కాకరకాయ చేదుగా ఉండడంతో చాలా మందికి నచ్చదు. పిల్లలకు అసలే నచ్చదు. కానీ కాకరకాయ ఫ్రై చేసి ట్రై చేస్తే.. ఇక ఎప్పటికీ నో అనే ఛాన్సే లేదు. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, బయోటిన్, జింక్, ఫైబర్, కాల్షియం, బీటా కెరోటిన్, ప్రొటీన్ వంటివన్నీ మెండుగా ఉండే కాకర ఆరోగ్య పోషకాల ఖనిగా చెప్పొచ్చు.
కాకరకాయ శరీరంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ వంటి పాలిపెప్టయిడ్ –పి అనే పదార్థం చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.
లివర్‌ను ఆరోగ్యవంతంగా మార్చుతుంది. మోమోర్డికా చరంతియా అనే పదార్థం లివర్‌కు రక్షణ కవచంగా నిలుస్తుంది.
అలర్జీలను తొలగిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే మీ స్కిన్ గ్లో అవ్వాలంటే కూడా కాకరకాయ తినాల్సిందే.
మరి ఇన్ని గుణాలున్న కాకరకాయను ఇష్టంగా తినాలంటే కాకరకాయ ఫ్రై చేయడమే. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కాకరకాయ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు
√ అర కిలో కాకరకాయలు
√ పల్లీలు (వేరుశనగ) 2 టేబుల్ స్పూన్
√ మినప్పప్పు 1 టేబుల్ స్పూన్
√ ఆవాలు అర టీ స్పూన్
√ జీలకర్ర 1 టీ స్పూన్
√ కరివేపాకు తగినంత
√ మిర్చి పొడి 1 టేబుల్ స్పూన్
√ పచ్చి మిర్చి తగినంత
√ పసుపు అర టీ స్పూన్
√ కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్
√ దనియాల పొడి 1 టీ స్పూన్
√ గరం మసాలా 1 టీ స్పూన్
√ వంట నూనె 3 టేబుల్ స్పూన్లు
√ ఉప్పు తగినంత (1 టీ స్పూన్‌కి కొద్దిగా తక్కువ)
తయారీ విధానం :
◊ కాకరకాయను గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
◊ స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి అనుగుణంగా ఉండే గిన్నెల్లో నూనె పోసి వేడెక్కేవరకు ఆగాలి.
◊ ఇప్పుడు కాకరకాయ ముక్కలు నూనెలో వేయాలి. 50 శాతం ఫ్రై అవగానే తీసి పక్కనపెట్టుకోవాలి.
◊ ఇప్పుడు ఒక పాన్ (కాకరకాయ ఫ్రై చేసేందుకు అనువుగా ఉండేది ఏదైనా సరే) తీసుకుని
అందులో నూనె వేసి తరువాత పోపు గింజలు వేయాలి.
◊ తదుపరి కరివేపాకు కూడా వేసుకోవాలి. కాస్త పచ్చి మిర్చి ముక్కలు వేసుకోవాలి.
◊ ఇవన్నీ కాస్త వేగిన తరువాత ఇప్పటికే 50 శాతం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ గిన్నెలో వేయాలి.
◊ మరికాస్త వేగిన తరువాత ఉప్పు, దనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా వేయాలి. చివరలో మిర్చి పొడి వేయాలి.
◊ 5 నుంచి 10 నిమిషాలు సిమ్‌లో ఫ్రై అయ్యాక దించేయాలి. అంతే కాకరకాయ ఫ్రై రెడీ.
రెసిపీ : కె.లావణ్య