Basil leaves health benefits: తులసి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు అపరిమితమనే చెప్పాలి. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాాధులను నయం చేసే ఔషధ మొక్క ఇది. పురాణప్రాశస్త్యం గల తులసి మొక్కను దేవతలా ఆరాధించడమే కాదు.. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అంతే ప్రాచుర్యం పొందాయి. దేవాలయాల్లో ప్రసాదించే తీర్థంలో తప్పక తులసి ఆకులు కలుపుతారంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. తులసి మొక్క ఇచ్చే వాసన, దీని నుంచి వీచే గాలి కూడా రోగ నివారణకు పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా విముక్తి కలిగించే శక్తి దీనికి ఉందంటారు.
మొక్కలకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే, అలాగే ప్రసరింపేజేసే శక్తి కూడా ఉంటుందని విన్నారా? తులసి మొక్క ఈ కోవలోకి వస్తుందని ఇదివరకు నిరూపితమైంది కూడా. తులసి మొక్కలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ లక్ష్యం ఉంటుందని, తులసి మొక్కలు దరి దాపుల్లో పిడుగు పడదని చెబుతారు. తులసి మొక్క సమీపంలో పిడుగు పడినా, పిడుగు ద్వారా జనించిన విద్యుత్ శక్తి భూమిలోకి ప్రవహింపజేసేలా ఈ తులసి మొక్క చేస్తుందని చెబుతారు. పూర్వీకులు ప్రతి ఇంటా తులసి మొక్క ఉండాలని నిర్దేశించడం వెనక ఈ శాస్త్రీయత దాగి ఉందని అవగతమవుతుంది. అంతేకాదు విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తికి తల, ముఖం, అరికాళ్లు, అరచేతులకు తులసి రసంతో మర్ధన చేస్తే చావు దరి చేరదని చెబుతారు. ఇతర చెట్ల కంటే మూడు రెట్లు వేగంగా ఇది కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని వదలిపెడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Basil leaves health benefits: తులసి వల్ల జరిగే మేలు ఇదే..
- తులసి క్షయవ్యాధిని నిరోధిస్తుందని, క్షయ వ్యాధి ఉన్నా నయం చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- మలేరియా జ్వరాన్ని నయం చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
- తులసి ఆకు రసంతో పొట్టలోని ఏలికపాములు మలం ద్వారా బైటకు పోతాయి. ఆకలి బాగా పెరుగుతుంది.
- తులసి రసం తాగడం వల్ల మలిన రక్తం శుద్ధి అవుతుంది.
- తులసి రసం తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో చేరిన కఫం తొలగి లంగ్స్ శుభ్రమవుతాయి.
- తులసి రసం తాగితే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.
- రక్తం గడ్డకుండా నివారిస్తుంది.
- పరగడపున (ఖాళీ కడుపుతో) తులసి ఆకులు తింటే మీ జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. కడుపులో యాసిడ్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి.
- తులసి ఆకులు తినడం వల్ల మెటబాలిక్ ఒత్తిడి తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉండేందుకు, బ్లడ్ ప్రెజర్ నార్మల్‌గా ఉండేందుకు, లిపిడ్ లెవెల్స్ సాధారణంగా ఉండేందుకు తోడ్పడతాయి.
- తులసి ఆకుల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెమొరీ లెవెల్స్ పెరుగుతాయి. గ్రహణ శక్తి మెరుగవుతుంది. ఆంగ్జియోలైటిక్, యాంటి-డిప్రెసెంట్ గుణాలు తులసిలో పుష్కలంగా ఉంటాయి.
- తులసి యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీప్రోటోజోల్, యాంటీమలేరియల్ గుణాలు కలిగి ఉంటుంది.
- దోమల నివారణకు మస్కిటో రెపెల్లెంట్‌గా ఉపయోగపడుతుంది.
- తులసి ఆకుల రసం డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- తులసి ఆకులు యాంటాక్సిడెంట్లు కలిగి ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది.
- డయాబెటిస్, థైరాయిడ్ పేషెంట్లకు వారి పరిస్థితి మెరుగయ్యేలా చేస్తుంది.
- డిప్రెషన్‌తో బాధపడేవారికి ఉపయోగపడుతుంది.
- ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారికి తులసి ఆకులు ఉపశమనాన్ని కలగజేస్తాయి.
- శరీరంలో మలినాలను తులసి ఆకుల రసం తొలగిస్తుంది.
- కాలేయం, కిడ్నీలు, క్లోమ గ్రంథి ఆరోగ్యాన్ని తులసి ఆకులు మెరుగుపరుస్తాయి.
తులసి ఆకులు, రసం ఎవరు తీసుకోకూడదు?
- షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్న వారు తులసి రసం తీసుకోకూడుదు.
- రక్తం పలుచన చేసేందుకు మెడిసిన్ తీసుకునే వారు
- పెయిన్ కిల్లర్స్ తీసుకునే వారు తులసి రసం తరచుగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది.
- తులసి ఆకుల్లో ఉండే మెర్క్యురీ మూలకం వల్ల పండ్లు దెబ్బతింటాయి. అందువల్ల వీటిని నమలడం వల్ల పండ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది.