మటన్ మునక్కాయ గ్రేవీ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా? నాన్ వెజ్ ప్రియులు వెరైటీగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే ఈ రెసిపీ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మటన్ తో పాటు మునక్కాయను కూడా జోడించి వండితే ఆ రుచే వేరు. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చేయడం చాలా సులువు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చివరగా మటన్, మునక్కాయ ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకోండి.
మటన్ మునక్కాయ రెసిపీకి కావల్సిన పదార్థాలు:
- మటన్ – 500 గ్రాములు
- మునక్కాయ ముక్కలు – 6 (మీడియం సైజు)
- కారం – రెండు టేబుల్ స్పూన్లు
- పసుపు – చిటికెడు
- ఉప్పు – రుచికి తగినంత
- వంటనూనె – 3 టేబుల్ స్సూన్లు
- ఉల్లిపాయలు – 4 (సన్నగా తరిగినవి)
- టమాటోలు – 2 (మీడియం సైజు)
- పచ్చిమిర్చి -3
- ధనియాల పొడి – 1 టీ స్పూన్
- జీలకర్ర పొడి – 1 టీ స్పూన్
- మటన్ మసాలా పొడి – 1 టీ స్పూన్
- గరం మపాలా పొడి – 1 టీ స్పూన్
- కొత్తిమీర కొద్దిగా (గార్నిష్ కోసం)
మటన్ మునక్కాయ గ్రేవీ తయారీ విధానం:
1.ముందుగా మటన్ కొద్దిగా మెత్తగా అవడానికి కుక్కర్ లో పెట్టుకుని అందులో కొద్దిగా నీరు పోసి 2 విజిల్స్ వచ్చేంతవరకూ ఉడికంచుకోవాలి.
2. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల వంటనూనె వేసుకుని అది కొంచెం వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
3. ఉల్లిపాయలు కొంచెం గోధుమ రంగు వచ్చిన తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంతవరకూ కొన్ని నిమిషాటు వేయించాలి. అర చెంచా పసుపు వేసుకోవాలి.
4. ఇప్పుడు కుక్కర్ లో ముందుగా ఉడికించిన మటన్ తీసి దీనిలో వేయండి. మీడియం మంటపై ఉడికించండి.
5. ఒక నిమిషం తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మునక్కాయ ముక్కలను వేసి వాటిని కూడా ఉడికించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఉడికిస్తే ముక్కలు తొందరగా బాగా ఉడుకుతాయి.
6. ఒక నిమిషం తరువాత దానిలో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మటన్ మసాలా పొడి, గరం మసాలా పొడి వేసుకుని మసాలాలన్నీ ముక్కలకు పట్టేవిధంగా కలుపుకోవాలి.
7. ఇలా కొంచెం మగ్గిన తర్వాత చిన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసి మరికొన్ని నిమిషాలు మగ్గనివ్వాలి.
8. ఆపై తగినంత నీరు పోసి గ్రేవీ కొద్దిగా చిక్కదనంగా వచ్చేవరకూ ఉడికించండి.
9. మటన్ గ్రేవీపై కొద్దిగా కొత్తిమీరను చిన్నగా తురుముకుని వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ మునక్కాయ రెసిపీ రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే స్పైసీగా, అద్భుతంగా ఉంటుంది.
మటన్ ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
మటన్‌లో ప్రోటీన్, ఐరన్ ఉంటుంది. B1, B3, B12, B6 విటమిన్లు ఉంటాయి. అంతేకాకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కలిగి ఉంటుంది. మటన్‌లో కాల్షియం ఉండడం వల్ల ఎముకల ధృడత్వానికి పనిచేస్తుంది. అయితే అధిక మొత్తంలో మాంసం తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇక మునక్కాయను కూడా జోడించి వండాం కనుక అందులో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. ఇది అనేక రకాల వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడం, మధుమేహం, కీళ్లవాపులు, వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. మునక్కాయలో అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లకణాలు ఉంటాయి. విటమిన్ సి కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది.