Home హెల్త్ ఒంట్లో కొవ్వు మలినాలు తగ్గించుకోవడం ఎలా

ఒంట్లో కొవ్వు మలినాలు తగ్గించుకోవడం ఎలా

Toxin removing food
Image by Alexas_Fotos from Pixabay

ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి చాలా మంది నానా పాట్లు పడుతుంటారు. డైటింగ్‌ చేస్తుంటారు.. జ్యూసులే తాగి బతికేస్తుంటారు. ఇష్టం లేకపోయినా వింత వింత పదార్థాలను తినేస్తుంటారు. ఇక కాలుష్యం కారణంగానో.. మనకున్న చెడు అలవాట్ల వల్లో ఒంట్లో మలినాలు కూడా పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. వీటిని బయటకు పంపించడానికి కూడా ఇష్టం లేని చేదును బలవంతంగానైనా మింగేస్తున్నారు. కానీ ఆ అవసరం లేకుండా, మీకు నచ్చే ఫుడ్‌తోనే ఒంట్లో కొవ్వు, మలినాలు తొలగించుకోవచ్చని తెలుసా? ఇప్పుడు మేం చెప్పుబోయే వాటిని రెగ్యులర్‌గా తినండి లేదా తాగండి.. పెద్దగా ఇబ్బంది పడకుండానే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపండి. ఒంట్లో కొవ్వు మలినాలు తగ్గించుకోండి.

గ్రేప్‌ఫ్రూట్‌ (దబ్బ పండు)

చాలా మంది బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటారు. బాగా ఆకలి వేస్తున్నా.. లైట్‌గా తింటూ ఒళ్లు తగ్గించుకోవడానికి శ్రమ పడతారు. కానీ ఆ అవసరం లేదు. ప్రతి పూటా మీరు తినే ముందు సగం గ్రేప్‌ఫ్రూట్‌ను తినండి. ఆరు వారాల్లో మీకే స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఈ పండు తాలూకు అద్భుతమైన ఫలితాలు మెటబాలిజం అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. ఈ పండులో కొవ్వును కరగదీసే ఫైటో కెమికల్స్‌ ఉంటాయి. వీటి వల్ల మీ నడుము చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది.

మందార టీ

మందార టీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా హైబీపీ ఉన్న వాళ్లకు బాగా పని చేస్తుంది. రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి కూడా బాగానే ఉపయోగపడుతుంది. పైగా జీర్ణశక్తి పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా మందార టీ ఉపకరిస్తుంది. ఇందులో విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. 

అవకాడో

అవకాడో పండు వల్ల కూడా మీ శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌ కంటి చూపును మెరుగు పరుస్తుంది. లివర్‌ను పాడు చేసే గాలాక్టోసమైన్‌ అనే ఓ విష పదార్థానికి ఈ అవకాడో విరుగుడుగా పని చేస్తుంది.  దీని టేస్ట్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. సో.. కచ్చితంగా మీ డైట్‌లో ఈ పండును చేర్చుకోవచ్చు. 

నిమ్మరసం

ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లయినా తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే ప్రతిసారీ ఆ నీటిలో కొన్ని నిమ్మకాయ ముక్కలు వేసుకొని తాగండి. ఒంట్లో మలినాలను శుభ్రం చేయడానికి నీళ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిలో నిమ్మకాయ ముక్కలు వేయడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. 

సాల్మన్‌ చేపలు

స్మోకింగ్‌ ఎంత ప్రమాదమో మనకు తెలుసు. అయినా దానిని మానేయడానికి చాలా ఇబ్బంది పడతాం. ఈ స్మోకింగ్‌ కారణంగా వివిధ క్యాన్సర్లతోపాటు గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎలాగైనా స్మోకింగ్‌ మానేయాలి అనుకున్న వాళ్లు.. రోజూ కొంత మోతాదులో అయినా సాల్మన్‌ చేపను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇందులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ రక్తాన్ని శుభ్రం చేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణకు ఎలాంటి అడ్డంకి లేకుండా సాఫీగా సాగిపోతుంది. రోజుకు రెండు గ్రాముల ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ తీసుకుంటే చాలు.. మీ గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు శుభ్రపడతాయి. వంద గ్రాముల సాల్మన్‌ చేపలో ఈ రెండు గ్రాముల ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. 

బీట్‌రూట్‌

మందు తాగే అలవాటు ఉన్నవాళ్ల లివర్‌ త్వరగా చెడిపోతుందని తెలుసు కదా. అలాంటి వాళ్లకు ఈ బీట్‌రూట్స్‌ ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే బెటాలేన్స్‌ అనే యాంటీఆక్సిడెంట్స్‌.. కాలేయంలోని కణాలను బాగు చేయగలవు.. కొత్తగా సృష్టించగలవు. దీనివల్ల లివర్‌ బాగా పని చేస్తుంది. 

