Home హెల్త్ Anemia symptoms: రక్తహీనత (ఎనీమియా) లక్షణాలు.. తగ్గాలంటే ఏం చేయాలి?

Anemia symptoms: రక్తహీనత (ఎనీమియా) లక్షణాలు.. తగ్గాలంటే ఏం చేయాలి?

food for anemia

Anemia symptoms: రక్తహీనత (ఎనీమియా) అంటే మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం, హీమోగ్లోబిన్‌ తక్కువ శాతంలో ఉండడమే రక్త హీనత. ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రధాన ప్రొటీన్‌ హిమోగ్లోబిన్‌. మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలు మోసుకెళ్లి అందించేంది ఇదే. రక్త హీనత గురించి కాస్త అవగాహన కలిగి ఉంటే దీని బారిన పడకుండా నివారించవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం దేశ జనాభాలో 55 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 22 రాష్ట్రాలు, పలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సగం కంటే ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గర్భిణులు ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్ల వినియోగం పెరిగినప్పటికీ, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4తో పోల్చితే గర్భిణుల్లో ఎనీమియా సగం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెరిగిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో రక్త హీనత ఎందుకు వస్తుంది? రక్త హీనత లక్షణాలు ఎంటి? ఎనీమియాను అధిగమించడానికి పరిష్కారాలు తెలుసుకుందాం.

What is Anemia: రక్త హీనత అంటే ఏంటి?

మన శరీరంలోని పెద్ద ఎముకల్లో హీమోగ్లోబిన్‌ తయారవుతుంది. హీమోగ్లోబిన్‌ తయారయ్యే చోటును మూలుగ లేదా బోన్‌మారో అంటాం. ఈ హీమోగ్లోబిన్‌ అనే ప్రొటీన్‌ తక్కువగా తయారవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.

శరీరంలో ఇనుప ధాతువు (ఐరన్‌) తక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్‌ తగినంత ఉత్పత్తి కాదు. హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉంటే శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు తగినంత ఆక్సిజన్‌ అందదు. ఆక్సిజన్‌ సరఫరా కాకపోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

చిన్న పాటి హీమోగ్లోబిన్ రక్త పరీక్షతో మనం ఎనీమియా బారిన పడ్డామో లేదో తెలుసుకోవచ్చు. పురుషులైతే హీమోగ్లోబిన్ 13.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ నుంచి 17.5 మధ్య ఉండాలి. మహిళలైతే 12 గ్రామ్స్ పర్ డెసిలీటర్ నుంచి 15.5 మధ్య ఉండాలి.

ఎనీమియా లక్షణాలు ఏంటి?

అలసిపోవడం: ప్రధానంగా కనిపించే సమస్య. చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోవడం, మానసికంగా అలసిపోవడం, చిరాకుగా ఉండడం

కళ్లు తిరగడం: బలహీనంగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించటం

తలనొప్పి: తరుచుగా తలనొప్పి వస్తుండటం, నిద్ర పట్టకపోవటం.

ఆయాసం: నడుస్తుంటే, మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావడం

గుండె జబ్బులు: రక్తహీనత ఉన్న వారు గుండె సంబంధింత వాధ్యులతో బాధపడుతుంటారు.

శ్వాసకోశ సంబంధిత వ్యాధులు: రక్తహీనత ఉన్న వారికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. చాతీలో నొప్పి రావొచ్చు.

ఇతర లక్షణాలు : చర్మం పాలిపోవటం, నాలుక పాలిపోయి ఉండడం, కనురెప్పల క్రింద భాగం తెల్లగా ఉండటం, అరిచేతులు, అరికాళ్లు, గోళ్లు పాలిపోయినట్లు, పసుపు పచ్చగా ఉండటం, ఆసక్తి లేకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలాంటి లక్షణాలేవి కనిపించినా హిమోగ్లోబిన్‌ పరీక్ష చేయించుకోవడం మేలు. రక్తహీనత నుంచి బయట పడాలంటే ఆహార నియమాలు పాటించాలి. ఏం తింటాంలే అని నిర్లక్ష్యం చేసే మహిళలు చాలా మంది ఉన్నారు. దాని ఫలితమే రక్తహీనత.

Causes of anemia: రక్త హీనతకు ఏయే కారణాలు దారితీస్తాయి ?

దేహంలో తగినంత ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్స్‌ లేకపోవ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఐరన్, ఎ, బి 12, బి 3, బి 6, సి, డి, ఇ లతో పాటు రాగి, జింక్‌ లోపాలు రక్తహీనతకు ప్రధాన కారణాలు. తీసుకున్న ఆహారంలో పోషక విలువలు ఉండకపోవడం, రుతుస్రావం, మలంలో రక్తం పడటం, ఏ ఇతర కారణాల వల్ల రక్తస్రావం అవడం వల్ల రక్తహీనత వచ్చే అవకాశాలు ఉంటాయి.

