Betel Leaves uses: తమలపాకు యొక్క ఉపయోగాలు తెలిస్తే వాటిని మీరు కూడా తినడం మొదలుపెడతారు. వీటిని ఇంగ్లిషులో బీటిల్ లీవ్స్ (betel leaves) అంటారు. వీటికి ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత ఉందో ఆహారంగా కూడా అంతే ప్రాధాన్యత ఉంది. హృదయాకృతిలో ఉండే ఈ తమలపాకులు ఆయుర్వేదంలో ఔషధంగా చోటు దక్కించుకున్నాయి. వివిధ వ్యాధులను నయం చేయడంలో ఔషధంగా పనిచేస్తాయి.
తమలపాకులతో ప్రయోజనాలు ఇవీ
- విటమిన్ సి: తమలపాకుల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అలాగే రైబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్, కెరోటిన్ కూడా అధిక మోతాదులో ఉంటాయి. అలాగే కాల్షియం కూడా లభిస్తుంది. ఈ కారణంగా ఇది మీ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
- నొప్పి నివారణ: తమలపాకుల రసం, లేదా గుజ్జు నొప్పి నివారణగా ఉపయోగపడుతుంది. చర్మం కోసుకుపోయినప్పుడు, గాయాలైనప్పుడు తమలపాకులు నొప్పి తగ్గిస్తాయి. తమలపాకు రసం తాగితే శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. శరీరంలో ఎక్కడైనా వాపు, మంట ఉంటే కూడా తగ్గుతాయి.
- జీర్ణక్రియ మెరుగవుతుంది: భోజనం అనంతరం పాన్ తింటే తమలపాకు నుంచి వచ్చే ఔషధ గుణాలు జీర్ణక్రియ మెరుగవడానికి దోహదం చేస్తుంది. మెటబాలిజం (జీవక్రియ) మెరుగవుతుంది. కడుపులో పేగులు సక్రమంగా పనిచేస్తూ కీలకమైన విటమిన్లు అన్నీ శరీరం సంశ్లేషించుకునేలా దోహదం చేస్తుంది.
- క్యాన్సర్‌పై పోరాటం: తమలపాకుల్లో ఫెనోలిక్ మిశ్రమాలు ఉంటాయి. వీటిలో బోలెడన్నీ యాంటాక్సిడంట్లు ఉంటాయి. అలాగే క్యాన్సర్ కణాలను అడ్డుకునే గుణాలు కలిగి ఉంటాయి.
- బరువు తగ్గడంలో సాయం: తమలపాకులు శరీరంలో అధిక కొవ్వులను తగ్గిస్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా శరీరం బరువు కోల్పోయేలా చేస్తాయి.
- నోటి ఆరోగ్యం: తమలపాకులు నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటిలోని బ్యాక్టీరియాను అంతం చేస్తాయి. నోటి దుర్వాసనను ఆరికడతాయి. దంతక్షయాన్ని ఆపుతాయి. దంతాలను పాడు చేసే క్రిములను చంపేస్తాయి.
- చర్మ సంరక్షణకు: తమలపాకులో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. చర్మ అలర్జీలను తొలగిస్తాయి. పొడి బారిన చర్మాన్ని నయం చేస్తాయి. నల్ల మచ్చలను తొలగిస్తాయి.
- వేసవి వేడిని తొలగించేలా: తాంబూలం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది.
తమలపాకు ఉపయోగాలు తెలుసుకున్నారు కదా.. మీరూ అప్పుడప్పుడు తిని చూడండి. దాని వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.