Home ఎంటర్‌టైన్‌మెంట్‌ పెంగ్విన్‌ మూవీ రివ్యూ : సస్పెన్స్‌ డ్రామా

పెంగ్విన్‌ మూవీ రివ్యూ : సస్పెన్స్‌ డ్రామా

penguin movie review
[yasr_overall_rating null size=”medium”]

పెంగ్విన్‌ మూవీ రివ్యూ : తెలుగు వర్షన్
రేటింగ్‌ : 3/5
నటీనటులు : కీర్తి సురేష్, లింగా, మాధంపట్టి రంగరాజ్, మాస్టర్‌ అద్వైత్, మాథి, హరిణి
డైరెక్టర్‌ : ఈశ్వర్‌ కార్తీక్‌, బ్యానర్ : స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, ప్యాసన్ స్టూడియోస్

విడుదల : జూన్‌ 19, అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ

లాక్‌డౌన్‌ కారణంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నేరుగా విడుదలైన సినిమా పెంగ్విన్‌. థియేటర్లలో కొత్త సినిమా చూడలేకపోతున్న వారికి ఓటీటీ కల్పించిన ప్రత్యామ్నాయం ఇది. ‘మహానటి’లో అభినయంతో అందరినీ ఆకట్టుకున్న కీర్తిసురేష్‌కు ఈ సినిమా అలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూద్దాం.

కథ :

ఏడు నెలల గర్భవతి రిథమ్‌ (కీర్తి సురేష్‌) పీడ కల కంటుంది. ఆరేళ్ల క్రితం తప్పిపోయిన తన కుమారుడికి ఒక గొడుగు పట్టుకుని అస్పష్ట ముఖంతో ఉన్న ఒక మనిషి అపాయం తలపెట్టినట్టు కల కంటుంది. పోలీసులు సహా అందరూ చనిపోయాడని చెప్పినా తన కొడుకు బతికే ఉన్నాడని నమ్మిన ఆ తల్లికి కొడుకు మళ్లీ దొరుకుతాడా?

దూరమైపోయిన కొడుకు ఆచూకీ తెలుసుకోవడంలో ఎవరి సాయం లేకపోగా.. ఏకంగా భర్తే విడాకులు ఇస్తాడు. రిథమ్‌ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. కుమారుడి అపహరణలో వీరి పాత్ర ఏంటి? కుమారుడి అదృశ్యం వెనక రహస్యమేంటి? అన్నదే ఈ కథ.

పెంగ్విన్ మూవీ రివ్యూ :

అమెజాన్‌ ప్రైమ్‌లోనే ఇటీవల విడుదలైన ‘పొన్మగల్‌ వంధల్‌’ సినిమా తరహాలోనే ఇది కూడా పిల్లలపై జరిగే నేరాలతో ముడివడి ఉన్న కథ. తొలి అర్థ భాగం ఒక హారర్‌ మూవీని తలపించేలా సన్నివేశాలను పెట్టి డైరెక్టర్‌ ఈశ్వర్‌ కార్తీక్‌ భయం గొల్పేలా చిత్రించాడు. ఏడు నెలల గర్భవతి తన కుమారుడి కోసం అర్ధరాత్రి అడవిలో ఉన్న సరస్సు వద్దకు వెళ్లి వేచి ఉన్నప్పుడు సంతోష్‌ నారాయణన్‌ ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ హారర్‌ మూవీని తలపిస్తుంది.

పాత చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవద్దని డాక్టర్‌ చెబుతూ మరీ ముఖ్యంగా కొడుకు అదృశ్యమైన లేక్‌ దగ్గరికి వెళ్లొద్దని నొక్కి చెప్పినా అక్కడికే వెళ్లడం, చీకటిపడే సమయంలో అక్కడికి వెళ్లే సాహసం చేయడం ప్రేక్షకులను కన్విన్స్‌ చేయవు.

అలాగే కరడు గట్టిన, అత్యంత తెలివైన నేరస్తుడి ఇంట్లో తాను ఉంది, తన కొడుకును ఒంటరిగా వదిలేసి ఇన్వెస్టిగేషన్‌ చేయడం కూడా కన్విన్స్‌ చేయదు.

అయితే ‘నేను గర్భవతిని మాత్రమే. బ్రెయిన్‌ డెడ్‌ కాదు..’ అని చెప్పే ఓ డైలాగ్‌ తన కుమారుడి ఆచూకీ కోసం, అపహరణకు కారణాల కోసం వెతుకులాడే మాతృహృదయం.. ఏడు నెలల గర్భంతో ఉండి కూడా ఎంతవరకైనా వెళ్లగలదన్న అర్థాన్ని స్ఫురించేలా చేస్తుంది.

ఫస్ట్‌ హాఫ్‌ అంతా సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో ఊపిరిబిగపట్టేలా చేసిన దర్శకుడు రెండో సగంలో దానిని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. ఆరేళ్లపాటు తన కొడుకును అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టిన వ్యక్తి ఒక భయంకరమైన సైకో అయి ఉంటాడని నమ్మే ప్రేక్షకుడికి ఎదురయ్యే సమాధానం కన్విన్సింగా ఉండదు.

రిథమ్‌ పాత్రపై సానుభూతి సృష్టించడానికి అవసరానికి మించి కష్టపెట్టినట్టు కనిపించడం కూడా నొప్పదు. కానీ తనకు ఇచ్చిన పాత్రకు కీర్తి సురేష్‌ పూర్తిగా న్యాయం చేసింది. డీగ్లామరస్‌ పాత్రలో చక్కటి అభినయం కనబరిచింది. కొడుకు పాత్రలో నటించిన అద్వైత్‌ కూడా చక్కగా నటించాడు.

పెంగ్విన్‌ మూవీ రివ్యూ నచ్చితే దయచేసి షేర్ చేయగలరు.

Exit mobile version