Home మనీ National pension system NPS: ఎన్‌పీఎస్: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ : పెన్షన్, పన్ను మినహాయింపు,...

National pension system NPS: ఎన్‌పీఎస్: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ : పెన్షన్, పన్ను మినహాయింపు, పెట్టుబడి

NPS
Image by voffka offka from Pixabay

National pension system NPS in telugu: ఎన్‌పీఎస్‌ అంటే నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌. ఇది పెన్షన్‌ కోసం, అలాగే పెట్టుబడి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌ ఇది. పన్ను మినహాయింపు కూడా ఉండడం దీని మరో ప్రత్యేకత. ఇదొక ఆకర్షణీయమైన లాంగ్‌టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌. బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్పొచ్చు.

స్టాక్‌ మార్కెట్లు, బాండ్లు వంటి రెగ్యులేటెడ్‌ మార్కెట్ల ద్వారా సేఫ్‌గా మన పెట్టుబడి వృద్ధి చెందుతుంది. ఒకరకంగా చెప్పాలంటే విభిన్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివే. కానీ వీటిని విత్ డ్రా చేసుకోవడంలో ఉన్న విధానం వేరు.

ఈ స్కీమ్‌ను పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంటరీ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) నియంత్రిస్తుంది. దీని ద్వారా ఏర్పాటైన నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ ట్రస్ట్‌ ఎన్‌పీఎస్‌ పరిధిలోని ఆస్తులకు యజమాని.

NPS eligibility: ఎన్‌పీఎస్‌లో ఎవరు చేరొచ్చు?

భారతదేశ పౌరులు 18–65 మధ్య వయస్సు గల వారు ఎవరైనా సరే వ్యక్తిగతంగా కూడా నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ – ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు. 2009 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవకాశం ఇచ్చింది. అలాగే ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. పర్సన్‌ ఆఫ్‌ ఇండియన ఆరిజిన్‌ కార్డు హోల్డర్లు, హెచ్‌యూఎఫ్‌ ఎన్‌పీఎస్‌ ఖాతా తెరిచేందుకు అనర్హులు.

ఆర్మీ సిబ్బంది కాకుండా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 నుంచి ఎన్‌పీఎస్‌ తప్పనిసరిగా అమలవుతోంది. ఉద్యోగులు తమ వేతనాల నుంచి నెలవారీ చందాను ఈ ఎన్‌పీఎస్‌కు చెల్లిస్తారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెల్లిస్తారు. ప్రయివేటు రంగంలోని ఉద్యోగులకు పెన్షన్‌ కోసం ఆయా సంస్థలు కూడా ఎన్‌పీఎస్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

Best retirement plan: బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ ఎన్పీఎస్

1. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ – ఎన్‌పీఎస్‌ లో మనం కట్టే చందా నిర్వహణకు పెద్దగా ఛార్జీలు ఉండవు.
2. పన్ను మినహాయింపు ఉంటుంది.
3. మార్కెట్‌ ఆధారిత రిటర్న్స్‌ ఉంటాయి.
4. ఫండ్స్‌ను సులువుగా మార్చుకోవచ్చు
5. అనుభవం ఉన్న ఫండ్‌ మేనేజర్లు ఈ ఫండ్స్‌ నిర్వహిస్తారు.
6. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన పీఎఫ్‌ఆర్డీఏ దీనిని నిర్వహిస్తుంది.

How to join in NPS: ఎన్‌పీఎస్‌లో ఎలా చేరాలి?

ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ నిర్వహించే ఈఎన్‌పీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవొచ్చు. ఇందుకు మొబైల్‌ నెంబర్, ఈమెయిల్‌ ఐడీ, నెట్‌బ్యాంకింగ్‌ ఉన్న బ్యాంక్‌ ఖాతా అవసరం. ఎన్‌పీఎస్‌లో రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తరువాత పర్మినెంట్‌ రిటైర్మెంట్‌ ఆకౌంట్‌ నెంబర్‌ (ప్రాన్‌) కేటాయిస్తారు. ప్రాన్‌ నెంబర్‌ కేటాయించగానే ఎన్‌ఎస్‌డీఎల్‌–సీఆర్‌ఏ (సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీ) ఎస్‌ఎంఎస్‌ ద్వారా, ఈమెయిల్‌ ద్వారా తెలియపరస్తుంది.

