Home ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ రివ్యూ : అఖుని (axone) : స్నేహం ప్రేమ ద్వేషం

మూవీ రివ్యూ : అఖుని (axone) : స్నేహం ప్రేమ ద్వేషం

axone review
[yasr_overall_rating null size=”medium”]

మూవీ రివ్యూ : అఖుని (ఆక్స్‌ఆన్) (axone) 
రేటింగ్‌ : 3.25
నటీనటులు : సయోని గుప్తా, లిన్‌ లైష్రామ్, టెన్‌జిన్‌ దల్హా, రోహన్‌ జోషి, లానువాకుమ్‌ ఓ
డైరెక్టర్‌ : నికోలస్‌ ఖార్కోంగర్‌
విడుదల : జూన్‌ 12 , నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ

అఖుని సినిమా కథ అంతా నార్త్‌ ఈస్ట్‌ వంటకమైన అకుని చుట్టూ అల్లుకున్నదే. మన సమాజంలో ఇతరుల ఆహార అలవాట్లను ద్వేషించడం, ఒక ప్రాంతం నుంచి వలస వచ్చి నివసిస్తున్న వారిని అకారణంగా ద్వేషించడం నిత్యం చూస్తున్నదే. బీఫ్, పోర్క్, అంతెందుకు ఇంట్లో ఎండు చేపల కూరనో, ఎండు రొయ్యల కూరనో వండితే కూడా పక్కింటోళ్లు మనల్ని ద్వేషించే పరిస్థితి.

ఎవరికి నచ్చిన ఆహారం వారు తినడం వారి ప్రాథమిక హక్కు. కానీ అలాంటి ప్రాథమిక హక్కులను ఇతరులు గౌరవిస్తున్నారా? ఢిల్లీలో ఉండే నార్త్‌ ఈస్ట్‌ ప్రజల పట్ల అక్కడి సమాజం వ్యవహరిస్తున్న తీరు సరైందేనా? ఇలాంటి అనేక ప్రశ్నలను ఈ సినిమా లేవనెత్తుతుంది. ఇలా ద్వేషించే వారి ముఖంపై కొట్టే చెంపదెబ్బగా ఈ సినిమాను చెప్పొచ్చు.

కేవలం వెజిటేరియన్లకే అద్దెకు ఇవ్వబడును అని ఎన్ని టు లెట్‌ బోర్డులు చూడలేదు మనం. అదిగో సరిగ్గా ఇలాంటి అనుభవాలతో నికోలస్‌ ఖార్కోంగర్‌ మలిచిన అందమైన కథ అకుని మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సినిమా పేరు ఆక్స్‌ఆన్‌గా (axone)గా ఉన్నా… నిజానికి దానిని అక్కడి వాడుక భాషలో అఖునిగా పిలుస్తారు.

అఖుని అంటే నార్త్‌ ఈస్ట్‌లో చేసే నాన్‌వెజ్‌ రెసిపీ. పోర్క్‌ మాంసాన్ని అకుని వేసి వండుతారు. అఖుని అంటే ఫర్మెంటెడ్‌ సోయాబీన్ గింజలు. అంటే పులియబెట్టిన సోయాబీన్‌ గింజలు.

ఇది వండినప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. కానీ వంట పూర్తయ్యాక ఒక అద్భుతమైన ఆరోమాతో కూడిన రుచికరమైన ఆహారంగా, ప్రత్యేక సందర్భాల్లో వండుకునే ఆహారంగా నార్త్‌ ఈస్ట్‌ ప్రజలు భావిస్తారు.

అఖుని కథ :

ఉపాసన, చన్‌బీ, మీనమ్‌.. నార్త్‌ఈస్ట్‌కు చెందిన స్నేహితుల బృందం. వీరు ఢిల్లీలో ఓ ఇంట్లో పై పోర్షన్‌లో అద్దెకు ఉంటారు. మీనమ్‌ సివిల్స్‌ ఇంటర్వ్యూకు వెళుతుంది. అదేరోజు రాత్రి తన వివాహం. ఈ వివాహ వేడుకకు ప్రత్యేకంగా అఖుని వండి సర్‌ప్రైజ్‌ చేయాలన్నది మిత్రుల లక్ష్యం.

అఖుని వండడంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఢిల్లీలో నార్త్ ఈస్ట్ లపై జరిగిన దాడిలో బాధితుడిగా ఉన్న బెన్ డాంగ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఉపాసన ప్రేమ ఫలించిందా? వంటి అంశాలన్నీ సినిమాలో చూడాల్సిందే.

సినిమా నిడివి చిన్నదే అయినా, కథ చాలా సింపుల్‌గా అనిపించినా ఇందులో అనేక భావోద్వేగాలు ఉన్నాయి. సమాజంలో నెలకొన్న అనేక ధోరణులపై వ్యంగస్త్రాలు ఉన్నాయి.

నార్త్‌ ఈస్ట్‌ ప్రజలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, జాతి విద్వేషాలను అంతర్లీనంగా చూపిన ఈ సినిమా కేవలం సందేశాత్మకంగా కాకుండా.. స్నేహం, ప్రేమ చుట్టూ అల్లుకున్న కథ.

ఉపాసన పాత్రలో సయామీ గుప్తా జీవించింది. ఫోర్‌ మోర్‌ షాట్స్‌ వెబ్‌ సిరీస్‌లో ఆకట్టుకున్న ఉపాసన ఈ పాత్రలో అవలీలగా రాణించింది. నార్త్‌ఈస్ట్‌ యాసలో మాట్లాడే హిందీ ఒక్కోసారి వింతగా ఉన్నా.. ఈ పాత్రకు అదే అందంగా కనిపిస్తుంది. ఓనర్‌ కొడుకు శివ్‌ పాత్రలో కనిపించే రోహన్‌ జోషి, చన్‌బీ, మీనమ్‌ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

Exit mobile version