Home ట్రావెల్ వాలంటూరిజం : సేవ కోసం ఒక టూర్!

వాలంటూరిజం : సేవ కోసం ఒక టూర్!

voluntourism
Photo by Jed Villejo on Unsplash

వాలంటూరిజం .. ఎంజాయ్ చేయడం కోసం టూర్లు వేయడం అందరూ చేస్తూనే ఉంటారు. కానీ సేవ చేయడం కోసం కూడా టూర్లు వేస్తారన్న సంగతి తెలుసా? అవును ఇప్పుడు టూరిజంలో నడుస్తున్న ట్రెండ్ ఇదే..  నచ్చిన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లడమే కాకుండా అక్కడ ఇతర వ్యక్తుల కోసం సాయం చేయడం లేదా ఏదైనా సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు వాలంటూరిజంగా మారింది. వాలంటూరిజం అనే పదం వాలంటీర్, టూరిజం అనే పదాల కలయికతో ఏర్పడింది. దీన్నే వాలంటీర్ ట్రావెల్ లేదా వాలంటీర్ వెకేషన్ అని కూడా పిలుస్తారు.

వాలంటూరిజం అంటే మీ సమయాన్ని, నైపుణ్యాలను, శక్తిని స్వచ్ఛందంగా మరొకరికోసం అందించడం. మిమ్మల్ని మీరు కనుగొనటానికి ఉత్తమ మార్గం ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడమే అంటారు- గాంధీ. ఈ కాన్సెప్ట్ దీనికి సరిగ్గా సరిపోతుంది.

వాలంటూరిజంలో సేవతో పాటు పర్యాటకులు కొత్త ప్రదేశాలను కనుగొనటానికి, విదేశీ సంస్కృతిని, ఇతర దేశాల ప్రజల గురించి మరింత తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.

విహారానికి వెళ్లినప్పుడు అక్కడ ఎంజాయ్ చేస్తూనే ఎవరో ఒకరికి సేవ చేయడం ‘వాలంటూరిజం’ కాన్సెప్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే  పర్యటనల్లో సేవలు చేయడ౦ అన్నమాట.

ఈ ట్రెండ్ విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. పర్యటన కోసం మనదేశానికి వచ్చే విదేశీ టూరిస్టులు టూర్‌ఎంజాయ్ చేస్తూనే వాలంటీర్‌‌గా పనిచేస్తూ లోకల్ వాళ్లకి ఏదో ఒక హెల్ప్ చేస్తుంటారు. ఇక్కడి  పిల్లలకు ఇంగ్లీష్ క్లాసులు చెప్పడం, డ్యాన్స్ నేర్పించడం  లాంటివి.

సంస్థల సాయంతో..

వాలంటూర్లు వేయాలంటే కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు, స్వచ్చంద సంస్థలను సంప్రదించాలి. మనదేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వాలంటూర్లు నిర్వహిస్తున్నాయి. రెండు వారాల నుంచి రెండు నెలల వరకు మీరు కోరుకున్న నిడివితో కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. టీచింగ్, హ్యాండీ క్రాఫ్ట్‌ వర్క్‌షాప్‌లు, మెడికల్‌ క్యాంప్‌లు,  వ్యవసాయం, వన సంరక్షణ, జంతు సంరక్షణ ఇలా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాయి.

వినోదం కూడా..

ఈ టూర్స్‌లో వినోదానికేం లోటు లేదు. మాములు టూర్ కన్నా వాలంటూర్‌‌లో ఇంకా ఎక్కువ  ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి స్వచ్ఛంద సంస్థల్లో జాయిన్ అయితే వాళ్లు కొన్ని పనులు అప్పగిస్తారు. ఆ పనులు చేస్తూ పోవడమే పర్యాటకుల పని. మారుమూల పల్లెల్లో, అడవుల్లో ఏదో ఒక పని చేస్తూ గడపడం కొత్త అనుభూతినిస్తుంది. విదేశాల నుంచి వచ్చిన పర్యాటక సేవకులను కలుసుకునే అవకాశం దొరుకుతుంది. పర్యాటకులకు భోజనం, బస సంస్థ వాళ్లే చూసుకుంటారు. వీటికి గాను కొంత చెల్లించాల్సి వస్తుంది. సాధారణ పర్యటనకయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది తక్కువే.

