Home హెల్త్ వేస‌విలో రోజుకి ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

వేస‌విలో రోజుకి ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

person holding clear drinking glass
రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? Photo by engin akyurt on Unsplash

రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? ఏ విధంగా తాగితే ఆరోగ్యం? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. వాట‌న్నింటి గురించి తెలియ‌జేయ‌డానికి ఈ క‌థ‌నం మీ కోసం. ప్ర‌తి మ‌నిషి నిత్య‌జీవితంలో నీరు అత్య‌వ‌స‌రం. పైగా ఇప్పుడు వేస‌వి దంచికొడుతుంది. ఇలాంట‌ప్పుడు చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌రూ త‌గినంతగా నీరు తీసుకోవాలి. చాలామంది  కేవ‌లం దాహం వేసినప్పుడు మాత్ర‌మే  తాగుతుంటారు. కానీ అలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో నీటి శాతం తగ్గి అనేక అనారోగ్యాల‌కు కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక తరుచూ కొంత ప‌రిమాణంలో నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే వేస‌విలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య తగ్గుతుంద‌నీ నిపుణులు చెబుతున్నారు. 

శ‌రీరంలో అనేక రోగాల‌ను తగ్గించ‌డంలో, వ్య‌ర్థాల‌ను పోగొట్ట‌డంలో, అవ‌య‌వాల ప‌నితీరును మెరుగుప‌ర‌డంలో నీరు స‌హాయ‌ప‌డుతుంది. సాధార‌ణంగా శ‌రీరంలో 70% వ‌ర‌కూ నీరు ఉంటుంది. అయితే శ‌రీరానికి నీరు ఎంత అవ‌స‌రం? నీటిని ఎంత మోతాదులో తాగితే మంచిది?  నీరు తాగడం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు? వంటి విష‌యాల‌పై క‌నీస అవ‌గాహ‌న ప్ర‌తీ ఒక్క‌రికి ఉండ‌డం అవ‌స‌రం. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

అస‌లు నీరు ఎందుకు తాగాలి?

వేస‌వి కాలంలో చెమ‌ట ద్వారా శ‌రీరం నుండి నీరు బ‌య‌ట‌కు పోతుంటుంది. దీనితో శ‌రీరం స‌మ‌తుల్య‌త‌ను కోల్పోయి ఎల‌క్ట్రోలైట్లు తగ్గిపోతాయి. ఈ ఎల‌క్ట్రోలైట్‌లు అనేవి శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను  నియంత్రించి చ‌ల్ల‌బ‌రిచే ప్ర‌క్రియ‌ను అమలు చేస్తాయి. వీటిని కోల్పోయినప్పుడు శ‌రీరం బాగా వేడెక్కి విప‌రీత‌మైన అల‌స‌ట లేదా వ‌డ‌దెబ్బ త‌గలడానికి అవ‌కాశం ఉంటుంది. అలాంట‌ప్పుడు వెంట‌నే చికిత్స చేయాల్సి ఉంటుంది. లేక‌పోతే ప్రాణానికి ప్ర‌మాదం కూడా కావ‌చ్చు. కనుక శరీరానికి కోల్పోయిన నీటిని తిరిగి అందివ్వాల‌న్నా, శరీరంలో నిర్జ‌లీక‌ర‌ణాన్ని నివారించాల‌న్నా త‌గినంత నీటిని తీసుకోవ‌డం అత్య‌వ‌స‌రం.

నీరు తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు

త‌రుచూ త‌గినంత నీటిని తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. మాన‌వుని జీవితంలో నీరు ఎంత అవ‌స‌ర‌మో శ‌రీరానికి నీరు త‌గినంత‌గా అందించ‌క‌పోతే ఎన్ని అనర్థాల‌కు దారితీస్తుందో నీరు తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి  క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇక్క‌డ ఉన్నాయి.

