు కూడా జైలు అనుభవం చూపిస్తామని ప్రకటన ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఈ ఖైదీ కిచెన్ రెస్టారెంట్ కూడా అలాంటిదే. ఇందులోకి వెళ్తే జైల్లోకి వెళ్లిన ఫీలే మీకు కలుగుతుంది. ఇక్కడి వెయిటర్స్ ఖైదీల్లాగా, మేనేజర్ జైలర్‌లాగా డ్రెస్సులు వేసుకుంటారు. జైలు గేట్లు, గోడలు ఎలా ఉంటాయో.. ఇక్కడా అలాంటి ఆంబియన్స్‌నే క్రియేట్ చేశారు. ఇటాలియన్, నార్త్ ఇండియన్, చైనీస్ ఫుడ్‌కి ఈ రెస్టారెంట్ ఫేమస్. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఈ ఖైదీ కిచెన్ ఉంది. ఆ రూట్‌లో వెళ్లినపుడు ఎప్పుడైనా ఈ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ట్రై చేయండి.
ఓహ్రీస్ గుఫా
హైదరాబాద్‌లో చాలా ఏళ్లుగా ఉన్న ఫేమస్ రెస్టారెంట్లలో ఇదీ ఒకటి. ఇందులోకి వెళ్తే ఓ గుహలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడి వెయిటర్లు వేటగాళ్ల దుస్తుల్లో ఉంటారు. బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ మెడికల్ కాలేజీ అపోజిట్‌లో ఈ రెస్టారెంట్ ఉంది. వెదురుతో చేసిన ఫర్నీచర్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. అంతేకాదు 90ల్లోని హిట్ బాలీవుడ్ సాంగ్స్ ప్లే చేస్తూ మిమ్మల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తారు. నార్త్ ఇండియన్ ఫుడ్‌కు ఫేమస్. బార్ కూడా ఉంటుంది.