Home ట్రావెల్ Ladakh Trip: లద్దాఖ్ బైక్ ట్రిప్ .. మేఘాలలో తేలిపోదామిలా..

Ladakh Trip: లద్దాఖ్ బైక్ ట్రిప్ .. మేఘాలలో తేలిపోదామిలా..

pangong lake
Image: Tilak

లద్దాఖ్ బైక్ ట్రిప్ రైడర్లకు ఒక డ్రీమ్. కేంద్ర పాలితప్రాంతంగా మారాక లద్దాఖ్‌ టూరిజం పుంజుకుంటోంది. లద్దాఖ్ టూర్ ఆలోచన వస్తే ముందు అక్కడికి ఎలా చేరుకోవాలి? వాతావరణం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటివన్నీ ఈ ట్రావెల్ స్టోరీలో మీకోసం..

లద్దాఖ్ రాజధాని లేహ్. లేహ్ ఒక మామూలు సిటీ. ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో గంటన్నరలో చేరుకోవచ్చు. కానీ బుల్లెట్‌ బండి తీసుకుని యుద్ధానికి బయలుదేరిన సైనికుల్లాగా వెళ్లడమే ఎక్కువ మందికి ఇష్టం. లేహ్ వెళ్లాలంటే.. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే రోడ్లు ఓపెన్ అయ్యి ఉంటాయి. మిగతా రోజుల్లో రోడ్లన్నీ మంచుతో కప్పేసి ఉంటాయి.

అందుకే జులై నెల రాగానే ఎక్కడెక్కడి నుంచో బైక్ రైడర్‌లు జట్లు జట్లుగా ఇక్కడికి చేరుకుంటారు. ఒక్కసారి బైక్‌ స్టార్ట్ అయితే.. ఆగేది ఉండదు. మనాలీ నుంచి లేహ్‌ 470 కిలోమీటర్ల దూరం.. మొత్తం బైక్‌పైనే ప్రయాణం! సాహసోపేతమైన ప్రయాణాలు ఇష్టపడేవారికి పెద్ద కష్టమేం కాదు.

ladakh bike trip
Image: Tilaka

మనాలి నుంచి లేహ్.. పేరుకే రహదారి. కానీ… దారి పొడవునా రాళ్లూ, రప్పలు! అవతల ఏముందో కనిపించని మలుపులు! ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు అంతు తెలియని లోయలు! చుట్టూ కళ్లు చెదిరే ప్రకృతి అందాలు! ప్రతీక్షణం పట్టు జారే ప్రమాదం! మలుపులు భయపెడుతున్నా.. చలిగాలి చంపేస్తున్నా… వెనక్కి మళ్లేది లేదు. లేహ్‌ చేరుకోవడమే లక్ష్యం. ఈ ఒక్క ట్రిప్‌తో జీవితకాలపు అనుభవం సొంతం.

ఢిల్లీ నుంచి బైక్ ప్రయాణం ఎందుకులే అనుకుంటే.. విమానంలో లేహ్ చేరుకుని అక్కడి నుంచి బైక్ అద్దెకు తీసుకోవచ్చు. రోజుకు రూ. 800 నుంచి రూ. 2 వేల వరకు టూ వీలర్లు అద్దెకు దొరుకుతాయి.

మనాలి నుంచి లేహ్ .. శ్రీనగర్ నుంచి లేహ్

లేహ్ వెళ్లాలంటే రెండు రోడ్డు మార్గాలున్నాయి. మనాలి నుంచి లేహ్ లేదా శ్రీనగర్ టు లేహ్. రెండిటిలో ఏ రూట్ ఎంచుకున్నా ముందుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి లేహ్ ఎలా వెళ్లాలనేది నిర్ణయించుకోవాలి.

మీరు అడ్వెంచర్‌‌ని ఇష్టపడే వాళ్లైతే.. రోడ్ ట్రిప్ బెస్ట్ ఆప్షన్. బయలుదేరే ముందు అక్కడి రోడ్డు కండీషన్స్‌ని బట్టి ఎన్ని రోజులు పడుతుందో కనుక్కొని స్టార్ట్ అవ్వాలి. బైక్‌ట్రిప్ అయితే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సొంత బైక్‌ లేదా అద్దె బైక్. లేహ్ వెళ్లడానికి అద్దె బైకులే మేలు. ఢిల్లీ, మనాలీ, శ్రీనగర్‌లో బోలెడన్ని ‘బైక్‌ రెంటల్స్‌’ ఉంటాయి. ఈ రోడ్డుపై వెళ్లడానికి మంచి ఆఫ్ రోడ్ బైక్ అయితే బాగుంటుంది.

