Home స్కిల్స్ ఆన్ లైన్ మోసాలు : పాత వస్తువులు అమ్మేటప్పుడు జాగ్రత్త

ఆన్ లైన్ మోసాలు : పాత వస్తువులు అమ్మేటప్పుడు జాగ్రత్త

online fraud
Image by Tumisu from Pixabay

న్ లైన్ మోసాలు కోకొల్లలు. పాత వస్తువులను అమ్మేయాలనుకున్నా ఈ మోసాలు ఎదుర్కోకతప్పని పరిస్థితి. క్వికర్‌, ఓఎల్‌ఎక్స్‌ తదితర వెబ్ సైట్లు పాత వస్తువులను అమ్మేసేందుకు ఉపయోగపడతాయి కదా.. సింపుల్‌గా మనం అమ్మాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు తీసి, దానిని ఎంతకు అమ్మాలనుకుంటున్నామో ధర పెట్టేయాలి. మీ వివరాలు ఇస్తే.. ఆసక్తి ఉన్నవాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు.

అయితే వీటిని ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. వస్తువును అమ్మేది మీరే.. మీకు తెలియకుండానే దానికి ఎదురు డబ్బులు చెల్లించేది మీరే.. ముఖ్యంగా యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ విషయంలో ఈ మోసాలు జరుగుతున్నాయి. అదెలా జరుగుతుంది.. ఆ మోసం బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

మోసం ఎక్కడ మొదలవుతుందంటే..

మీరు ఈ తరహా వెబ్ సైట్లలో ఏదైనా వస్తువును అమ్మకానికి పెట్టగానే ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి ఫోన్‌ వస్తుంది. సపోజ్‌.. మీ పాత మొబైల్‌ ఫోన్‌ను అమ్మేయాలనుకొని దాని ఫొటోలను ఈ వెబ్‌సైట్లలో పెట్టారని అనుకుందాం. కాసేపటికే ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి ఫోన్‌ వస్తుంది. సాధారణంగా పాత వస్తువులను అమ్మే సమయంలో ఎవరైనా బేరమాడుతారు. మీరు చెప్పిన ధరను తగ్గించమని అడుగుతారు.

కానీ ఇలాంటి మోసగాళ్లు ఫోన్‌ చేసినప్పుడు ఎలాంటి బేరమాడరు. మీరు చెప్పిన ధరకు కొనడానికి సిద్ధమవుతారు. ఒక్కోసారి వెంట వెంటనే కాల్స్‌ వస్తాయి. మీ వస్తువును కొనడానికి పోటీ పడుతున్నట్లుగా ఉంటుంది పరిస్థితి. కొంతమంది మీరు చెప్పిన ధర కంటే.. ఎక్కువిచ్చి అయినా కొనడానికి రెడీ అంటారు. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఫోన్‌ చేసిన వ్యక్తి.. బేరమాడకపోయినా, ఎక్కువ మొత్తం ఇస్తానని చెబుతున్నా.. అనుమానించండి.

మోసం ఎలా జరుగుతుందంటే..

మనం ఏదైనా కొత్త వస్తువు కొనడానికి కూడా చాలాసార్లు బేరమాడతాం. వీలైనంత తక్కువకు కొనడానికే ప్రయత్నిస్తాం. అలాంటిది మీరు వాడిన వస్తువును కొనడానికి అవతలి వ్యక్తి మీరు చెప్పిన ధరకన్నా ఎక్కువ చెల్లిస్తానంటే కచ్చితంగా అనుమానం రావాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో అవతలి వ్యక్తి.. మీ వస్తువును బుక్‌ చేసుకోవడానికి యూపీఐ ద్వారా డబ్బు చెల్లిస్తానని చెబుతారు. అసలు మోసం ఇక్కడే మొదలవుతుంది.

మొత్తం డబ్బు కానీ, అడ్వాన్స్‌గా కొంత మొత్తంగానీ డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ ద్వారా పంపిస్తానని అంటారు. అంటే గూగుల్‌ పే, ఫోన్‌ పె, ఇతర యూపీఐ యాప్స్ అన్నమాట. మీకు డబ్బు చెల్లించాల్సిందిపోయి.. ఈ యాప్స్‌లోని రిక్వెస్ట్‌ మనీ ఆప్షన్‌ ద్వారా మిమ్మల్నే డబ్బు అడుగుతారు. ఈ మెసేజ్‌ను సరిగా చూసుకోకపోతే మీరు మోసపోయినట్లే. వచ్చిన మెసేజ్‌పై క్లిక్‌ చేసేస్తే.. మీ అకౌంట్లోని డబ్బే అవతలి వ్యక్తికి చేరిపోతుంది. 

ఓటీపీనీ లాగేస్తారు..

మోసగాళ్లు ఒక్కోసారి మీ డబ్బును దోచుకోవడానికి మర్చంట్‌ అకౌంట్‌ కూడా వాడుతుంటారు. ఇలాంటి సమయంలో మీ మొబైల్‌కు ఓటీపీ కూడా వస్తుంది. పేటీఎంలాంటి సంస్థలు మర్చంట్‌ పేమెంట్స్‌లో మోసం జరగకుండా ఉండేందుకు సదరు కస్టమర్‌కు ఓటీపీ కూడా పంపిస్తాయి. ఈ సందర్భంలో మర్చంట్‌ అకౌంట్‌ వాడే మోసగాళ్లు మిమ్మల్ని ఆ ఓటీపీ అడుగుతారు. ఆ ఓటీపీ చెప్పేశారో మీ అకౌంట్లో డబ్బు పోయినట్లే.

అసలు ఇక్కడే కాదు.. ఏ సందర్భంలో అయినా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఇలాంటి ఓటీపీలు అడిగితే చెప్పొద్దు. డబ్బు మీ అకౌంట్‌లో నుంచి డెబిట్‌ కావడానికి ఈ ఓటీపీలు వస్తాయి తప్ప.. క్రెడిట్‌ కావడానికి కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

మీకు ఎవరైనా డబ్బులు పంపిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ రాదు. పొరపాటుగానో, తొందర్లోనో అనాలోచితంగా మీకు వచ్చిన ఓటీపీ చెప్పేస్తే.. మీ వస్తువుకు మీరే ఎదురు డబ్బులు ఇచ్చిన వాళ్లు అవుతారు. 

ఇలా చేస్తే సేఫ్‌

సాధారణంగా ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌లలో వస్తువులను అమ్మేటప్పుడు యూపీఐల ద్వారానే డబ్బు చేతులు మారుతుంది. అయితే ఆ డబ్బు తీసుకోవడంగానీ, మీ వస్తువును ఇవ్వడంగానీ.. అవతలి వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాతే చేయడం అన్ని విధాలుగా మంచిది. మీ వస్తువును ఇవ్వాలంటే ఎలాగూ కొనే వ్యక్తి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాల్సిందే. అదే విషయం ఆ వ్యక్తికి చెప్పండి. నేరుగా మాట్లాడి బేరం కుదుర్చుకోండి.

పేమెంట్స్‌ పొందేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక తప్పదు అనుకుంటేనే మీ వస్తువును కొనే వ్యక్తికి మీ ఇంటి అడ్రెస్‌ ఇవ్వండి. లేదంటే బయట ఎక్కడో ఓ చోట కలవండి. అసలే ఆన్‌లైన్ వ్యాపారం. అవతలి వ్యక్తులు మొహాలు కూడా తెలియవు. అందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆన్ లైన్ మోసాలను ఎదుర్కోవచ్చు.

ఇవి కూడా చదవండి

Exit mobile version