ఆవాలు

మీ శరీర జీవక్రియ (మెటబాలిజం)ను మెరుగు పరుచుకునేందుకు ఆవాలు ఎంతగానో సాయం చేస్తాయి. ఒక టీ స్పూన్ ఆవాలు తింటే చాలు.. కొన్ని గంటల పాటు మీ జీవక్రియ 25 శాతం మేర మెరుగుపడుతుంది. శరీరానికి మంచి ప్రొటీన్‌ ఇచ్చే మాంసాహారంతో కలిపి ఈ ఆవాలను తీసుకుంటే.. మరింత మేలు జరుగుతుంది. 

పాలకూర

విపరీతమైన ఆకలితో బాధపడేవాళ్లకు పాలకూర దివ్యౌషధంలా పని చేస్తుంది. ఈ పాలకూర ద్వారా సహజసిద్ధంగా మీ ఆకలిని తగ్గించుకోవచ్చు. ఇందులో ఆకలిని తగ్గించే గుణం ఉన్న తైలకాయిడ్స్‌ ఉంటాయి. ప్రతి రోజూ మీ బ్రేక్‌ఫాస్ట్‌లోనో, లంచ్‌లోనూ పాలకూర కచ్చితంగా ఉండేలా చూసుకోండి.

అరటిపండ్లు

కడుపు ఉబ్బరానికి అరటిపండ్లు మంచి మందుగా పని చేస్తాయి. రోజూ రెండు పూటలా భోజనం చేసే ముందు అరటిపండు తింటే ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల 50 శాతం వరకు కడుపు ఉబ్బరం సమస్య  తగ్గిపోయినట్లు అనేరోబ్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గించే బ్యాక్టీరియాను పెంచడంతోపాటు శరీరానికి అవసరమైనంత పొటాషియం ఈ అరటిపండు అందిస్తుంది. 

టమాటాలు

ఎండ వేడిమి నుంచి చర్మాన్ని కాపాడగలిగే యాంటీఆక్సిడెంట్స్‌ టమాటాల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ మన మెనూలో టమాటాలకు కూడా చోటిస్తే.. సూర్య కాంతి వల్ల మీ చర్మం దెబ్బ తినకుండా ఉంటుంది. వీటిని నేరుగా తినడం ఇష్టం లేకపోతే.. కూర, సాస్‌, సూప్‌ లేదా ఆమ్లెట్‌లలో కూడా వేసుకోవచ్చు. 

కివి పండు

మలబద్ధకంతో బాధపడే వాళ్లు ఈ కివి పండు తింటే ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. నెల రోజుల పాటు రోజుకు రెండు కివి పండ్లను తింటే.. మలబద్ధకం చాలా వరకు తగ్గిపోయినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు దాదాపు అన్ని సూపర్‌ మార్కెట్‌లలో ఈ కివి పండు దొరుకుతోంది. 

చల్లని బంగాళాదుంపలు

మనం బంగాళాదుంపలను తరచూ తింటూనే ఉంటాం.. కానీ వాటిని వేడి వేడిగా తినడం మనకు అలవాటు. అలాకాకుండా బంగాళాదుంపలను వండిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. దీనివల్ల వాటిలో రెట్రోగ్రేడేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఆలుగడ్డల్లో ఉండే సులువుగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు కాస్తా.. నిరోధక పిండి పదార్థాలుగా మారుతాయి. ఈ పిండి పదార్థాలను అరిగించుకోవడానికి శరీరం కాస్త ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. దీని కారణంగా శరీరంలో ఉన్న అదనపు  కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. 

బాదాం

మందు తాగే అలవాటు ఉన్న వారి కాలేయం చుట్టూ చెడు కొలెస్ట్రాల్‌ చేరుతుంది. ఇది కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. మంచి విటమిన్లు ఉన్న బాదాంలను రోజూ తింటే.. ఈ చెడు కొలెస్ట్రాల్‌ తొలగిపోయి, కాలేయం శుభ్రపడుతుంది. 

ఓట్స్‌

ఓట్స్‌లోనూ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు ఓట్స్‌లో 16 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఒబెసిటీ, డయాబెటిస్‌, గుండె జబ్బులలాంటి వాటి బారిన పడకుండా ఓట్స్‌ కాపాడతాయి. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓట్స్‌ను తీసుకుంటే మేలు జరుగుతుందని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పరిశోధనలో తేలింది. 

Exit mobile version