మలేరియా జ్వరం బారిన పడిన వారిలో ఎర్రరక్త కణాల సంఖ్య తక్కువ స్థాయికి పడిపోతుంది. ఆ తర్వాత అవి తిరిగి పెరగకపోవటం, దాంతో ఎర్రరక్త కణాల సంఖ్య తగినంత ఉండకపోవడం వల్ల రక్తహీనతకు దారితీస్తుంది. కడుపులో నులి పురుగులు ఉన్నా కూడా రక్తహీతకు దారితీస్తుంది.

కొన్ని రకాలు నులిపురుగులు కడుపులో రక్తాన్ని పీల్చేస్తాయి. దీని వల్ల కూడా రక్త హీనత ఏర్పడుతుంది.

కొన్ని దీర్ఘకాల వ్యాధులు కూడా హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిని తగ్గిస్తాయి. కిడ్నీ వ్యాధులు, టీబీ, సికల్‌సెల్‌ ఎనీమియా లేదా తలసెమియా, ఆర్థరైటిస్, క్యాన్సర్‌ వంటి వ్యాధుల వల్ల హీమోగ్లోబిన్‌ తగ్గిపోతుంది.

రక్తహీనత ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది?

అప్పుడే పుట్టిన శిశువుకు ఆరు నెలల వరకు తల్లి ద్వారా ఐరన్‌ అందుతుంది. ఆరో నెల నుంచి ఘన పదార్థాల రూపంలో అనుబంధ ఆహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అందకపోతే ఐరన్‌ లోపిస్తుంది. అలాగే తరచుగా విరేచనాల బారిన పడినప్పుడు సరైన చికిత్స అందిస్తే రక్త హీనత దరి చేరకుండా చూడొచ్చు.

పిల్లల్లో రక్తహీనత ఏర్పడితే వారిలో ఎదుగుదల లోపిస్తుంది. ఐరన్‌ లోపం ఉంటే నేర్చుకునే వేగం తగ్గుతుంది.

ఐరన్‌ లోపాన్ని భర్తీ చేయనిపక్షంలో కౌమార దశలో ఆడపిల్లలు మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. సుమారుగా 13 ఏళ్ల వయస్సులో రుతుచక్రం ప్రారంభమైతే రక్తాన్ని కోల్పోతుంటారు.

15 – 45 మధ్య వయస్సు ఉన్న స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది. మరి ముఖ్యంగా గర్భణీలు, బాలింతలలో ఈ సమస్య తీవ్రత అధికంగా కనిపిస్తుంది.


ఇది కూడా చదవండి: మహిళలు చేయించుకోవాల్సిన రక్త పరీక్షలు


ఐరన్‌ జీర్ణం కాకుండా చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రక్త హీనత ఏర్పడుతుంది. ఉదాహరణకు టీ, కాఫీ, కాల్షియం .. మన శరీరంలో ఐరన్‌ జీర్ణం కానివ్వవు.

Anemia problems: ఎనీమియాతో ఎలాంటి సమస్యలు వస్తాయి..

రక్తహీనతతో ఆక్సిజన్‌ అన్ని శరీర భాగాలకు అందదని చెప్పుకున్నాం కదా.. దీంతో నిస్సత్తువ, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, తలనొప్పి, ఆయాసం, ఊపిరి తీసుకోవటానికి కష్టపడటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్ని సార్లు ఆక్సిజన్‌ అందక గుండె తీవ్ర ఒత్తిడికి గురవుతుంది.

రక్తహీనతతో గర్భిణులు, బాలింతలకు ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవటం సంభవిస్తుంది. ప్రసూతి మరణాల సంఖ్య సాధారణ మహిళలతో పోలిస్తే రక్తహీనతతో బాధపడుతున్న మహిళలో ఎక్కువగా ఉంది.

రక్తహీనత ప్రభావం పుట్టబోయే బిడ్డ పైన పడుతుంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే రక్తహీనత బారిన పడకుండా సరైన ఆహారం తీసుకోమని… దాంతో పాటు గర్భిణీ స్త్రీలకు ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను వేసుకోమని డాక్టర్లు సూచిస్తుంటారు. ఎనీమియాను గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం.

Anemia solutions: రక్తహీనతకు పరిష్కారాలు?

