Raw milk benefits for skin: పచ్చిపాలల్లో అవసరమైన పోషకాలు, ఎంజైమ్స్, చర్మానికి ప్రయోజనాన్ని అందించే బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఇవి మీ చర్మానికి అవసరమైన అనేక ప్రయోజనాలు అందిస్తాయి. అయితే దీనిని చర్మానికి ఎలా అప్లై చేయాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు తాగితే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలుంటాయో అందరికీ తెలుసు. అయితే పచ్చిపాలతో చర్మానికి కూడా అన్నే ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. దాని అర్థం పచ్చిపాలను తాగాలని కాదు.. అలా పచ్చిపాలు తాగితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదాలే ఎక్కువ. కాబట్టి పచ్చిపాలు తాగడం కాకుండా చర్మ సంరక్షణ కోసం నేరుగా వినియోగించవచ్చు. దీనిని ఎలా అప్లై చేయాలి? చర్మ సంరక్షణలో దీని పాత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి..
పచ్చిపాలు చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఇవి మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిలో సహజ కొవ్వులు, ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ఇవి చర్మతేమను పునరుద్ధరిస్తాయి. అంతేకాకుండా పచ్చిపాలు చర్మంపై రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి. ఇది మీ చర్మంపై తేమ నష్టాన్ని నివారించి మృదువుగా చేస్తుంది. పచ్చి పాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు, వడదెబ్బ, చర్మంపై చికాకు వంటి వివిధ చర్మ సమస్యలనుంచి మీకు ఉపశమనాన్ని అందిస్తాయి. ఇది మీ చర్మాన్ని శాంతపరచి.. ఎరుపును, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
యాంటీ ఏజింగ్ ప్రయోజనాల కోసం..
పచ్చిపాలల్లోని విటమిన్లు A, D, E వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే బీటా-కేసిన్ ప్రోటీన్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే అకాల వృద్ధాప్యం నుంచి మీ చర్మాన్ని రక్షిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొని, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. గీతలు, ముడతలను తగ్గిస్తాయి.
మెరిసే చర్మానికై..
చర్మం కాంతివంతంగా ఉండటంలో పచ్చి పాలు మెరుగైన ఫలితాలు అందిస్తాయి. ఇవి మీ స్కిన్ టోన్‌ని ప్రకాశవంతం చేస్తాయి. దీనిలోని లాక్టిక్ యాసిడ్ ఒక సున్నితమైన ఎక్స్‌ఫోలియంట్ గా పనిచేస్తుంది. ఇది మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వార మీ చర్మం ప్రకాశవంతమైన మెరిసే చర్మాన్ని పొందుతుంది.
పచ్చిపాలను ఎలా ఉపయోగించాలంటే..
పచ్చిపాలను పసుపుతో కలిపి మంచి పేస్ట్ తయారు చేయాలి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. దీనిని చర్మంపై అప్లై చేయడం వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మెరుగైన ఫలితాల కోసం రెండు రోజులకు ఒకసారి దీనిని అప్లై చేయండి. అంతేకాకుండా తేనే, పచ్చిపాలు కలిపి కూడా మీరు దీనిని ట్రై చేయవచ్చు. ఈ రెండు సహజమైన పదార్థాలు మీ చర్మానికి మంచి క్లెన్సర్ లా పని చేస్తాయి. గ్లోయింగ్ స్కిన్ కావాలనుకునేవారు ముల్తానీ మట్టి, పాలు కలిపిన పేస్ట్ ట్రై చేయవచ్చు. ఇలా సహజమైన వస్తువులతో మీరు పచ్చిపాలను ఉపయోగించి మెరుగైన స్కిన్ కేర్ పొందవచ్చు.
పచ్చి పాలు మెరిసే చర్మానికి సహజమైన ఇంటి నివారణే కావొచ్చు. కానీ మీరు సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటే.. మీరు దీనిని ట్రై చేయకపోవడమే మంచిది. లేదంటే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. వైద్యుని సంప్రదించి మీరు దీనిని వినియోగించవచ్చు.