Home న్యూస్ మార్వా ఎల్సెలెదార్ .. ఈజిప్ట్ తొలి మహిళా కెప్టెన్ ఎందుకు టార్గెట్ అయ్యారు?

మార్వా ఎల్సెలెదార్ .. ఈజిప్ట్ తొలి మహిళా కెప్టెన్ ఎందుకు టార్గెట్ అయ్యారు?

marwa elselehdar captain
Image Credit: FB wall of Marwa elselehdar

మార్వా ఎల్సెలెదార్… పేరు చదవడానికే కష్టంగా ఉంది, మన దేశానికి చెందిన వ్యక్తి కాదని అర్థమైపోతోంది… మరెందుకు మనం ఈమె గురించి చదవాలి? చదవాల్సిందే… ఈజిప్టు దేశంలో ఓ నిశ్శబ్ధ విప్లవానికి ఈమె నాంది పలికింది. నరనరాల్లో మూఢనమ్మకాలు, పురుషాధిపత్యం నిండిపోయిన ఈజిప్టులాంటి దేశంలో… అడ్డుగోడలను బద్దలుకొట్టి సముద్రతలాలపై స్వేఛ్చాతరంగమై తిరుగుతున్న ధీర వనిత ఈమె.

సాగరం కేవలం మగమహారాజులు నడిపే ఓడలకే కాదు, మహిళా కెప్టెన్లకు కూడా దారిస్తాయని నిరూపించింది. ఈజిప్టులో  ఓ షిప్ కు కెప్టెన్ అయిన మొదటి మహిళ మార్వా. ఇప్పటికీ ఆ దేశంలో ఇది వింతైన విషయమే. అంతెందుకు ప్రపంచంలో ఈ రంగంలో పనిచేస్తున్న మహిళలు కేవలం రెండు శాతం మాత్రమే.

ఇంటికి దూరంగా నెలల పాటూ సముద్ర తలాలపైనే భారీ ఓడ బాధ్యతను తీసుకోవాలి. అందుకేనేమో ఎక్కువ మంది ఆడవారు ఈ రంగాన్ని ఇష్టపడరు అని అభిప్రాయపడుతుంది మార్వా. తాను మాత్రం అందుకు భిన్నం.

తన కలను నిజం చేసుకోవడానికి చిన్నప్పటి నుంచే కనిపించని పురుషాధిపత్య ప్రపంచంతో యుద్ధం చేసిందామె. చివరకి తానే గెలిచింది. ఆ గెలుపును భరించలేని కొందరు ఇప్పటికీ ఆమెపై అసత్యపు ప్రచారాలతో రాళ్లు రువ్వుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సూయజ్ కెనాల్ ‘ఎవర్ గివెన్’ నౌక ఇరుక్కుపోవడానికి ఆమె కారణమంటూ ఈజిప్టులో విషప్రచారం మొదలైంది.

మార్వా ఎల్సెలెదార్ కారణమా?

ఆ సంఘటన జరిగినప్పుడు మార్వా ఎల్సెలెదార్ కనీసం అక్కడి దరిదాపుల్లో కూడా లేదు. వందలాది కిలోమీటర్ల ఆవల ఉన్న సముద్రంలో విధి నిర్వహణలో ఉన్నారు. అలెగ్జాండ్రియాలో ఐడా 4 నౌకలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈజిప్ట్ సేఫ్టీ అథారిటీకి చెందిన ఆ నౌక ఎర్ర సముద్రంలో ఉన్న లైట్ హౌజ్‌కు సరుకు రవాణా చేసే నౌక అది.

అయినా ఇలాంటి అసత్యపు ప్రచారాలకు తాను భయపడనని, ఇలాంటివెన్నో ఎదుర్కొంటూనే పదేళ్లుగా ఇదే రంగంలో ఉన్నానని చెబుతోంది. ‘ఈజిప్టులో విజయవంతమైన మహిళా కెప్టెన్ ను నేను అందుకే నన్ను టార్గెట్ చేసి ఉండొచ్చు… ఆ వార్తలు నన్ను షాక్ కు గురిచేశాయి’ అంటోంది మార్వా.

అయినా ఆమె ప్రయాణంలో ఇది చిన్న అడ్డంకి మాత్రమే. ఒక షిప్ కెప్టెన్ గా అడ్డంకులు దాటుకుని వెళ్లడం ఆమెకు ఇప్పటికే అలవాటైంది. 

తైవాన్‌కు చెందిన ఎవర్ గివెన్ నౌక సూయజ్ కాలువలోని దక్షిణపు ఒడ్డు వైపు ఇసుకలో కాలువకు అడ్డంగా ఇరుక్కుపోవడంతో నౌకలన్నీ ఆగిపోయి వేల కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. వారం రోజులకు ఎవర్ గివెన్ నౌకను సూయజ్ కాలువకు అడ్డు లేకుండా చేశారు.

