Home హెల్త్ knee pain remedies: మోకాళ్ల నొప్పులకు ఏ మందులు వాడాలి

knee pain remedies: మోకాళ్ల నొప్పులకు ఏ మందులు వాడాలి

knee pain
knee pain: మోకాళ్ల నొప్పులకు మందులు పనిచేయవని చెబుతున్న వైద్య నిపుణులు Image: Unsplash

knee pain remedies: మోకాళ్ల నొప్పులకు ఏ మందులు వాడాలి అన్న ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమవుతుంది. ముందుగా మనకు మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఈ అంశంపై భక్తియార్ చౌదరి త్రీటీవి హెల్త్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వివరించారు.

‘మోకాళ్లలో గానీ, ఏ కీలులో గానీ రెండు ఎముకలు ఉంటాయి. రెండు ఎముకలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉంటాయి. దాని చుట్టూ ఒక కంపార్ట్‌మెంట్ ఉంటుంది. దానినే మనం సైనోవియల్ కంపార్ట్‌మెంట్ అంటాం. ఇదొక సీల్డ్ గదిలా ఉంటుంది. ఈ రెండు ఎముకల మధ్యలో చాలా ద్రవ పదార్థం ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటారు. దీనినే గ్రీజ్ అని, గుజ్జు అని పిలుస్తాం. ఈ బోన్స్ సరిగ్గా జాయింట్‌లో ఉండడానికి అనేక కండరాలు తోడ్పడుతాయి. ఆ కండరాల నుంచి వచ్చే టెండెన్స్ ఈ ఎముకలకు గట్టిగా అంటుకుని ఉంటుంది. అందుకే నడిచినా, పరుగెత్తినా అది ఊడిపోదు. అయితే వయసు పెరిగే కొద్దీ లేదా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల, మైక్రో న్యూట్రియెంట్స్ తగ్గినప్పుడు గానీ, కొన్ని తెలియని ఇతర కారణాల వల్ల గానీ మన కండరాల శక్తి తగ్గినప్పుడు ఈ బిగువు తగ్గిపోతుంది. కీలు బాగుండాలంటే కీలు చుట్టూ ఉండే కండరాలు సరిగ్గా ఉండాలి. అప్పుడే కీలులో స్పేస్ సరిగ్గా ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయడ్ సరిగ్గా ఉంటుంది..’ అని వివరించారు.

‘ముందుగా శబ్దం వచ్చినప్పుడు సమస్యను పసిగట్టవచ్చు. కొన్నిసార్లు ఇసుక ఉన్నప్పుడు వచ్చే శబ్దంలా కిర్రుమని చప్పుడు రావొచ్చు. లేదా నొప్పి రావొచ్చు. అంటే కండరాలు దృఢంగా లేవని అర్థం చేసుకోవాలి. సైనోవియల్ ఫ్యూయడ్ తగ్గితే జాయింట్ స్టిఫ్ అవుతుంది. నిజానికి ఈ ఫ్లూయడ్ తయారు చేసేందుకు ఔషధాలు ఉపయోగపడవు. మందులతో గుజ్జు తయారవుతుందనుకోవడం అపోహ మాత్రమే. కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు కూడా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. అంటే ఎక్కువగా ఎక్కడం, దిగడం వల్ల మోకాలి నొప్పులు తరచూ వస్తాయి.

మోకాళ్ల నొప్పులు మొదలైనప్పుడు మరి ఎలా స్పందించాలి. నొప్పి గానీ, శబ్దం గానీ వచ్చినప్పుడు నెమ్మదిగా కండరాలను పటిష్టం చేసే వ్యాయామాలు చేయాలి. అంతేగానీ అతిగా కష్టపెట్టే వ్యాయామాలు చేయకూడదు. స్టాటిక్ వ్యాయామాలు ఉండాలి. డైనమిక్ వ్యాయామాలు వద్దు. స్టాటిక్, ఐసోమెట్రిక్ వ్యాయామాల వల్ల జాయింట్‌లో స్పేస్ పెరుగుతుంది. తద్వారా అరుగుదల నుంచి తప్పించుకోవచ్చు. ఆర్థరైటిస్ ఉన్న వారిలో కూడా వ్యాయామాలు ఉపశమనం చూపుతాయి. నొప్పులు ఉన్న పనులు చేయకూడదు. మెట్లు నిదానంగా ఎక్కాలి. నిజానికి మెట్లెక్కడం వ్యాయామం కాదు. మోకాళ్లపై బరువు పడకుండా చూడాలి. సైక్లింగ్ గానీ, ఈత గానీ మంచిదే. భరించరాని నొప్పి ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. కానీ వ్యాయామాన్ని మాత్రం మరువ వద్దు’ అని డాక్టర్ భక్తియార్ చౌదరి వివరించారు.

Exit mobile version