ఎలాంటి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తో మన లైఫ్ బ్యూటిఫుల్‌గా మార్చుకోవచ్చు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాం. మన లైఫ్ నిజంగా బ్యూటిఫుల్‌గా ఉందా.. ఉండాలనుకుంటాం.. కానీ మార్చుకోలేం. ఇప్పుడలాంటి సందర్భం న్యూ ఇయర్ రూపంలో వచ్చింది. మరి ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ నుంచి మీకు నచ్చినవి ఎంచుకోండి. మారాలని గట్టిగా కోరుకోండి. మీ మనస్సుకు నచ్చిన వారిని ఎంతగా ప్రేమిస్తారో.. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకునేందుకు ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌ని కూడా అంతగా ప్రేమించండి. ఈ నూతన సంవత్సరం మీ లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలని డియర్ అర్బన్ డాట్ కామ్ ఆశిస్తోంది. ఇక న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ను ఎంచుకోండి మరి.
1. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ : మేక్ యువర్ లైఫ్ సింపుల్
మన లైఫ్ మనకు నచ్చకపోవడానికి కారణం ఇతరులతో పోల్చుకోవడమే. ఇతరుల స్థితిని పోల్చుకునే ముందు వారి స్థితికి గల కారణాలు కూడా తెలుసుకోండి. వారి స్థితికి వారి కృషి, చేస్తున్న ఉద్యోగం, పొదుపు లేదా వారసత్వ సంపద, ఇలా అనేక కారణాలు అందుకు కారణమై ఉండొచ్చు. వారిలా ఉండాలనుకుని, ఉండలేక వారిపై ఈర్శ, ఆసూయ, ద్వేషం పెంచుకోవడం, వారి స్థితి మనకు లేక దిగులు, విచారం, నిరాశకు లోనవడం.. ఇవన్నీ ఈ న్యూ ఇయర్‌లో విడిచిపెట్టండి. సింపుల్‌గా బతకడం నేర్చుకోండి.
మీ ఆదర్శం ఎప్పుడూ మీకు పరిచయం లేనివారై ఉండాలి. అంటే ఒక అంతర్జాతీయ క్రీడాకారుడో లేక ఒక గొప్ప సెలబ్రిటీయో లేక ఒక గొప్ప డాక్టరో లేక సమాజ సేవకుడో ఇలా వారిని ఆదర్శంగా తీసుకుంటే మీకు వారి శ్రమను తెలుసుకోవడం సులువు. వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగండి. అంతేగానీ తోటి వారి డ్రెస్ రూ. 10 వేలని మనం అంతే ధరలో కొనడం, తోటి వారు ఆపిల్ ఫోన్ వాడారని మనం అదే రేంజ్‌లో మొబైల్ కొనాలనుకోవడం, వారు కారు కొన్నారని మనం తాహతుకు మించి అప్పు చేసి కారు కొనడం, వారు బంగ్లా కొన్నారని మనమూ కొనాలనుకోవడం.. ఇలాంటి పోలికలు వీడండి.
మీరు వాడే వస్తువులు మీకు సంతృప్తినిస్తే సరిపోతుంది. ఇతరులు మీ వ్యక్తిత్వం చూసి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మీ వస్తువులను చూసి కాదు. సో మేక్ యువర్ లైఫ్ సింపుల్.
2. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ : మీ పరుగు ఆపండి
అదేంటి? పరుగు ఆపమనడమేంటి? అన్న సందేహమా? యెస్. నిజంగానే పరుగాపండి. మనం విమానం ఎక్కాం. విమానం గమ్యస్థానంలో దిగింది. మనం దిగేవరకు అది మళ్లీ ఎగరదు. కానీ విమానం వాలగానే మన బ్యాగులు ఎత్తుకుని నిలబడతాం. అందరికన్నా ముందుగా దిగాలని ఆత్రుత పడిపోతాం. ఈ పరుగే ఆపాలి.
