Latest

డిలేచిన కెరటం అనడం ఎలన్ మస్క్ కు సరి పోలిక కాదేమో… అందుకే పడుతూ లేస్తున్న కెరటం అని పిలవచ్చు అతడిని. ఎందుకంటే… అతడు జీవితమంతా  వైఫల్యాల వెక్కిరింతతో కింద పడుతూ, అలుపెరగక చేసే ప్రయత్నాల విజయంతో లేస్తూనే ఉన్నాడు. ఎలన్ మస్క్ జీవితాన్ని  చెప్పాలంటే  ఒక పుస్తకమే అవుతుంది. ఇప్పుడు ఆయన ప్రపంచ కుబేరుడు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను దాటి ముందుకెళ్లాడు.

గతేడాది ధనవంతుల జాబితాలో 35వ స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ కేవలం ఏడాదిలో మొదటిస్థానానికి చేరాడు. బ్లూమ్ బర్గ్  ఇండెక్స్ ప్రకారం మస్క్ ఆస్తి విలువ 188.5 బిలియన్ డాలర్లు. టెస్లా షేర్ల ధరలు పెరగడంతో మస్క్ ఆస్తి విలువ అమాంతం పెరిగింది. అందుకే ఆయనే ఇప్పుడు ప్రపంచంలోనే ధనవంతుడు. ప్రస్తుతం ఆయన వయసు నలభైతొమ్మిదేళ్లు. ఆయన విజయ దాహం ఇప్పుడు కాదు పన్నేండేళ్ల వయసు నుంచే మొదలైంది. ప్రతి విజయానికి ముందు ఆయనకు వైఫల్యమే ఎదురొచ్చేది. ఆ ఓటమనే విజయానికి మొదటి మెట్టుగా మార్చుకుని నేడు ప్రపంచకుబేరుడిగా ఎదిగాడు.

అమెరికాలో కూర్చుని ప్రపంచాన్నే అబ్బురపరిచే  ప్రయోగాలు చేస్తున్న మస్క్ పుట్టింది మాత్రం దక్షిణాఫ్రికాలో. తండ్రి ఇంజినీర్, తల్లి మోడల్. ఆ ఇద్దరికీ నిమిషం పడేది కాదు. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. మస్క్ తండ్రి దగ్గరే ఉన్నాడు. ఎందుకో తెలియదు కానీ, అదే తాను చేసిన మొదటి తప్పు అని ఓసారి ప్రకటించాడు మస్క్. పెద్దయ్యాక తల్లికి దగ్గరై తండ్రిని వదిలిపెట్టాడు.

పన్నేండేళ్ల వయసులోనే ఓ వీడియో గేమ్ ను తయారుచేసి అమ్మాడు. అదే అతడి తొలి విజయం. అప్పట్నించి ఆలోచనలన్నీ ఆవిష్కరణలపైనే ఉండేవి. కానీ కాలం కలిసిరాలేదు. దక్షిణాఫ్రికా సైన్యంలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇష్టం లేక తల్లి దేశమైన కెనడాకు వచ్చాడు. కెనడాలోనే మస్క్ తల్లి మోడల్ గా పనిచేసేది. అక్కడ్నించి పై చదువుల కోసం అమెరికా చేరాడు.

పీహెచ్ డీ పూర్తి చేయకుండా యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చాడు.  సోదరుడితో కలిసి చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాడు. అలా ఓ బ్యాంకింగ్ సర్వీస్ సంస్థని ప్రారంభించి దాన్ని పేపాల్ కు అమ్మేసి తానే సీఈవో అయ్యాడు.

అంగారకుడిపై అడుగు  పెట్టాలని…

చాలా ఏళ్ల నుంచి అంగారక గ్రహంపై మనుషులు జీవించేలా చేయాలన్నది మస్క్ కల. అందుకోసం 2001లోనే ‘మార్స్ ఓయాసిస్’ అనే ప్రాజెక్టును ప్రారంభించాడు. ఆ ప్రాజెక్టు కోసం రాకెట్లు కొనేందుకు రష్యా వెళ్లి అవమానాలకు గురయ్యాడు. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే రాకెట్లు తయారుచేయవచ్చని అర్థమై 2002లో ‘స్పేస్ ఎక్స్’ సంస్థను స్థాపించాడు.

spacex satellite
Image by SpaceX-Imagery from Pixabay

ఇక్కడ కూడా వైఫల్యాలే స్వాగతం పలికాయి. రాకెట్ తయారు చేస్తావా? అంటూ బిగ్గరగా నవ్విన వాళ్లూ ఉన్నారు. నిధులిచ్చేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు. అయినా ప్రయత్నం మానలేదు. ఆరేళ్ల పాటూ ఒక్క పురోగతి లేదు. నవ్వే నోళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2008లో మొదటి విజయం నమోదైంది.

