Bitter gourd pickle Recipe: కాకరకాయ నిల్వ పచ్చడిని చాలా సులువుగా తయారుచేయవచ్చు. వేసవి వచ్చిందంటే చాలామంది పచ్చళ్లపై దృష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే పచ్చళ్లకు వేసవి అనువైన సమయం. వేసవిలో వచ్చే మామిడి కాయ పచ్చళ్లతో పాటు మరెన్నో పచ్చళ్లను పెడుతూ ఉంటారు. ఈ సందర్భంలో కాకరకాయ నిల్వ పచ్చడి కూడా చెప్పుకోదగ్గది. కాకరకాయతో కూర చేయవచ్చు, పులుసు చేయవచ్చు, ఫ్రై చేయవచ్చు. ఇలా అన్నిటితొ పాటు పచ్చడిని కూడా పెట్టేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది.
అంతేకాదు కాకరకాయ వల్ల ఆరోగ్యానికి కూడా మేలు లేకపోలేదు. చేదుగా ఉంటుందనే మాటే గాని ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉండనే ఉన్నాయి. కానీ చాలామంది వీటిని తినడానికి మొగ్గుచూపరు. కారణం కాకరకాయలు చేదుగా ఉంటాయనే. కానీ అప్పుడప్పుడు చేదు కూడా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అందుకే చేదుగా ఉండే వాటినీ కూడా మన ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. అప్పుడే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే కాకరకాయతో ఎప్పుడూ రొటీన్‌గా చేసే వంటలు కొంచెం బోర్ కొడుతుంది. కానీ అప్పుడప్పుడు ఇలా డిఫెరెంట్‌గా పచ్చడి రూపంలో చేసుకుంటే ఇష్టంగా తినేయచ్చు. నోటికి కమ్మగా కూడా ఉంటుంది. ఇంటిళ్లపాది లొట్టలేసుకుంటూ ఈ పచ్చడిని ఇష్టంగా తింటారని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు
- కాకరకాయలు – పావుకిలో
- నూనె – 5 టేబుల్ స్పూన్లు
- ఆవాలు – రెండు స్పూన్లు
- దంచిన వెల్లుల్లి రెబ్బలు – ఆరు
- ఎండుమిర్చి – రెండు
- కరివేపాకు – రెండు రెమ్మలు
- నానబెట్టిన చింతపండు – 50 గ్రాములు
- మెంతులు – అర టేబుల్ స్పూన్
- కారం – ముప్పావు కప్పు
- జీలకర్ర – ఒక టీ స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
కాకరకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం
స్టెప్ 1: ముందుగా ఆవాలు, మెంతులను కడాయిలో వేసి వేయించి పొడిగా చేసుకోవాలి.
స్టెప్ 2: తరువాత కాకర కాయలను శుభ్రంగా కడిగి పైన ఉండే చెక్కును తీసేసి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 4: తరువాత అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
స్టెప్ 5: తరువాత దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత చింతపండు గుజ్జు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
స్టెప్ 6: ఇప్పుడు ముందుగా వేయించిన కాకరకాయ ముక్కల్లో మిక్సీ పట్టుకున్న మెంతి పొడి, కారం, ఉప్పు, చింతపండు మిశ్రమం వేసి కలపాలి. దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకుని ఒక రోజంతా ఊరబెట్టాలి.
అంతే ఎంతో రుచిగా కాకరకాయ నిల్వ పచ్చడి తయారైనట్టే. ఇది వేడి అన్నంలో కలుపుకుని తింటూ ఎంజాయ్ చేయచ్చు. ఈ కాకరకాయ పచ్చడి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. కాకరకాయను ఇష్టపడని పిల్లలు కూడా ఇలా పచ్చడి చేసి పెడితే ఇష్టంగా తింటారు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్