ఈ ఘటనపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. అయితే ఇందుకు కారణం మార్వానే అంటూ ఆమెను వివాదంలోకి లాగడానికి ప్రయత్నం చేయడంతో వెలుగులోకి వచ్చిన ఆమె ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

ప్రతి మహిళా విజయంలో ఆమె కుటుంబంలో ఎవరో ఒకరి సాయం అత్యవసరం. అలాగే ఆమె కలను సాకారం చేసుకోవడానికి మార్వాకు అండగా నిలిచింది ఆమె అన్న, తల్లి మాత్రమే. ఈజిప్టులోనే పుట్టి పెరిగినా, అక్కడి పాత వాసనలు ఒంటపట్టించుకోలేదు వాళ్లు. కానీ తండ్రి మాత్రం వ్యతిరేకం. అలాగని ఆమె ప్రయాణానికి అతను అడ్డు తగలలేదు.

marwa elselehdar on ship చిన్నప్పట్నించి అన్నతో పాటూ ఈత తరగతులుకు వెళ్లేది మార్వా. అలా ఆమెకు సముద్రంపై ఇష్టం పెరిగింది. అదే ఓడలో పనిచేయాలన్న ఆమె కోరికకు బీజం పడేలా చేసింది. పెద్దయ్యాక అమ్మాయిలందరూ సాధారణ డిగ్రీలు చేస్తుంటే ఆమె మాత్రం ‘మెరైన్ నేవిగేషన్’ చదవాలని నిర్ణయించుకుంది.

ఆ డిపార్ట్ మెంట్ కు అప్లికేషన్ పెట్టింంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కొన్ని వేల అప్లికేషన్లలో ఆమె ఒక్కతే మహిళ. ‘స్త్రీలు ఆ డిపార్ట్మెంట్లో పనిచేయకూడదన్న నిబంధన ఏదీ లేదు. అయినా ఎవరూ అడుగుపెట్టరు. అందరూ అక్కడ మగవాళ్లే కనిపిస్తారు.

‘అయినా నేను వాళ్లతో కలిసి పనిచేయడానికి భయపడలేదు’ అని ఓసారి టీవీ ఇంటర్య్వూలో చెప్పింది. మూడేళ్ల పాటూ శిక్షణ తీసుకుంది. పన్నెండు వందల మంది విద్యార్థులలో ఈమె ఒక్కతే మహిళ. అయినా వెరవలేదు. అక్కడా వివక్షకూ గురైన వెనకడుగు వేయలేదు.

విమర్శించిన వారినే తన మంచితనం, చొరవతో మిత్రులను చేసుకుంది. చదువు పూర్తయ్యాక ‘ఐడా 4’ అనే షిప్ లో సెకండ్ నావల్ ఆఫీసర్ గా చేరింది. అప్పుడామె వయసు కేవలం పంతొమ్మిదేళ్లు. అమ్మాయిలకు ఇలాంటి చదువులు, ఉద్యోగాలెందుకు? అన్న మాటలు పదహారేళ్ల వయసు నుంచే వింటూ  వచ్చింది. అవేవీ ఆమె పట్టించుకోలేదు.

మార్వాకు కెప్టెన్‌గా ప్రమోషన్

తల్లి, అన్న ఇచ్చిన ప్రోత్సాహంతో మార్వా ఎల్సెలెదార్ ముందడుగు వేసింది. తండ్రి మాత్రం సగటు ఈజిప్టువాసిలాగే ఆలోచించాడు. కానీ ఇప్పుడు ఆమె విజయాన్ని చూశాక మాత్రం ఆనందించాడు. కొన్నేళ్ల క్రితం మార్వా కెప్టెన్ గా ప్రమోషన్ పొందింది. ఈజిప్టులో ఒక షిప్ కు కెప్టెన్ అయినా మొదటి మహిళగా చరిత్ర తిరగరాసింది.

marwa elselehdar
Image Credit: Marwa FB

 మార్వా ఇచ్చిన స్పూర్తితో ఈజిప్టు అమ్మాయిలు ఓడలలో పనిచేసేందుకు కూడా అడుగులు వేస్తున్నారు.

మార్వా ప్రస్తుతం కోరుకుంటున్నది తనను, తన ఉద్యోగాన్ని అర్థం చేసుకుని ప్రోత్సహించే మంచి భర్తను. సముద్రంపై తాను నెలల పాటూ ఉండిపోయినా పుట్టే పిల్లలనూ, కుటుంబాన్ని సమన్వయం చేసుకునే మంచి అబ్బాయి కావాలని కోరుకుంటోంది.

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
 

ఇవి కూడా చదవండి:
 
ఎలన్ మస్క్ .. ఓటమే అతడి ఆయుధం

Exit mobile version