Black Grapes Benefits: జుట్టు, చర్మం, ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందాలనుకుంటే మీ డైట్లో నల్ల ద్రాక్షలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన నల్ల ద్రాక్షలు మీకు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని నేరుగా లేదా సలాడ్ల రూపంలో లేదా జ్యూస్ లేదా ఎండబెట్టి కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకుంటే పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల నల్లద్రాక్షలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహనే దీనికి కారణం. నల్లగా, చిన్నగా ఉండే ఈ పండ్లు పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తున్నాయి. హృదయం నుంచి మొదలుకొని.. నరాల ఆరోగ్యంపై సానూకూల ప్రభావాలను అందిస్తుంది. అంతేకాకుండా మధుమేహం, క్యాన్సర్ నివారించడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షను మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
యాంటీఆక్సిడెంట్ పవర్‌హౌస్
నల్ల ద్రాక్ష పూర్తిగా యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి మీ కణాలను దెబ్బతినకుండా కాపాడడంలో, మధుమేహం, అల్జీమర్స్, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి వ్యాధులతో పోరాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి.
జుట్టు పెరుగుదలకై..
నల్ల ద్రాక్ష మీ జుట్టుకు కూడా మేలు చేస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి కుదుళ్లను ఒత్తిడి నుంచి రక్షించి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.
గుండె ఆరోగ్యానికై..
రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు ద్రాక్షలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి మీ గుండె, మెదడుకు మెరుగైన రక్షణను అందిస్తాయి. నల్ల ద్రాక్షలోని ఆంథోసైనిన్‌లు మీ ధమనులను రక్షించడంలో సహాయపడతాయి. ఒత్తిడి, వాపును తగ్గించి.. గుండెకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందిస్తాయి. గ్రేప్ వైన్ కూడా మీ ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. అయితే దీనిని లిమిటెడ్ గా మాత్రమే తీసుకోవాలి.
మెదడు ఆరోగ్యానికై..
నల్ల ద్రాక్ష మీ మెదడుకు చాలా మంచిది. దానిలోని రెస్వెరాట్రాల్ అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. రెడ్ వైన్ కూడా మీ జ్ఞాపకశక్తిని పదునుగా ఉంచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
క్యాన్సర్ నుంచి పోరాడడానికై..
నల్ల ద్రాక్షలోని రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్‌ల వంటి యాంటీఆక్సిడెంట్‌లు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పని చేస్తాయి. కొన్ని జంతువులపై చేసిన అధ్యయనాల్లో ఇవి కణితి పెరుగుదల, వ్యాప్తిని ఆపగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు వెల్లడించాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో రెస్వెరాట్రాల్ ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ.. మానవులపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.
చర్మ ఆరోగ్యానికై..
నల్ల ద్రాక్షల్లో ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవి చర్మ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మొటిమలు, చిన్న చిన్న చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఇది మీ చర్మానికి సహజమైన సన్‌స్క్రీన్ లాంటిది. UV రేడియేషన్ వంటి హానికరమైన ప్రభావాల నుంచి ఇది మీ చర్మాన్ని కాపాడుతుంది.
డయాబెటిస్ తగ్గింపునకై..
రెస్వెరాట్రాల్‌తో సహా నల్ల ద్రాక్షలోని పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రెస్వెరాట్రాల్ ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఇది మధుమేహం, దానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికై..
నల్ల ద్రాక్షలోని రెస్వెరాట్రాల్, టెరోస్టిల్‌బీన్ రెండూ కూడా స్థూలకాయ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా దీనిలోని ఫైబర్స్, పాలీఫెనాల్స్ గట్, కొలెస్ట్రాల్ మెకానిజంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. జీర్ణక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది సహజంగా బరువు తగ్గడానికి మీకు సహాయపడవచ్చు. ఇవేకాకుండా ఎముకలను బలపరచడానికై, కంటి చూపు మెరుగునకై, మంచి నిద్రకై మీరు దీనిని సేవించవచ్చు.