Latest

Biryani Types: బిర్యానీ అంటేనే నోరూరిపోతుంది. బిర్యానీలలో ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. నేషనల్ క్రష్ ‘బిర్యానీ’ (Biryani). దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లి ఎవరిని అడిగినా బిర్యానీ అంటే ఇష్టమనే చెబుతారు. హార్డ్ కోర్ బిర్యాని లవర్స్ (Biryani Lovers) ఎంతోమంది ఉన్నారు. మనకి తెలిసింది హైదరాబాదీ దమ్ బిర్యాని (Hyderabad Dum Biryani). దాని రుచికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ బిర్యాని మాత్రమే కాదు. ఇంకా ఎన్నో రకాల టేస్టీ బిర్యానీలు (Tasty Biryani) ఉన్నాయి. వీలైనప్పుడు వీటిని కూడా రుచి చూడండి.

మోతీ బిర్యాని

దీన్నే ముత్యాల బిర్యాని అంటారు. ఉడకబెట్టిన గుడ్లపై వెండి, బంగారపు రేకులను చుట్టి ముత్యాల్లా తయారు చేస్తారు. గుడ్లు, చికెన్, బియ్యం, మసాలా దినుసులతో కలిపి బిర్యానీగా వండుతారు. ఇదే మోతీ బిర్యాని. ఒకప్పుడు అవధ్ రాజ్యాన్ని పాలించిన నవాబు తన కోసమే ఈ బిర్యానీని ప్రత్యేకంగా వండించుకునేవారు. 18వ శతాబ్దంలో ఈ బిర్యానీని తయారు చేశారు. అప్పటి అవధ్ రాజ్యం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో భాగం అయింది.

మొఘల్ బిరియాని

మనకు బిర్యానీ పరిచయం అవ్వడానికి కారణం మొఘలులే. వీరు తెచ్చిన బిర్యాని ఇప్పుడు దేశమంతటా పాకింది. మాంసాన్ని మసాలా దినుసులతో మ్యారినేట్ చేసి, కేవరా అని పిలిచే సువాసన భరితమైన మొక్క నుంచి తీసిన రసాన్ని కలిపి ఈ బిర్యానీని తయారు చేస్తారు. ముఖ్యంగా చక్రవర్తుల కోసమే ప్రత్యేకంగా ఈ బిర్యాని వండేవారు.

కోల్‌కతా బిర్యాని

కోల్‌కతా వెళ్లిన వాళ్లు కచ్చితంగా ఈ బిర్యానీని రుచి చూడాలి. ఇది కాస్త వెరైటీగా ఉంటుంది. దీనిలో ఉడకబెట్టిన బంగాళదుంపలను కూడా వాడుతారు. మాంసం రుచికి బంగాళాదుంప రుచి తోడై కొత్త రుచిని అందిస్తుంది.

మీన్ బిర్యాని

మీన్ బిర్యాని అంటే చేపతో వండే దమ్ బిర్యాని. కేరళలో ఇది చాలా పాపులర్. చేపలు, వేయించిన జీడిపప్పులు, మసాలా పేస్ట్ ను కలిపి బిర్యాని వండుతారు. దీనికి కొబ్బరి కోరు, కేరళలో దొరికే నల్లని కొకెమ్ అనే పండ్లు కూడా చేర్చి వండుతారు. కేరళ వెళ్ళిన వాళ్ళు కచ్చితంగా ఈ బిర్యాని టేస్ట్ చూడాలి.

ఆచారి బిర్యాని

ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బిర్యాని చాలా పాపులర్. అచారి మసాలా (పచ్చళ్లకు వాడేది) దీనిలో ఎక్కువగా కలుపుతారు. మెంతులు, మామిడిపొడి, నల్ల జీలకర్ర గింజలు కలిపి అచారి మసాలాను తయారు చేస్తారు. ఈ బిర్యానీ కాస్త భిన్నంగా ఉంటుంది.

జోధ్‌పూర్ బిర్యాని

జోధ్‌పూర్ వెళ్లినవారు కచ్చితంగా తినాల్సిన బిరియాని ఇది. కాకపోతే ఇది శాఖాహార బిర్యాని. ఎలాంటి మాంసాహారాన్ని ఇందులో చేర్చరు. బియ్యం, అనేక కూరగాయలు కలిపి వండుతారు. అప్పట్లో ఇది జోధాపూర్ ను పాలించిన మహారాజుల కోసం దీన్ని వండేవారు. దీనిలో డ్రైఫ్రూట్స్ చేర్చి వండుతారు.

కటక్ బిర్యాని

ఒడిశాలోని కటక్ ప్రాంతంలో దీన్ని వండుతారు. అందుకే దీన్ని కటక్ బిర్యాని అంటారు. దీన్ని మటన్ తో మాత్రమే తయారు చేస్తారు. పర్షియాకు చెందిన ఈ బిర్యాని సైనికుల ద్వారా కటక్ చేరిందని అంటారు. కటక్ బిర్యానీకి ఒడిశాలో అభిమానులు ఎక్కువ. అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ బిరియాని రుచి చూడండి.

ఇంకా చెట్టినాడ్ బిర్యానీ, కశ్మీర్ బిర్యాని, బాంబే బిర్యాని, లక్నవీ బిర్యాని, మలబార్ బిర్యాని, సింధి బిర్యాని.. ఇలా ఇంకా చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి.

– మానస


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version