స్పేస్ ఎక్స్ తయారుచేసిన ఫాల్కన్ 1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నవ్విన నోళ్లు మూతబడ్డాయి. నాసా అండగా నిలిచింది. మరిన్ని ప్రయోగాలకు నిధులిచ్చింది.  స్పేస్ ఎక్స్ ఇప్పుడు అతిపెద్ద రాకెట్ల తయారీ సంస్థగా దూసుకుపోతుంది.

స్సేస్ ఎక్స్ సంస్థ స్టార్ లింక్ ప్రాజెక్టును మొదలుపెట్టింది. శాటిలైట్ ఆధారిత బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ ను ప్రపంచానికి అందిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఇప్పటికే బీటా సేవలు అందిస్తోంది. భారత దేశంలోనూ ప్రీబుకింగ్ ప్రారంభించింది. ఇంటర్ నెట్ సేవలు అందని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. దశాబ్దకాలంలో 12 వేల శాటిలైట్లను నింగిలోకి పంపనుంది.

ఎలక్ట్రిక్ కారు… టెస్లా

విద్యుత్ తో నడిచే కారును తయారు చేయాలనుకున్నాడు మస్క్. 2003లో ‘టెస్లా’ సంస్థను  ప్రారంభించాడు. అక్కడ కూడా ఓటములు, ఆర్థికపరమైన కష్టాలు ఎదురయ్యాయి. కంపెనీ పెట్టి అయిదేళ్లయినా ఒక్క కారును డెలివరీ చేయలేకపోయారు. సంస్థ మూతబడే స్థాయికి చేరుకుంది. అయినా మస్క్ ప్రయత్నం ఆపలేదు.

తన ఆస్తినంతా ఖర్చుపెట్టి టెస్లాను బతికించాడు. చివరికి 2008లో తొలి విద్యుత్ కారు ‘రోడ్ స్టర్’ మొదటి డెలివరీకి నోచుకుంది. దాన్ని మొదట కొనుక్కుంది కూడా మస్క్ నే. 2009 జూన్ నుంచి 500 కార్లకు ఆర్డర్ వచ్చాయి. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు టెస్లాకు.

tesla electric car
Image by Blomst from Pixabay

ఆవిష్కరణల దాహం ఇంకా తీరలేదు మస్క్ కి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదకి మళ్లింది అతని మనసు. బ్రెయిన్ లో చిప్ అమర్చి కృత్రిమ మేధస్సు ద్వారా మనిషి శరీరంలోని కొన్ని రుగ్మతలకు చికిత్స చేయాలన్నది అతని ఆలోచన. అందులో భాగంగా ఇప్పటికే పంది మెదడులో చిప్ ని అమర్చాడు. ఆ పరిశోధనలు ఇంకా మొగ్గ దశలోనే ఉన్నాయి.

సొరంగంలాంటి పైపుల్లో రవాణా వ్యవస్థను రూపొందించే ‘హైపర్ లూప్’ ప్రాజెక్టును కూడా ప్రారంభించాడు మస్క్. ఇది విజయవంతమైతే కేవలం గంటలోనే 900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించవచ్చు. ఇంతేకాదు మానవాళి భవిష్యత్తును నిర్ధేశించే అనేక ప్రాజెక్టులపై మస్క్ పనిచేస్తున్నాడు.

ఎలన్ మస్క్… శాస్త్రవేత్తా లేక వ్యాపారవేత్త?

నిజం చెప్పాలంటే మస్క్ రెండూను. అలాగని పరిపూర్ణమైన శాస్త్రవేత్త అని చెప్పలేం, పరిపూర్ణమైన వ్యాపారవేత్త అని చెప్పలేం. రెండ కలగలిసిన కొత్త జాతి  మస్క్ ది. వ్యాపారవేత్తలు గీసుకున్న సరిహద్దులు దాటి ఆవిష్కరణలకర్తగా ఆవిర్భవిస్తున్న స్వాప్నికుడు. తన స్వప్నాలను నిజం చేసుకోవాలని పరితపించే శ్రామికుడు.

భవిష్యత్తులో చాలా ఉద్యోగాలను కృత్రిమ మేథస్సు నడుపుతుందని నమ్మే వ్యక్తి. ఆ దిశగా ఇప్పట్నించే ప్రయోగాలు చేస్తున్న వైజ్ఞానికుడు.

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version