అడ్వెంచరస్ రోహ్‌తంగ్‌పాస్

లేహ్ వెళ్లడానికి ఎక్కువమంది మనాలి రూట్ ఎంచుకుంటారు. మనాలి నుంచి లేహ్‌కు ‘రోహ్‌తాంగ్ పాస్’ గుండా వెళ్లాలి. లేదా అటల్ టన్నెల్ రూట్‌ను కూడా ఎంచుకోవచ్చు. మనాలి టు లేహ్ రూట్ లో కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కనిపిస్తాయి.

పారా గ్లైడింగ్, మౌంటెన్ క్లైంబింగ్ లాంటివి చేయొచ్చు. వీటికి టికెట్ వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకూ ఉంటుంది. అలా ముందుకెళ్తూ ఉంటే అసలైన రోడ్డు మొదలవుతుంది. దారి పొడవునా అందమైన లోయలు, మన మీద నుంచే వెళ్లే మేఘాలు, పూర్తిగా తిరిగే దాకా అటువైపు ఏముందో తెలియని ‘గుడ్డి’ మలుపులు.

rohtang pass
 Rohtang pass, Image Rishi kumar from pexels,

భయపెడుతూనే థ్రిల్ చేస్తాయి ఆ రోడ్లు. అవన్నీ దాటగానే సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉండే రోహ్‌తాంగ్ పాస్ వస్తుంది. ఈ పాస్ అత్యంత ఎత్తులో భారీ పర్వతాలతో తెల్లగా  మంచుతో మెరిసిపోతూ ఉంటుంది.

పాస్‌లు దాటుతూ..

పాస్ అంటే పర్వత శ్రేణిలో ఉండే గ్యాప్‌లను.. అంటే మార్గాలను పాస్ అంటారు. రోహ్‌తంగ్ దాటిన తర్వాత లేహ్ రూట్ మారిపోతుంది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లేకొద్దీ ‘సీన్‌’ మారిపోతూ ఉంటుంది. ముందుకు వెళ్లేకొద్దీ పచ్చదనం తరిగిపోతూ వస్తుంది.

దారిలో అక్కడక్కడా వాటర్ క్రాసింగ్స్ వస్తాయి. అంటే కొండ మీద నుంచి పడే నీళ్లు రోడ్డు మీదుగా లోయలోకి జారుతాయి. వాటర్ ఫ్లోని బట్టి జాగ్రత్తగా వెళ్లాలి. దారి పొడవునా పర్వతాలు, లోయలు, జలపాతాలు ఒక్కోచోట ఒక్కో విశేషంతో అలరిస్తుంటాయి. అలా బార్లాచా, లాచులుంగ్‌, తాంగ్లాంగ్‌… నాలుగు పాస్‌లు దాటుకుంటూ ముందుకెళ్లాలి.

అవి దాటగానే విశాలమైన గ్రౌండ్, దానిని ఆనుకుని పర్వతాలు, మధ్యలో మలుపుల్లేని తారు రోడ్డు వస్తుంది. అలా మనాలి నుంచి లేహ్ వరకు 470 కిలోమీటర్ల ప్రయాణానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది.

అందాల లేహ్ వచ్చేశాం..

ఇక్కడి వరకూ ప్రయాణం ఒక ఎత్తైతే ఇక లేహ్ టౌన్ మరో ఎత్తు. లేహ్‌ ఒక అందమైన నగరం. చుట్టూ హిమాలయాల మధ్యలో అందంగా పరుచుకున్న ఎడారి ప్రాంతమిది. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉండే ఈ టౌన్ ఏడాదంతా టూరిస్టులు, బైకర్లతో హడావిడిగా ఉంటుంది.

leh city

leh marketహిమాలయాల మధ్యలో ఉండే లద్ధాఖ్ రీజియన్‌కు లేహ్ ముఖ్య పట్టణం. ఇక్కడంతా టిబెటన్ కల్చర్ కనిపిస్తుంది. మిలిటరీ స్థావరాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం చైనా బోర్డర్‌కు అత్యంత దగ్గరగా ఉంటుంది. లద్ధాఖ్‌న్ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే ముందుగా లేహ్‌‌తో మొదలు పెట్టాలి.