Tax Saving NPS: ఎన్‌పీఎస్‌ ద్వారా పన్ను ఆదా

ఎన్‌పీఎస్‌ టైర్‌–1 అకౌంట్‌లో మనం ఖాతా తెరిచి నెలనెలాగానీ, ఏటా కొంతమొత్తం గానీ ఇన్వెస్ట్‌ చేస్తూ పోవాలి. సెక్షన్‌ 80 సీ లో రూ 1,50,000 వరకే ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. దీనికి అదనంగా ఎన్‌పీఎస్‌లో పెట్టే పెట్టుబడులకు సెక్షన్‌ 80 సీసీడీ (1) ద్వారా రూ. 50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు.

అంటే మీరు పది శాతం బ్రాకెట్‌లో ఉంటే రూ. 5 వేలు, 20 శాతం టాక్స్‌ బ్రాకెట్లో ఉంటే రూ. 10 వేలు ఇన్‌స్టంట్‌గా సేవ్‌ చేసుకోవచ్చు. అంటే మరోరకంగా చెప్పాలంటే.. రూ. 50 వేల పై ఇన్‌స్టంట్‌గా పది వేలు సంపాదించడమన్నమాట.

How Does NPS Works: ఎన్‌పీఎస్‌ ఎలా పనిచేస్తుంది

ప్రభుత్వం నిర్దేశించిన ఏడు పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్లలో మనం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అవి బిర్లా సన్‌లైఫ్‌ పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్, కోటక్‌ మహీంద్రా పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్, ఎల్‌ఐసీ పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్, ఎస్‌బీఐ పెన్షన్‌ ఫండ్‌ లిమిటెడ్, యూటీఐ రిటైర్మెంట్‌ సొల్యూషన్స్‌లలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఆయా సంస్థలు మనం ఎంచుకున్న అసెట్ క్లాస్ కు అనుగుణంగా మన పెట్టుబడులను నిర్వహిస్తుంది.

Where NPS invests: ఎన్‌పీఎస్‌ ఎలాంటి వాటిలో పెట్టుబడులు పెడుతుంది?

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ – ఎన్‌పీఎస్‌ నాలుగు రకాల అసెట్‌క్లాసుల్లో పెట్టుబడులు పెడుతుంది. ఈక్విటీ (ఈ), కార్పొరేట్‌ డెట్‌ (సీ), గవర్నమెంట్‌ బాండ్స్‌ (జీ), ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌(ఏ) అనే నాలుగు రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది. ఈ ఈ, సీ, జీ, ఏలలో ఒక అసెట్‌ క్లాస్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Active Choice, Auto Choice: ఆక్టివ్‌ ఛాయిస్, ఆటో ఛాయిస్‌ అంటే..

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌‌లో ఖాతాదారు తన సబ్‌క్రిప్షన్ ఛాయిస్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆక్టివ్‌ ఛాయిస్, రెండోది ఆటో ఛాయిస్‌.

ఆక్టివ్‌ ఛాయిస్‌లో ఖాతాదారు తన రిస్క్‌ సామర్థ్యాన్ని బట్టి అసెట్‌ క్లాస్‌ను ఎంచుకోవచ్చు. అలాగే 50 ఏళ్ల వయస్సు వరకు ఈక్విటీల్లో 75 శాతం వరకు పెట్టుబడి పెట్టేందుకు ఎంచుకోవచ్చు.

పెట్టుబడులపై మనకు అవగాహన లేనప్పుడు ఆటో ఛాయిస్‌ ఎంచుకోవాలి. ఇందులో ఒకవేళ మీరు అసెట్‌ క్లాస్‌ ఈక్విటీ(ఈ) ఎంచుకున్నారనుకోండి. ఇందులో మీకు 35 ఏళ్ల వయస్సు ఉంటే గరిష్టంగా ఈక్విటీల్లో 75 శాతం వరకు పెట్టుబడి పెడతారు. వయస్సు పెరిగిన కొద్దీ ఈక్విటీల్లో పెట్టుబడి తగ్గిస్తారు.