రక్తహీనతకు పరిష్కారమే లేదా..? అంటే ఉందనే చెప్పాలి. అదేంటంటే రక్తహీనతకు మంచి పౌష్ఠిక ఆహారాన్ని తీసుకోవడం. ఎనీమియాతో బాధ పడుతున్న వారికి డాక్టర్లు ఐరన్‌ టాబ్లెట్లు వేసుకుంటే రక్తహీనత తగ్గుతుందని సలహా ఇస్తుంటారు. అయితే దీనికి మందులకన్నా.. ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో ఐరన్‌ అధికంగా లభించే వాటిని తీసుకోవాలి.

ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా వరకూ విటమిన్‌ బి 12 లోపం, ఐరన్‌ లోపం, విటమిన్‌ డి లోపం వల్ల ఎనీమియా వస్తుంది. అందువల్ల మనం తినే ఆహారంలో ఐరన్, విటమిన్‌ బి 12 ఎక్కువగా ఉంటే రక్తహీనత బారి నుండి తప్పించుకోవచ్చు. తగినంత సూర్యరశ్మి సోకడం వల్ల విటమిన్‌ డి లోపం తగ్గుతుంది.

Food for anemia: రక్తహీనతకు ఆహారం

తాజా ఆకుకూరలు: అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్‌ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే చిక్కుళ్లు వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వేరుశనగ పప్పులు కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

మాంసాహారం : మాంసాహారులైతే మేక మాంసం, కోడి మాంసం, చేపలు తినాలి. ఆర్గాన్‌ మీట్స్, లివర్‌లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్‌ బి 12, జింక్, ఫాస్పరస్‌ అధికంగా ఉంటుంది. వీటిని మైక్రోవేవ్‌లో బేక్‌ చేసి తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఐరన్‌ లెవల్స్‌ని పెంచుతుంది. మాంసాహారం అలవాటు ఉన్నవారు బోన్‌ సూప్‌ తాగటం లాంటివి చేస్తుండాలి. దీని వల్ల ఎనీమియా తగ్గించే అవకాశం ఉంటుంది. 

Fruits for anemia: రక్త హీనతను తగ్గించేందుకు దోహదపడే పండ్లు

ఆపిల్స్‌

ఆపిల్స్‌లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్స్‌తో పాటు మినరల్స్‌ కూడా అధికమే. రోజుకు ఒక ఆపిల్‌ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆలాగే ఆపిల్స్‌లో ఉండే ఐరన్‌ హీమోగ్లోబిన్‌ లెవల్స్‌ను పెంచటంలో తోడ్పుడుతుంది. దాంతో ఎనీమియాను ఆరికట్టవచ్చు.

దానిమ్మ

దానిమ్మలో ఐరన్‌ మరియు కాల్షియం అధికంగా ఉంటాయి. ఇందులో ఇతర మినరల్స్, విటమిన్స్‌ కూడా పుష్కంగా ఉండి ఫిట్‌గా ఉండాటానికి తోడ్పడుతుంది. ఇది బ్లడ్‌ సర్క్యూలేష్‌న్, హీమోగ్లోబిన్‌ లెవెల్స్‌ను పెంచుతుంది. ఎనీమియా లక్షణాలను నివారిస్తుంది.

ద్రాక్ష

ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పోటాషియం, ఇతర న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ద్రాక్షను తరచుగా తీసుకోవడం వల్ల ఎనీమియా లక్షణాలను నివారించవచ్చు. ఇవి రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యం కూడా.

అరటిపండ్లు

అరటిపండ్లలో ఐరన్, పొటాషియం, మరియు ఇతర విటమిన్స్, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. రోజూ అరటిపండ్లు తినడం వల్ల ఎనీమియా నివారించడం మాత్రమే కాదు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

సిట్రస్‌ ఫ్రూట్స్‌

సిట్రస్‌ పండ్లు ఆరెంజ్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, టమోటో వంటి వాటిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం ఐరన్‌ని గ్రహించటానికి సహాయం చేస్తుంది. ఇది ఎనీమియాతో పోరాడుతుంది. ఎనీమియా లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

టమోటోలు

టమోటోలలో విటమిన్‌ సి మరియు లైకోపిన్‌ అధికంగా ఉంటుంది. రక్తంలో ఐరన్‌ గ్రహించడానికి విటమిన్‌ సి గ్రేట్‌గా సహాయపడుతుంది.

ఉసిరి

విటమిన్‌ సి అధికంగా ఉండే ఉసిరికాయలు పచ్చిగానే తినటం అలవాటు చేసుకోవాలి. లేదంటే కొన్ని ఉసిరికాయలను తేనెలో నానబెట్టి ఉంచి రోజు రెండు ఉసిరికాయలను తీసుకోవటం చాలా మంచిది. ఉసిరికాయ చూర్ణంలో తేనె కలిపి తీసుకున్నా పర్వాలేదు.