leh market
leh market

లేహ్ టౌన్‌లో బడ్జెట్ ధరల్లో హోమ్ స్టేలు దొరుకుతాయి. హోటళ్లు, లాడ్జీ ధరలు ఎక్కువగా ఉంటాయి. హోమ్ స్టే అయితే కాస్త చవకగా ఉంటుంది. లేహ్‌లో టాక్సీ ధరలు కూడా చాలా ఎక్కువే. రోజుకు రూ. 8 వేల నుంచి రూ. 9 వేల వరకు వెచ్చించాల్సి రావొచ్చు. ఇక్కడ షాపింగ్ చేయడం కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. టిబెటన్ క్రాఫ్ట్స్, కాశ్మీరీ హస్తకళలు ఇలా ఎన్నో రకాల వెరైటీలు ఇక్కడ దొరుకుతాయి. తాజా ఆప్రికాట్ పండ్లను తప్పనిసరిగా తిని తీరాల్సిందే. ఆగస్టు మాసంలో రూ. 200 నుంచి రూ. 300 లకు కిలో చొప్పున లభిస్తాయి. ఇక ఇక్కడ డ్రై ఫ్రూట్స్‌కు కొదవేలేదు.

ప్యాంగాంగ్ లేక్ .. మధురానుభూతి

లేహ్‌కు దగ్గర్లో ఇంకా ఎన్నో హిమాలయాల అందాలు దాగి ఉన్నాయి. వాటిలో ఫస్ట్ అండ్ మోస్ట్ ప్యాంగాంగ్ లేక్. ఇది లేహ్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 4,350 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అత్యంత ఎత్తయిన ఉప్పు నీటి సరస్సు. పాంగాంగ్ అంటే ఎత్తయిన గడ్డి మైదానం అని టిబెట్ భాషలో అర్థం.

పాంగాంగ్ లేక్ దాదాపు 130 కి.మీ. పొడవు ఉంటుంది. మూడింట ఒక వంతు మన దేశంలో ఉంటే.. మిగిలిన రెండు వంతులు చైనా పరిధిలో ఉంటుంది. ఇక్కడికి లేహ్ నుంచి వెళ్లాలంటే టాక్సీ అయితే రూ. 9 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. ప్యాంగాంగ్‌ లేక్‌ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ లేక్‌లో నీరు సూర్యుడి వెలుగులో ఒక రంగు, మబ్బు పట్టినప్పుడు మరో రంగులో అలరిస్తుంది. నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోకి మారుతుంది. దీని అందం మాటల్లో వర్ణించలేం. చూసి తీరాల్సిందే.

pangong lake mountains
pangong lake

‘3 ఇడియట్స్‌’ సినిమా క్లైమాక్స్‌తీసింది ఇక్కడే! ఇక్కడి రాత్రులు మనకు అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ ను ఇస్తాయి. మనదేశంలో నక్షత్రాలను చూసేందుకు ఉన్న బెస్ట్ ఆప్షన్స్‌లో ప్యాంగాంగ్ కూడా ఒకటి. రాత్రి ఇసుక చల్లినట్టు ఆకాశమంతా చుక్కలతో నిండిపోతుంది.

ఖర్దూంగ్లా పాస్.. నుబ్రా వ్యాలీ..

లేహ్ టూర్ వెళ్తే తప్పకుండా వెళ్లాల్సిన మరో డెస్టినేషన్ ఖర్దూంగ్లా. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటర్ పాస్. అంటే ప్రపంచంలోనే మోటరు వెహికిల్‌పై ప్రయాణించగలిగే అత్యంత ఎత్తైన మార్గం అన్నమాట. ఇది 5300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బైకర్లు ఈ ప్రదేశానికి రైడ్ చేస్తుంటారు.

nubra valley
nubra valley

లేహ్‌కు దగ్గర్లో ఉండే నుబ్రా వ్యాలీ హిమాలయాల్లోని మరోక కోణాన్ని స్పృశిస్తుంది. ఇక్కడుండే తెల్లటి ఇసుక దిబ్బలు ఎడారిని మరిపిస్తాయి. హిమాలయాల్లోని మంచు కొండల మధ్యలో ఇలాంటి ఎడారి ప్రాంతం చాలా కొత్త ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది.

shanti stupa leh
shanti stupa leh

అందమైన త్సో‌మోరిరీ లేక్

రుప్షు లోయలో చాలా ఎత్తులో ఉన్న త్సోమోరిరి సరస్సు లేహ్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. లేహ్ – కరు (36 కిమీలు) – అప్షి (13 కిమీలు) – కుమ్‌డాక్ (19 కిమీలు) – కేరే (53 కిమీలు) – చుమతాంగ్ (34 కిమీలు) – మాహే (22 కిమీలు) – సుమ్డో (10 కిమీలు) – కోర్జోక్ లేదా త్సో మోరిరి (53 కిమీలు) మార్గంలో పయనించాలి. ఎత్తైన పర్వతాల చుట్టూ ఉన్న ఈ ప్రశాంతమైన సరస్సు సముద్ర మట్టానికి 4,000 మీటర్ల ఎత్తులో ఉంది.

