ఉరుకులు పరుగుల అర్బన్ లైఫ్‌లో రోజుకో కొత్త ఆరోగ్య సమస్య మనల్ని వేధిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పులు, ఒంటి నొప్పులు.. మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయాయి. ఈ రోగాలు, నొప్పులకు ఇంగ్లిష్ మందులు వాడితే లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ మరింత చికాకు కలిగిస్తాయి. ఈ తలనొప్పులన్నీ ఎందుకూ అనుకున్న వాళ్లు కళ్లు మూసుకొని అరోమా థెరపీని ఫాలో కావచ్చు.
ఈ చికిత్సలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకు అత్యంత సులువుగా లభించే ఆకులు, పువ్వులు, కాయల సువాసన, సహజ నూనెలతో నిత్య జీవితంలోని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ వాసనలేంటి.. నూనెలేంటి.. వీటితో రోగాలు తగ్గడమేంటన్న అనుమానాలు చాలా మందిని అరోమా థెరపీకి దూరంగా ఉంచుతున్నాయి.
అరోమాథెరపీతో లాభాలేంటి?
కానీ ఈ థెరపీ వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. కచ్చితంగా ఫాలో అవుతారు. అరోమా థెరపీ కోసం మీకు పెద్ద సరంజామా అవసరం లేదు. రెగ్యులర్‌గా థెరపీ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనీ ఉండదు. ఈ థెరపీ కోసం కావాల్సిన వాటిలో చాలా వరకు చిన్న చిన్న దుకాణాల్లో, సూపర్ మార్కెట్‌లలోనూ ఉంటాయి.
ఈ థెరపీలో వాడే నిమ్మకాయలు, ఆరెంజెస్, వెనీలా, లావెండర్ మొక్కలలాంటివి మనకు సులువుగా దొరుకుతాయి. వీటి నుంచి వచ్చే సువాసనల్లో నొప్పిని, ఒత్తిడిని మాయం చేసే అద్భుతమైన లక్షణాలు ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు. నిమ్మకాయలైనా, నారింజలైనా, వెనీలా అయినా.. వేడి నీళ్లలో వేస్తే చాలు.. వాటి నుంచి వచ్చే సువాసన ఒత్తిడిని తగ్గించి రాత్రి పూట మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.
అరోమా థెరపీలో భాగంగా కొన్ని సువాసనలతోపాటు మరికొన్ని సహజ నూనెలు, ఇంకొన్ని టీలో కలిపి తాగే ఔషధాలు కూడా ఉంటాయి. నొప్పులను నివారించడానికి ఓ ప్రత్యామ్నాయ మార్గంగా అరోమా థెరపీని కొన్ని వందల ఏళ్లుగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ థెరపీలో భాగంగా ఏ ఆరోగ్య సమస్యకు దేనిని, ఎలా వాడాలి అన్న వివరాలు ’డియర్ అర్బన్‘ మీకోసం అందిస్తోంది.
నిద్ర లేమి, ఒత్తిడి
1. లావెండర్: లావెండర్ మొక్కల నుంచి వచ్చే పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. మంచి, ప్రశాంతమైన నిద్ర పట్టేలా చూస్తుంది. అంతేకాదు ఈ లావెండర్ మన గుండె వేగాన్ని కూడా తగ్గించగలదు. నిద్రలేమితో బాధపడే వారికి ఇది బాగా పనిచేస్తుంది.
2. బేరి పండ్లు: ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ బేరి పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మహిళలు ఈ బేరి పండ్ల వాసన చూస్తే.. వాళ్లలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ల విడుదల స్థాయి తగ్గుతుంది. అంతేకాదు మీ మూడ్‌ను కూడా సానుకూలంగా మారుస్తుందని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి.
3. వెనీలా: పర్ఫ్యూమ్స్ తయారు చేసే వాళ్లు ఎక్కువగా వాడే ఈ వెనీలా నుంచి వచ్చే సువాసన.. ఒత్తిడి నుంచి దూరం చేసి, శరీరానికి అవసరమైన ఉపశమనం లభించేలా చేస్తుంది. హైపర్ యాక్టివిటీ, ఆందోళనను తగ్గించే శక్తి కూడా ఈ వెనీలాకు ఉంది.