ఇది రక్తవృద్ధికి కృషి చేస్తుంది. ఉదయాన్నే పరిగడుపున ఉసిరికాయ జ్యూస్‌ తీసుకుంటే మనలోని టాక్సిన్స్‌ అన్నీ వెళ్లిపోతాయి. అంతేకాకుండా ఎనీమియా తగ్గటానికి దోహదం చేస్తుంది.

బీట్‌రూట్‌

బీట్‌రూట్‌ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్, ప్రోటీన్‌లు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్‌–ఎ అధికంగా ఉంటుంది. తొక్క తొలగించి తీసుకోవడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి. అలాగే దీన్ని జ్యూస్‌ రూపంలో లేదా ఉడికించి కూడా తీసుకోవచ్చు. కాబట్టి బీట్‌రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం.

ఖర్జూరం

ఖర్జూరంలో ఐరన్, విటమిన్‌ సి, విటమిన్‌ బి కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. ఎనీమియాను నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొన్ని ఖర్జూరాలను పాలలో వేసి ఉడికించి వాటితో పాటు, పాలను అలానే త్రాగాలి. కప్పు నీటిలో గంటసేపు నానబెట్టిన నాలుగు ఖర్జూరాలను మెత్తని గుజ్జుగా చేసుకొని తినాలి.

dates
Photo by Polina Tankilevitch from Pexels

బెల్లం

బెల్లంలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. టీ, కాఫీలలో పంచదారకు బదులుగా బెల్లం మిక్స్‌ చేసి తీసుకోవాలి. లేదా అలాగే మన వంటింట్లో ఉండే పదార్థాలతో చేసే మినప లడ్లు, వేరుశనగ లడ్లు, నువ్వుల లడ్లు, డ్రై ఫ్రూట్స్‌ లడ్డులను బెల్లంతో చేసిన ఇతరత్రా పదార్థాలను తీసుకుంటే మంచిది.

ఈ లడ్డులను బెల్లంతో పొడి చేసి దానికి సమానంగా నువ్వులను, డ్రై ఫ్రూట్స్, పల్లీలతో కలిపి ఉండలుగా చేసుకుని రోజు ఒకటి కంటే ఎక్కువగా తినాలి. ఇలా తీసుకుంటే ఈ సమస్య నుంచి తొందరగా గట్టెక్కొచ్చు. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలను కూడా చూడవచ్చు.

నల్ల నువ్వులు

నల్ల నువ్వుల్లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. వీటిని నేరుగా అలాగే తీసుకోవచ్చు. లేదా స్వీట్‌ డిష్‌లలో వేసుకోని తీసుకోవచ్చు. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది. నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంలో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. బెల్లంతో వేరుశనగలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఎనీమియాను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

తేనె

తేనె కూడా రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్‌ పుష్కలంగా ఉంటాయి. నీరసంగా అనిపించినప్పుడు నిమ్మరసంలో తేనె కలిపి లేదా ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగాలి. అలాగే తీసుకున్నా.. శరీరంలో హీమోగ్లోబిన్‌ లెవల్స్‌ను పెంచుకోవచ్చు. ఇది ఎనీమియాకు తగ్గించటంలో ఉపయోగపడుతుంది.

ఇవే కాకుండా ఐరన్‌ పుష్కలంగా ఉండే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు నిత్యం తీసుకోవాలి. మొలకెత్తిన పప్పుధాన్యాలు, స్ట్రాబెర్రీ, కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, పాలు, పెరుగు, పన్నీర్‌ లాంటి ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.

సోయాబీన్‌ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని ఇస్తుంది. మార్కెట్‌లో లభించే సాధారణ ఉప్పుకు బదులుగా అయోడిన్‌ ఉప్పును వాడటం ద్వారా ఐరన్‌ లోపం వల్ల వచ్చే రక్త హీనతను నివారించవచ్చు.

సజ్జలు, రాగులు వంటి తృణ ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ సూచనలన్ని పాటిస్తే రక్తహీనతకు దూరమై ఆరోగ్యంగా ఉండవచ్చు.

– స్వాతి యాపాల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్


ఇవి కూడా చదవండి

ఆహారంలో గుడ్ ఫ్యాట్స్ ఏవి? బ్యాడ్ ఫ్యాట్స్ ఏవి?

అడిసన్ వ్యాధి నుంచి సుస్మితాసేన్‌‌ ఎలా పోరాడింది?


Exit mobile version