  1. త‌రుచూ నీరు తాగ‌డం వ‌ల్ల బాడీ హైడ్రేష‌న్‌కు గురికాకుండా ఉంటుంది. అంతేకాకుండా శ‌రీర ఉష్ణోగ్రతను, అల‌స‌ట‌ను త‌గ్గిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం అందిస్తుంది.
  1. వ్యాయామం చేసేటప్పుడు శ‌రీర ప‌నితీరును సక్ర‌మంగా ప‌నిచేసేలా చూస్తుంది. శరీరంలోని మలినాలను బ‌య‌ట‌కు పంపుతుంది. క‌ఠిన‌మైన శారీర‌క శ్ర‌మ చేసినప్పుడు నీరు తీసుకోవ‌డం ద్వారా శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచ‌వ‌చ్చు.
  1. నీరు త‌గినంత‌గా తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఉప‌యోగ‌పడుతుంది. చ‌ర్మంపై వ‌చ్చే మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఇత‌ర స‌మ‌స్య‌ల‌కు నీరు తాగ‌డం ద్వారా తగ్గిండానికి అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు చ‌ర్మం నిగారింపును కోల్పోండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవాలి.
  1. శ‌రీరంలో జీర్ణక్రియ ప్ర‌క్రియ సాఫీగా జరుగుతుంది. నీరు తీసుకోవ‌డం వ‌ల్ల చురుకుగా ఉంటారు. జ్ఞాప‌క‌శ‌క్తిని, ఏకాగ్ర‌త‌ను పెంచుతుంది.
  2. శ‌రీర ఉష్ణ‌ోగ్రత, రక్త‌పోటును నియంత్రిస్తుంది. అంతేకాదు తీవ్ర‌మైన త‌ల‌నొప్పి వ‌స్తుంటే  వెంట‌నే రెండు గ్లాసుల నీటిని తీసుకోవ‌డం ద్వారా మంచి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.
  1. శ‌రీరంలో మూత్రాశ‌యంలో వ‌చ్చే బాక్టీరియా ఇన్ఫెక్ష‌న్‌ల‌ను నియంత్రిస్తుంది. శ‌రీర క‌ణ‌జాలం, అవ‌య‌వాల‌ను ర‌క్షిస్తుంది. 

ఎవరెవ‌రు ఎంత నీరు తాగితే ఆరోగ్య‌క‌రం

ప్ర‌తీరోజూ 6 నుండి 8 గ్లాసుల నీరు తీసుకోవ‌డం  ద్వారా ఆరోగ్య‌క‌రంగా ఉండొచ్చ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అయితే వ‌య‌సును బట్టి ఎంత నీటిని తీసుకుంటే మంచిదో ఇక్క‌డ చూద్దాం.

  • 4 నుంచి 8 ఏళ్ల మ‌ధ్య ఉన్న పిల్లలు అయితే 5 నుండి 6 గ్లాసుల నీరు తాగాలి.
  • 9 నుంచి 13 ఏళ్ల మ‌ధ్య ఉన్న పిల్ల‌లు అయితే 7 నుండి 8 గ్లాసుల నీరు తీసుకోవాలి.
  • 14 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు వాళ్లు  8 నుండి 11 గ్లాసుల నీటిని తాగాలి.
  • ఇక పెద్ద‌ల విష‌యానికి వ‌స్తే.. మహిళ‌లు 19 అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు వారు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల వ‌ర‌కూ నీరు తాగాలి. ఇక పురుషులు అయితే 19 అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు వారు రోజుకు 8 నుంచి 13 గ్లాసుల  నీరును తీసుకోవాలి.
  • నీరు ఎక్కువ‌గా తాగ‌లేన‌ప్పుడు దానికి బ‌దులుగా నీటి శాతం ఎక్కువ‌గా ఉండే పండ్లు, పండ్ల ర‌సాలు తీసుకుంటే స‌రిపోతుంది.

ఇవీ తీసుకోండి

  1. నిమ్మరసం: వేస‌విలో త‌రుచూ నిమ్మ‌రసం తీసుకోవ‌డం ద్వారా  శ‌రీరం చాలా రిఫ్రెష్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అంతేకాక శ‌రీరానికి అందాల్సిన విట‌మిన్ సి అందుతుంది. 
  2. మ‌జ్జిగ: మ‌జ్జిగ కూడా త‌రుచూ తాగాల్సిందే. వేస‌విలో మ‌జ్జిగ తాగ‌డం ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే వేడి నుంచి మంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది. శ‌రీరానికి చల్ల‌ద‌నంగా హైడ్రేటెడ్‌గా ఉంచ‌డంలో మ‌జ్జిగ కీల‌కంగా ప‌నిచేస్తుంది.
  3. కొబ్బ‌రి నీరు: కొబ్బ‌రి ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బ‌రి తిన‌డం గాని లేదా కొబ్బ‌రి నీరు తాగ‌డం వ‌ల్ల బాడీకి అవ‌స‌ర‌మైన అన్ని విట‌మిన్లు అందుతాయి. ఎల‌క్ట్రోలైట్ల బాలెన్సింగ్‌కు కొబ్బ‌రి నీరు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
  4. గ్రీన్ టీ: గ్రీన్ టీలో మ‌న శ‌రీరంలో హానిక‌ర‌మైన ఫ్రి రాడిక‌ల్స్‌ను పోరాడ‌టానికి అవ‌స‌ర‌మైన యాంటీఆక్సీడెంట్లు ఉంటాయి. ప్ర‌తీరోజూ మిత‌మైన ప‌రిమాణంలో తీసుకుంటే ఇది శ‌రీరం హైడ్రేష‌న్‌గా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version