త్సోమోరిరిలో వలస పక్షులు, మర్మోట్‌లు, అరుదుగా టిబెటన్ తోడేళ్లతో సహా అనేక వన్యప్రాణులు కనిపిస్తాయి. దేశంలోని అతి పెద్ద ఎత్తయిన సరస్సు. 7 కి.మీ. వెడల్పు, 19 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్‌కు చాలా దగ్గరగా ఉన్నందున ఇక్కడికి సందర్శించాలంటే ఇన్నర్ లైన్ పర్మిషన్ ఉండాలి. ఇక్కడ చలికాలంలో మనుగడ సాధించడం కష్టం.

లేహ్ చుట్టు పక్కల చూడాల్సినవి ఇంకా ఎన్నోఉన్నాయి. హాన్లె‌లోని ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ, మాగ్నెటిక్ హిల్, డిస్కిట్ మొనాస్ట్రీ, మార్ఖా వ్యాలీ, జన్స్‌కార్ వ్యాలీ, సింధూ నది జన్స్‌కార్ నది కలిసే చోటైన సంగం చాలా బాగుంటుంది. ఇక్కడ ర్యాఫ్టింగ్ చేయొచ్చు.

sangam
సింధూ నది (ఇండస్ రివర్), జన్‌స్కార్ నది కలిసే చోటు

అందమైన రాగి పాత్రలకు పెట్టింది పేరైన ప్రాచీన చిల్లింగ్ విలేజ్, అనేక చోట్ల దర్శనమిచ్చే బౌద్ధుల ప్రార్థనా స్థలాలు (monastery)..  ఇలా లద్ధాఖ్ రీజియన్‌లో ఎన్నో ప్లేసులు అడ్వెంచర్ ప్రియులను ఆకర్షిస్తాయి.

magnetic hill
సంగం వెళ్లే దారిలో మాగ్నటిక్ హిల్ వ్యూ ఇక్కడి నుంచి చూడొచ్చు..

ట్రావెల్ మ్యాప్..

మనాలి రూట్: ఢిల్లీ–  మనాలి– రోహ్‌తాంగ్ – సర్చూ–  తాంగ్లాంగ్ –  లేహ్

టెంట్‌ / క్యాంప్‌ పాయింట్లు: మార్హి, జిస్పా, దార్చా, జింగ్‌ జింగ్‌ బార్‌, భరత్పూర్‌, సార్చు, పాంగ్, ఉప్శీ.

శ్రీనగర్ రూట్ : ఢిల్లీ – శ్రీనగర్ – జోజి లా –  డ్రాస్ –  కార్గిల్ –  చిక్ తాన్ –  లమయూరు – నిమ్మూ –  లేహ్

టెంట్‌ / క్యాంప్‌పాయింట్లు: కంగన్, డ్రాస్, కార్గిల్, లమయూరు, బాస్గో ప్లేన్స్

home stay
home stay

వెళ్లగలిగే బైకులు:

200 సీసీ పైన సామర్థ్యం ఉన్న బైకులు మాత్రమే సులభంగా పాస్‌లన్నీ దాటగలవు. రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ డామినార్, పల్సర్ ఎన్‌ఎస్ 200, టీవీయస్ అపాచీ 200, పల్సర్ ఆర్‌‌ఎస్ 200, యమహా ఎఫ్ జీ 25 బైకులు బెస్ట్ ఆప్షన్స్.

పెట్రోలు బంకులు : తాండీ (మనాలి నుంచి 107 కి.మీ), కారు (లెహ్‌ నుంచి 36 కి.మీ), లేహ్ టౌన్.

ఏటీయంలు : మనాలీ టౌన్, కీలాంగ్ టౌన్, లేహ్ టౌన్

ట్రెక్కింగ్‌: చాదర్‌ట్రెక్‌ (శీతాకాలంలో మాత్రమే చేయొచ్చు), స్టొక్‌కాంగ్రీ, జన్స్‌కార్ నది, మోరిరీ సరస్సు, నుబ్రా లోయ, షామ్‌లోయ, సింధు లోయలోని ట్రెక్కింగ్‌జోన్లు.

