ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 70 శాతం మేర తగ్గాయని 99acres పోర్టల్ విడుదల చేసిన హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ అప్‌డేట్ నివేదిక వెల్లడించింది. కూలీల లభ్యత లేకపోవడం, ఆర్థిక మాంద్యం, ఎంక్వైరీలు తగ్గడం నగరంలో ఇళ్ల కొనుగోలు ట్రెండ్స్‌ను మార్చేశాయి.
త్రైమాసిక లావాదేవీలు 70 శాతం క్షీణించాయని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ సమీక్ష కాలంలో కేవలం 750 యూనిట్లు అమ్ముడయ్యాయి. విచారణలు కూడా అంతకుముందుతో పోల్చితే 60 శాతం తక్కువగా ఉన్నాయి.
99acres సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ ఉపాధ్యాయ ఈ నివేదికపై మాట్లాడుతూ, ‘‘ఏప్రిల్–జూన్ 2020లో అనేక మంది డెవలపర్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి మారారు. వర్చువల్ ప్రాజెక్ట్ లాంచ్, ఇ–సైట్ సందర్శన ఏర్పాటు చేయడం ద్వారా కోవిడ్–19 ప్రేరిత సంక్షోభం నుంచి కొంత ఉపశమనం పొందారు. కొన్ని ఎదురుదెబ్బల తరువాత, జూన్ 2020 చివరి నాటికి 99 ఎకర్స్ ట్రాఫిక్, ప్రతిస్పందన తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి తిరిగి వచ్చాయి.
99acres సర్వేలో 75 శాతం రిజిస్టర్డ్ కొనుగోలుదారులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పోర్టల్స్ ద్వారా షార్ట్ లిస్ట్ లేదా ఆస్తిని కొనడానికి ఇష్టపడుతున్నారు. 60 శాతం మంది ప్రాజెక్ట్ సైట్‌ను భౌతికంగా సందర్శించే ముందు వర్చువల్ టూర్ చేపట్టడానికి ఇష్టపడతారని తెలిపారు..’ అని వివరించారు.
ఏప్రిల్‌లో మందగమనం తరువాత, హైదరాబాద్ నివాస మార్కెట్ క్యూ –1 తరువాతి నెలల్లో నెమ్మదిగా అభివృద్ధి చెందింది. ఐటీ కారిడార్ల సరిహద్దులో ఉన్న నార్సింగి, కోకాపేట, గచ్చిబౌలి, పటాన్‌చెరు, బాచుపల్లి వంటి ప్రాంతాలు ఎంక్వైరీ, లావాదేవీల్లో 70 శాతం వాటా కలిగి ఉన్నాయి.
రూ .50–70 లక్షల బడ్జెట్‌లో 3 బీహెచ్‌కే యూనిట్లు, రూ. 80 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ధరల్లో ఇండిపెండెంట్ హౌజెస్ కోసం కొనుగోలుదారులు చూస్తున్నారని నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం, నిజాంపేట వైపు ఇళ్ల కొనుగోలుదారులు చూస్తున్నారని నివేదిక విశ్లేషించింది.
కొన్ని ప్రాంతాల్లో రేట్ల వృద్ధి
అంతకుముందు క్వార్టర్‌తో పోల్చితే కొండపూర్ మరియు నాగోల్ ఏరియాల్లో మూలధన ధరలలో మూడు శాతం వృద్ధిని కనబరిచాయని, హైటెక్ సిటీకి సామీప్యత, మెట్రో లైన్ సామీప్యత సగటు ధరలను స్వల్పంగా పెంచిందని నివేదించింది.
తక్కువ ఖర్చుతో కూడిన యూనిట్ల లభ్యత, బ్లూ లైన్ ద్వారా మెట్రో కనెక్టివిటీ కారణంగా తూర్పులోని నాగోల్ ప్రజాదరణ పొందింది.
అమ్ముడుపోని యూనిట్లు 24 వేలు
జూన్ 2020 తో ముగిసిన త్రైమాసికం ముగింపులో హైదరాబాద్‌లో అమ్ముడుపోని జాబితా 24,000 యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను క్లియర్ చేయడానికి సుమారు 16 నెలలు పట్టవచ్చని నివేదించింది. గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడుపోని యూనిట్లు ఉన్నాయి.
హైదరాబాద్‌లో సగటు అద్దెలు స్వల్పంగా ఒక శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. హైటెక్ సిటీ, అత్తాపూర్, బంజారా హిల్స్ అద్దెలకు ప్రాచుర్యం పొందాయి. సగటు వార్షిక అద్దెలో 5–6 శాతం పెంపును నమోదు చేశాయి. అత్తాపూర్ గచ్చిబౌలికి సమీపంలో ఉన్నందున అద్దె రేట్లలో వృద్ధి ఉంది.
బంజారా హిల్స్ మరియు హైటెక్ సిటీ వాణిజ్య ప్రాముఖ్యత గల ప్రాంతాలు కావడం, ఐటి / ఐటిఇఎస్ సంస్థలు ఉండడం కారణంగా వాటి పాపులారిటీ కొనసాగింది.