Home మనీ NPS new guidelines: ఎన్‌పీఎస్ కొత్త గైడ్‌లైన్స్ చూశారా?

NPS new guidelines: ఎన్‌పీఎస్ కొత్త గైడ్‌లైన్స్ చూశారా?

nps new guidelines
Photo by rupixen.com on Unsplash

NPS new guidelines: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)‌ గైడ్‌లైన్స్‌లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ డెవలప్‌మెంట్ అథారిటీ కొన్ని మార్పులు చేసింది. ఈమార్పులు నవంబరు 1, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి.

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల రక్షణకు వీలుగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) పలు మార్పులు తెచ్చింది. వీటిలో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన మార్పులే ప్రధానంగా ఉన్నాయి.

Systematic investment plan in NPS: ఎన్‌పీఎస్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్

ఎన్‌పీఎస్‌‌లో ఇకపై సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ – సిప్) పద్ధతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ చెల్లించవచ్చు. మీ ఎన్‌పీఎస్‌ ఖాతా యాక్టివ్‌గా ఉండి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (పీఆర్ఏఎన్) కలిగి ఉండాలి. ఖాతాకు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ అనుసంధానమై ఉండాలి. వీటికి తోడు మీ బ్యాంకు ఖాతాకు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే మీ బ్యాంక్ ఈ-మాండేట్ ప్రాసెస్‌ను గానీ, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ప్రక్రియను గానీ అనుమతించాలి.

Opening NPS through Digi Locker: డిజిలాకర్ ద్వారా ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవడం

ఇకపై మీరు డిజిలాకర్‌లో స్టోరై ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవొచ్చు. ఎన్‌పీఎస్‌ ఖాతాలో చిరునామా తదితర వివరాలు అప్‌డేట్ చేసేందుకు కూడా డిజిలాకర్ వినియోగించవచ్చు. అయితే ఇందుకు వీలుగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీఎల్) ఆధీనంలోని సీఆర్ఏ పోర్టల్ వినియోగించాల్సి ఉంటుంది.

Systematic lump som withdrawal: సిస్టమాటిక్ లంప్సమ్ విత్‌డ్రాయల్

ఎన్‌పీఎస్ చందాదారులు సిస్టమాటిక్ లంప్సమ్ విత్‌డ్రాయల్ (ఎస్ఎల్‌డబ్ల్యూ) స్కీమ్ పొందడానికి వీలుగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) పలు మార్పులు చేసింది. ఈ ప్రతిపాదనలో భాగంగా స్మార్ట్ విత్‌డ్రాయల్ ఫెసిలిటీ పొందవచ్చు. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్ నెలవారీగా గానీ, క్వార్టర్లీ ప్రాతిపదికన గానీ, ఆరు నెలలకోసారి గానీ, ఏడాదికోసారి గానీ 75 ఏళ్ల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఆన్‌లైన్ ద్వారా గానీ, ఆఫ్‌లైన్ ద్వారా గానీ రెక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది.

Digital life certificate process: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్

లైఫ్ సర్టిఫికెట్ సబ్‌మిషన్ ప్రాసెస్‌ను సరళీకరించాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) సూచించింది. ఇందుకు వీలుగా ఆధార్ ఆధారిత అథంటికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియను అనుసరించాలని సూచించింది.

Annuity plan form: యాన్యుటీ ప్లాన్ పారం:

ఎన్‌పీఎస్ మెచ్యూరిటీ వచ్చాక యాన్యుటీ ప్లాను కొనుగోలు కోసం ప్రత్యేక ఫారం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) సూచించింది. ఈమేరకు ప్రక్రియను సడలించింది. ఇప్పటివరకు ఎన్‌పీఎస్ ఇన్వెస్టర్లు పీఎఫ్‌ఆర్‌డీఏకు ఎగ్జిట్ ఫారమ్‌తో పాటు పెన్షన్ పొందేందుకు వీలుగా యాన్యుటీ ప్లాన్ కొనుగోలు కోరుతూ ప్రపోజల్ ఫారం సబ్మిట్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎన్‌పీఎస్ ఎగ్జిట్ ఫారాన్ని యాన్యుటీ కొనుగోలుకు ప్రపోజల్ ఫారంగా పరిగణించేలా గైడ్ లైన్స్ మార్చింది.

e-nomination process: నామినేషన్ ప్రాసెస్

ప్రభుత్వ, ప్రయివేటు రంగాల ఉద్యోగులకు ఈ-నామినేషన్ ప్రాసెస్‌ను పీఎఫ్‌ఆర్‌డీఏ సరళీకరించింది. ఈ-నామినేషన్ రెక్వెస్ట్‌ను ఇక నోడల్ ఆఫీస్ ఆమోదించేందుకు గానీ, తిరస్కరించేందుకు గానీ అవకాశం ఏర్పడుతుంది. 30 రోజుల్లో నోడల్ ఆఫీస్ స్పందించనిపక్షంలో ఈ-నామినేషన్ రెక్వెస్ట్ సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలో ఆమోదం పొందుతుంది.

Payment through credit cards: క్రెడిట్ కార్డు చెల్లింపులకు నో

ఎన్‌పీఎస్ టైర్-2 ఖాతాదారులు క్రెడిట్ కార్డు ద్వారా ఇకపై తమ కంట్రిబ్యూషన్ చెల్లించడానికి సాధ్యపడదు. ఈమేరకు పీఆర్ఎఫ్‌డీఏ మార్గదర్శకాలను సవరించింది. పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ)లను కూడా ఈమేరకు ఆదేశించింది.

Exit mobile version