అది విమానమైనా కావొచ్చు. లేక రైలైనా కావొచ్చు. బస్సయినా కావొచ్చు. ట్రాఫిక్ సిగ్నల్ వద్దయినా కావొచ్చు. మనం ముందుండాలన్న ఆత్రుత వద్దు. కానీ సమయ పాలన ముఖ్యం. ఆత్రుత వద్దన్నామని బద్దకంగా ఉండడం కాదు. మీ ప్రయాణానికి సంబంధించి టికెట్లు ముందే బుక్ చేసుకోవడం గానీ, లేక మీ జీవిత ప్రయాణానికి సంబంధించి మీ గమ్య స్థానాలను ముందే ప్లాన్ చేసుకోవడం గానీ మరవొద్దు.
మీ ప్రయాణంలో, మీ జీవన గమనంలో తోటి ప్రయాణికుల పట్ల దయగా ఉండండి. మీకు కూర్చునే అవకాశం ఉండీ.. మీరు దానిని మీకంటే అవసరమైన వారికి ఆఫర్‌చేస్తే ఎంత బాగుంటుంది? అది మీ మనస్సుకు చాలా హాయినిస్తుంది కదా..
3. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ : ఈ క్షణం జీవించండి
మనమంతా అమ్మ కడుపు నుంచి రాగానే అన్నీ నేర్చుకోం. మనకు అందే శిక్షణ ద్వారా అనేకం తెలుసుకుంటాం. మన ఆర్థిక స్థితి గతులు దీనిని నిర్దేశిస్తాయి. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కో వయసుకు వచ్చేసరికి నేర్చుకుంటారు. కానీ జీవితం అంటే ఆందోళన పడేది కాదని, హాయిగా గడపాల్సినదని ఒక వయస్సు వచ్చే వరకు అర్థం కాదు.
నిజానికి టీనేజ్ వరకు లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా సాగుతుంది. ఎందుకు? మీరు విద్యార్థి దశలో మీకు స్నేహం, చదువు, సంగీతం, డాన్స్, సినిమా, అప్పుడప్పుడు అమ్మానాన్న ఇచ్చే పాకెట్ మనీ, నాన్న తెచ్చే పండ్లూ ఫలాలు లేదా ఐస్ క్రీమ్ లేదా మరొకటి.. అంటే ఆ దశలో మీరు అప్పటి క్షణాలను నిండుగా అనుభవిస్తారు. భవిష్యత్తు మీద చింత ఉండదు.
ఇదే సూత్రాన్ని పెద్దయ్యాక కూడా పాటిస్తే మీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లే.. అంటే ఈ క్షణం ఆనందంగా ఉండడం నేర్చుకోండి. మీరు చేస్తున్న పని పై మాత్రమే ధ్యాస ఉంచండి. విద్యార్థి పరీక్షల్లో మార్కులు తెచ్చుకుంటున్నట్టుగానే మీరు కూడా భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయడం, ఆరోగ్యం కాపాడుకోవడం వంటివి చేస్తూనే ఆనందంగా జీవించండి.
నవ్వండి. మీ పిల్లలను, మీ తోటివారిని నవ్వించండి. పాటలు వినండి. పిల్లలతో కలసి డాన్స్ చేయండి. సినిమాకు వెళ్లండి. స్నేహితులతో ఒక రోజు గడపండి. నో కాంప్రమైజ్.
4. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ : చిన్న మార్పులతో డబ్బులు ఆదా
మీకు చిన్నప్పుడు డబ్బుపై పెద్దగా మోజు ఉండకపోవచ్చు. చిన్నప్పుడు చేసినట్టే పెద్దయ్యాక చేస్తుండొచ్చు. అప్పుడు వేరు ఇప్పుడు వేరని గుర్తించండి. మన సంపాదనంత ఎటుపోతోందో గమనించండి. మీ స్నేహితుడు లేదా మీ స్నేహితురాలు మీతో సమానంగా వేతనం సంపాదించారనుకుందాం. కానీ మీ సేవింగ్స్ కన్నా మీ ఫ్రెండ్ సేవింగ్స్ అదనంగా ఉండొచ్చు.