జంతువులతో కూడా

రీసెంట్‌గా ‘వాలంటూరిజం విత్ యానిమల్స్’ అనే కాన్సెప్ట్ కూడా మొదలైంది. మీరు జంతు ప్రేమికులు అయితే  టూర్‌‌కి వెళ్లిన ప్రదేశాల్లో జంతువులకు సేవ చేయొచ్చు. వీటి కోసం ప్రత్యేకించి క్లినిక్స్ కూడా వెలిశాయి. మీకు ఏనుగులంటే ఇష్టమా? అయితే అస్సాంలో ఎలిఫాంట్ క్లినిక్‌కు వెళ్లి ఏనుగులకు సేవ చేయొచ్చు. సంరక్షకుల ఆధ్వర్యంలో మీరు కూడా ఏనుగులతో గడపొచ్చు.

మీకు సాహసాలు చేయడం ఇష్టమైతే.. చెన్నైలో మొసళ్ల పార్కు ఎంచుకోవచ్చు. మొసళ్ల ఎన్‌క్లోజర్స్‌శుభ్రం చేయడం, వాటికి ఆహారం అందజేయడం లాంటివి చేయాలి. ఇంకా ఇలాంటి క్లినిక్స్ చాలానే ఉన్నాయి.

పొలం పనులు చేస్తూ..

వూఫింగ్ ‘వర్కింగ్‌వీకెండ్స్‌ఆన్‌ఆర్గానిక్‌ఫార్మ్స్‌’ (వూఫ్‌) సంస్థ సరికొత్తగా వ్యవసాయ యాత్రలు ఏర్పాటు చేస్తోంది. వారాంతాల్లో పల్లెలకు వెళ్లి వ్యవసాయ పనులు చేసేయొచ్చు. విదేశీయులను కూడా  మనదేశంలోని పల్లెలను తిప్పి వాళ్లతో ఇక్కడి పొలం పనులు చేయిస్తారు. రక రకాల కల్చర్స్ తెలుసుకునేందుకు, వాటిలో పాలుపంచుకునేందుకు ఇదొక మంచి అవకాశం.

వాలంటూరిజం అందిస్తున్న కొన్ని సంస్థలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో ‘శ్రీవారి సేవ’  కూడా వాలంటూరిజం లాంటిదే.  దర్శనానికి వచ్చిన వాళ్లు దర్శనంతో పాటు శ్రీవారికి, అక్కడకు వచ్చిన భక్తులకు సేవ చేసుకోవచ్చు. శ్రీవారి సేవ, లడ్డూ ప్రసాద సేవ లాంటివి. సేవకు వచ్చిన వారికి భోజనం, బస ఉచితంగా కల్పిస్తారు.

జోధ్‌పూర్‌‌లోని మండోర్ గెస్ట్ హౌస్ వాలంటూరిజంకు మంచి అవకాశం. ఈ గెస్ట్ హౌస్ లోకల్ పిల్లలను అడాప్ట్ చేసుకుని వాళ్లని చదివిస్తుంటుంది. రాజస్థాన్ టూర్‌‌కి వచ్చే టూరిస్టులు ఇక్కడి పిల్లలకు గెస్ట్ లెక్చర్లు ఇవ్వొచ్చు. ఇక్కడకు చాలా మంది విదేశీయులు కూడా వచ్చి పిల్లలకు పాఠాలు చెప్తుంటారు.

‘17,000 ఫీట్‌ ఫౌండేషన్‌’ లదాఖ్ లోయల్లో నివసించే వాళ్లకు బోధన, మౌలిక వసతుల కల్పన కోసం పనిచేస్తుంది. దీనికోసం ఏటా వాలంటీర్లను పర్యటనకు ఆహ్వానిస్తుంటుంది. విహారానికి వెళ్లిన  వాళ్లు అక్కడ ఎంజాయ్ చేస్తూనే అక్కడివారికి తోచినంత సాయమూ చేయవచ్చు.

హిమాలయన్‌ ఎడ్యుకేషన్‌ లైఫ్‌లైన్‌ ప్రోగ్రాం (హెల్ప్‌) సంస్థ సిక్కిం, లదాఖ్‌తో పాటు పశ్చిమ బంగా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల, నేపాల్‌లోనూ సేవాయాత్రలు నిర్వహిస్తోంది.

మానసికంగా సిద్ధమవ్వాలి

వాలంటూర్ వేయాలనుకునే వాళ్లు సంబంధిత వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో మీకు ఏ నైపుణ్యం ఉంది. ఎలాంటి సేవ చేయగలరు అనే వివరాలు పోస్ట్ చేస్తే చాలు. మిగతా వివరాలు సంస్థలు చూసుకుంటాయి. ఇలాంటి టూర్‌‌ వేయాలంటే మానసికంగా సిద్ధంగా ఉండాలి. సేవ చేయడం ఇబ్బందిగా భావించకూడదు. అప్పుడే యాత్ర అద్భుతమైన అనుభూతి ఇస్తుంది.

– తిలక్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version