ఈ ఏరియాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సిగ్నల్స్‌ మాత్రమే ఉంటాయి. అక్కడక్కడా ఎయిర్‌ టెల్‌, జియో సిగ్నల్స్ వస్తాయి. మీకు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఉంటేనే అక్కడ పనిచేస్తుంది.

ఉండాల్సిన ట్రావెల్ గేర్‌:

హెల్మెట్‌, రైడింగ్‌ జాకెట్‌, షూస్‌, మోకాలి గార్డ్స్, మోచేతుల గార్డ్స్‌, టెంట్స్, టార్చి లైట్, రోప్, నైఫ్, వాటర్ ప్రూఫ్ కవర్స్, ఐడీ ప్రూఫ్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, మౌంటెన్ సిక్‌నెస్ ట్యాబ్లెట్స్, వాటర్ బాటిల్స్, పవర్ బ్యాంక్స్, సన్ స్క్రీన్ లోషన్, అవసరమనుకుంటే కెమెరా.

లద్దాఖ్ టూర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ ఏరియాల్లో ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ వస్తుంది. అంటే.. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లేకొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుండడంతో బ్రీతింగ్ సమస్యలు ఎదురవుతుంటాయి. పైకి వెళ్లేకొద్దీ తల తిరిగినట్లు ఉండడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే దానికి తగ్గ మెడిసిన్స్ వెంట ఉంచుకుంటే మంచిది. ఎత్తయిన ప్రదేశానికి వెళ్లే ముందే ఈ మెడిసిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు.

apple trees
లద్దాఖ్‌లో అంతటా కనిపించే యాపిల్ చెట్లు

ఈ సమస్యలకు సహజ పరిష్కారం ఒక్కటే. ఎత్తుకు వెళ్లే కొద్దీ శరీరం ఆ ఎత్తుకు అలవాటు పడేలా విశ్రాంతి తీసుకోవాలి. ఉదాహరణకు 3,500 మీటర్ల ఎత్తుకు వెళ్లారనుకోండి.

అక్కడే ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. బైక్ మార్గంలో వెళితే ఈ స్థాయి వరకు శరీరం దానంతట అదే అలవాటు పడుతుంది.

విమాన మార్గంలో లేహ్ చేరుకున్నప్పుడు అక్కడ ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుని, అంతే ఎత్తు ఉన్న చుట్టు పక్కల ప్రాంతాలు చుట్టి రావొచ్చు.

లేహ్, లద్దాఖ్ ప్రాంతాన్ని వివిధ ఎత్తులకు తగినట్టుగా ప్రయాణం చేయాలంటే బైక్ రైడ్ సహా టూర్ మొత్తం కనీసం పది రోజులు పడుతుంది.

విమానంలో వెళ్లి అక్కడే బైక్ అద్దెకు తీసుకుంటే ఐదారు రోజుల్లో అక్కడ అన్నీ చూసేయొచ్చు. కేవలం ముఖ్యమైన ప్రదేశాలు చూడాలనుకుంటే నాలుగు రోజుల్లో ప్లాన్ చేసుకోవచ్చు.

జూన్ నుంచి సెప్టెంబరు వరకు డే టైమ్ లో పెద్దగా చలి ఉండదు. మామూలు దుస్తులు సరిపోతాయి. కానీ సాయంత్రం కాస్త చల్లగా ఉంటుంది. స్వెటర్ లేదా జర్కిన్ అవసరం. ఇక్కడ తరచుగా వర్షాలు వస్తాయి. కాబట్టి రెయిన్ కోట్ వెంబడి ఉంటే బాగుంటుంది. వాతావరణం నిత్యం మారుతుంటుంది.

అలాగే ఇక్కడ సూర్యుడు మన నెత్తిపైనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎండ చురుక్కుమనిపిస్తుంది. సన్ స్క్రీన్ లోషన్, గాగుల్స్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఏ ప్రాంతానికి ప్లాన్ చేసుకున్నా అక్కడి వాతావరణం, అక్కడ దొరికే వసతులను ముందు తెలుసుకోండి. వెంట తగినంత ఆహారం అంటే డ్రై ఫ్రూట్స్, బిస్కట్స్, వాటర్ అందుబాటులో ఉంచుకోండి. హాపీ జర్నీ..

– తిలక్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version