ఈక్విటీలు అంటే స్టాక్‌మార్కెట్‌లో దొరికే స్టాక్స్‌లో పెట్టుబడి అని అర్థం. మార్కెట్‌ పనితీరు ఆధారంగా మన పెట్టుబడి పెరగొచ్చు. తగ్గొచ్చు. అందువల్ల దీనికి గరిష్ట పరిమితి నిర్దేశిస్తారు. మిగిలిన కొంత మొత్తాన్ని గవర్నెంట్‌ లేదా ప్రయివేటు బాండ్లలో, ఇతర ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్లలో పెడతారు.

When can withdraw from NPS: ఎన్‌పీఎస్‌ నుంచి ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు?

ఎన్‌పీఎస్‌ అనేది పెన్షన్‌ ఫండ్‌ అని చెప్పుకున్నాం కదా.. సో మనం ఇందులో నుంచి వైదొలిగినప్పుడు మొత్తం ఉపసంహరించుకోవడానికి లేదు. కొంత మొత్తాన్ని తప్పనిసరిగా యాన్యుటీ కొనడానికి వెచ్చించాలి. దాని ద్వారా పెన్షన్‌ వస్తుంది. రెండు రకాలుగా విత్‌ డ్రా చేసుకోవచ్చు.

ఒకటి పదవీ విరమణ సమయంలో తీసుకోవచ్చు. అంటే 60 ఏళ్లు నిండినప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. మొత్తం కార్ఫస్‌ ఫండ్‌ నుంచి కనీసం 40 శాతం పెన్షన్‌ వచ్చేందుకు వీలుగా యాన్యుటీ కొనుగోలు చేయాలి. మిగిలిన 60 శాతం మనం తీసుకోవచ్చు. ఒకవేళ మొత్తం కార్పస్‌ రూ. 2 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పుడు మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. 60 ఏళ్ల తరువాత కూడా ఈ ఎన్‌పీఎస్‌ కొనసాగించవచ్చు.

NPS: 60 ఏళ్ల కంటే ముందుగానే..

60 ఏళ్ల కంటే ముందుగా కూడా తీసుకోవచ్చు. దీనిని ప్రీమెచ్యూర్‌ ఎగ్జిట్‌ అంటారు. కానీ నిబంధనలు వేరుగా ఉంటాయి. ఇలా తీసుకోవాలంటే కనీసం పదేళ్లుగా ఎన్‌పీఎస్‌ ఖాతా నిర్వహించి ఉండాలి.

ఎన్‌పీఎస్‌ నుంచి విత్‌డ్రా చేసుకోవాలంటే కనీసం 80 శాతం కార్ఫస్‌ను యాన్యుటీ కొనుగోలు చేయడానికి వినియోగించాల్సి ఉంటుంది. దాని ద్వారా నెలనెలా పెన్షన్‌ వస్తుంది. మిగిలిన 20 శాతం మాత్రమే చేతికి వస్తాయి. ఎప్పుడు యాన్యుటీ కొనుగోలు చేస్తే అప్పటి నుంచి పెన్షన్‌ మొదలవుతుంది.

ఒకవేళ మొత్తం కార్పస్‌ రూ. లక్ష లోపు మాత్రమే ఉంటే.. మొత్తం విత్‌ డ్రా చేసుకోవచ్చు. పెన్షన్‌ కోసం యాన్యుటీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

NPS: చనిపోయిన సందర్భంలో..

ఎన్‌పీఎస్‌ ఖాతాదారు చనిపోతే మొత్తం కార్పస్‌ ఫండ్‌ను ఖాతాదారు నామినీ లేదా లీగల్‌ వారసులకు ఇస్తారు. యాన్యుటీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

Exit mobile version