మనం ఇంట్లో ఈజీగా చేసుకునే స్వీట్స్‌లో క్యారెట్ హల్వా ఒకటి. చాలామందికి స్వీట్స్ అంటే అమితమైన ప్రేమ. స్వీట్స్ చూస్తే చాలు నోరూరిపోతుంది. అందులో
హల్వా అంటే ఇంక చెప్పనవసరం లేదు. ఎంతో రుచిగా ఉండే ఈ క్యారెట్ హల్వాను పిల్లలు, పెద్దలు వయసుతో సంబంధం లేకుండా చాలా ఇష్టంగా తినేయచ్చు. ముఖ్యంగా క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్ అధికంగా ఉంటాయి. చాలా మంది పిల్లలు క్యారెట్ కూరలు చేస్తే అంతగా ఇష్టపడరు. అలాంటి వాళ్లకు ఇలా ఇంట్లోనే ఈజీగా క్యారెట్తో హల్వా చేసేయండి. లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తారు. మరి రుచికరమైన క్యారెట్ హల్వాను తక్కువ పదార్ధాలు ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలునుకుందాం.
క్యారెట్ హల్వా తయారీకి కావల్పిన పదార్ధాలు:
1.క్యారెట్స్ – 6
2. పంచదార – 100 గ్రా
3. పాలు – 1\2 లీటరు
4. యాలికులు పొడి – 1\2 టీ స్పూన్
5. నెయ్యి కొద్దిగా
క్యారట్ హల్వా తయారీ విధానం:
1. ముందుగా కుక్కర్‌లో కొద్దిగా నెయ్యి వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకుని 2 విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి.
2. ఇప్పుడు స్టౌ మీద వేరే కళాయి పెట్టుకుని 1\2 లీటరు వరకు పాలు పోసి మరిగించుకోవాలి. ఆపై కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకుని పంచదారను వేసుకుని కలుపుకోవాలి.
3. బాగా మరిగిన పాలను పక్కన పెట్టుకుని ఇప్పుడు కుక్కర్ లో వేసిన పంచదారను క్రీమిగా వచ్చేవరకూ కలుపుకోవాలి.
4. ఈ విధంగా కలుతున్నప్పుడు అందులో మరిగిన పాలను వేసుకుని 15 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
5. హల్వా గట్టిపడిన తర్వాత అందులో కొంచెం బాదం పలుకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కలుపుకోవాలి.
6. అంతే ఎంతో రుచికరమైన నోట్లో వెన్నలా కరిగిపోయే క్యారెట్ హల్వా రెడీ అయినట్టే.
క్యారెట్ వల్ల ఉపయోగాలు:
క్యారెట్ లో విటమిన్ ఎ, కె, సి, పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యు.వి. కిరణాలను నిరోధించడం ద్వారా చర్మానికి సహాయపడుతుంది. క్యారెట్‌లో ఉండే విటమిన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. హల్వాలో వాడే నెయ్యి అధిక ప్రయోజనాలు ఇస్తుంది. ఇది చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. హల్వాలోని పాలు పోషక విలువలను పెంచుతాయి. పాలు ఎముకలను ధృడంగా ఉంచడానికి సహాయపడతాయి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్