ఆందోళన, డిప్రెషన్
4. నారింజ పండ్లు: సంత్రా లేదా ఆరెంజ్ లేదా నారింజ పండ్లలోని వాసన పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ).. అంటే ఏదైనా భయానక ఘటన జరిగిన తర్వాత కలిగే ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. గర్భవతుల్లో ఆందోళనను తగ్గించే శక్తి కూడా వీటి నుంచి వచ్చిన తైలానికి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడిని తగ్గించే గుణం ఈ సంత్ర పండ్లకు ఉంటుంది.
5. నిమ్మకాయ: మనకు విరివిగా దొరికే నిమ్మకాయలో ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గించే లక్షణాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు? శాస్త్రీయ అధ్యయనాలే దీనిని నిరూపించాయి. వీటి నుంచి వచ్చే సహజ నూనెలనుగానీ లేక నిమ్మకాయ నుంచి వచ్చే వాసనను అలాగే పీల్చడం వల్లగానీ ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. నిమ్మ గడ్డి కూడా మిమ్మల్ని ఆందోళన నుంచి బయట పడేస్తుంది.
శ్వాస సంబంధిత, రక్త ప్రసరణ సమస్యలు
6. యూకలిప్టస్ (నీలగిరి): మనకు జలుబు చేసినప్పుడు శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. గొంతు నొప్పి, దగ్గు వేధిస్తుంటుంది. ఇలాంటి వాటికి నీలగిరి తైలం బాగా పని చేస్తుంది. ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో జిందా తిలస్మాత్ పేరుతో ఈ తైలం అందుబాటులో ఉంటుంది.
7. తులసి ఆకులు: హైబీపీ ఉన్న వాళ్లకు తులసి ఆకుల రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది బాగా పని చేస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది.
తలనొప్పి, ఇతర నొప్పులు
8. కర్పూరం: మనం రోజూ ఇంట్లో వాడే కర్పూరాన్ని ఎన్నో రకాల చికిత్సల కోసం వాడుతారు. చర్మ సంబంధిత వ్యాధులతోపాటు కీళ్ల నొప్పులకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. కర్పూరం నుంచి వచ్చే వాసన తలనొప్పిని దూరం చేస్తుంది. దీనిని ఎన్నో లోషన్లు, బామ్‌లలో విరివిగా వాడతారు.
9. మెంథాల్ (పుదీనా) : మైగ్రెయిన్‌తో బాధపడే వాళ్లు మెంథాల్‌తో ఉపశమనం పొందినట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. వివిధ నొప్పులను తగ్గించడంలో మెంథాల్ ప్రభావంపై ఎన్నో ఏళ్లుగా చాలా అధ్యయనాలు జరిగాయి. తలనొప్పి లక్షణాలను తగ్గించడంతోపాటు వికారం, వాంతులను కూడా తగ్గించే శక్తి మెంథాల్‌కు ఉంది.
10. రోజ్‌మేరి: ఈ రోజ్‌మేరి ఆయిల్ వాసన చూడటం వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గినట్లు తాజా అధ్యయనాలు నిరూపించాయి. ఒంట్లో మంటను తగ్గించడంతోపాటు రక్త ప్రసరణను కూడా మెరుగుపరచడంలో రోజ్‌మేరీ ఆకులు సాయపడతాయి.
వికారం, కడుపు నొప్పి
11. అల్లం: యాంటీ సెప్టిక్‌గా పనిచేయడంతోపాటు ఔషధ గుణాలున్న అల్లం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులో వికారం, వాంతులను నివారించడానికి అల్లం వాడతారు. ఎప్పుడైనా కాస్త ఒంట్లో బాగా లేనట్లు అనిపిస్తే అల్లం వాసన చూడండి.. వెంటనే శరీరంలో సానుకూల మార్పులు వస్తాయి.
అరోమా థెరపీని ఎన్నో రకాలుగా వాడొచ్చు. అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం పరిమళాన్ని ఆస్వాదించడం. అయితే అది ఏ రకమైన పరిమళం అన్నదాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. కొన్ని సహజ నూనెల రూపంలో, మరికొన్ని ధూపంలాగా, ఇంకొన్ని స్ప్రేలాగా వాడుకోవచ్చు.