ఎలా అంటే మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకుందాం. రోజుకు పది సిగరెట్లు తాగుతారనుకుంటే రూ. 150 ఖర్చవుతుంది. అంటే నెలకు రూ. 4,500. ఈ రూ. 4,500 పెడితే ఒక గ్రాము బంగారం వస్తుంది. నెలకో గ్రాము బంగారం కొంటే ఏడాదిలో 12 గ్రాములు. అంటే తులం బంగారం మీ సొంతం. ఆరోగ్యానికి ఆరోగ్యం. సేవింగ్స్‌కు సేవింగ్స్. మీరు వెంటనే స్మోకింగ్ మానేసేందుకు దోహదపడేలా ఒక కథనం కూడా డియర్ అర్బన్ డాట్ కామ్ ప్రచురించింది. ఒకవేళ మీకు వారానికోసారి మద్యం తాగే అలవాటు ఉందనుకోండి. వారానికో వెయ్యి ఖర్చవుతుందనుకుంటే.. ఈ డబ్బు మద్యానికి తగలేయకుండా ఏ మ్యూచువల్ ఫండ్‌లోనో పెట్టుబడి పెడితే సంవత్సరాంతానికి కనీసం రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు మీ సంపాదన అదనంగా ఉంటుంది.
పిల్లలు అడగ్గానే బయటకు వెళ్లి రెస్టారెంట్‌లో తినడం, లేదా ఒక క్లిక్‌తో స్విగ్గీలోనో, జొమాటోలోనో ఆర్డర్ చేయడం తరచుగా చేస్తుంటే మీ క్రెడిట్ కార్డుపై భారం పడుతుందని గమనించాలి. వీటిని తగ్గించి ఇంట్లో రకరకాలుగా మనమే యూట్యూబ్‌లో చూసి వండేసుకుంటే సరదాగా ఉంటుంది.
దినపత్రికలు తెప్పించినా చదివేందుకు ఆసక్తి లేనిపక్షంలో వెంటనే వాటిని ఆపేయండి. మీ మొబైల్‌లో ఈ–పేపర్లు చదివేయండి. కార్లోనే వెళ్లాలనో, క్యాబ్‌లోనే సుఖమనో అనుకోకండి. అప్పుడప్పుడు సిటీ బస్సులో వెళ్లేందుకు ట్రై చేయండి. ఇంటి నుంచే క్యారేజ్ తెచ్చుకోండి. మీ ఆర్థిక తప్పిదాలు తెలుసుకునేందుకు ఈ కథనంపై క్లిక్ చేయండి.
5. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ : చనిపోయేంతవరకూ నేర్చుకుందాం
యెస్. మనం ఇప్పటికే చాలా నేర్చేసుకున్నాం. మనమే తోపని ఎప్పుడూ అనుకోకండి. మన జీవితాన్ని మార్చేది నిత్య అధ్యయనమే. అది ఒక మంచి పుస్తకం కావొచ్చు. లేక మీ కెరీర్‌ను మరింత బెస్ట్‌గా మార్చే ఒక ఆన్‌లైన్ కోర్సు కావొచ్చు. పుస్తకాలు చదివే ఓపిక లేకపోతే.. ఇప్పుడు పుస్తకాలు వినొచ్చు కూడా. ఆడిబుల్ వంటి యాప్‌లు ఇందుకు అవకాశాన్నిస్తున్నాయి.
పాడ్‌కాస్ట్ ద్వారా అనేక అంశాలను మీరు వింటూ హాయిగా నిద్రపోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో కోర్సులు అందించే సంస్థలు అనేకం ఉన్నాయి. డియర్ అర్బన్ డాట్ కామ్ దీనిపై ఒక ప్రత్యేక కథనం కూడా అందించింది. కేవలం రూ. 400 ఖర్చుతో ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులను కూడా అనేక ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు అందిస్తున్నాయి.
టిక్‌టాక్, షేర్‌చాట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా సామాజిక మధ్యమాలతోనే సమయం సరిపోవడం లేదు ఇక ఆన్‌లైన్‌కోర్సులు ఎప్పుడు నేర్చుకోవాలని సందేహమా? మరి మనం మారాలనుకుంటున్నాం కదా.. అవసరమైన సమయం కోసం కొంత త్యాగం చేయాల్సిందే మరి.
6. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ : 20 శాతం ఆహారం తగ్గించండి
యెస్. మీరు విన్నది నిజమే. మీరు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా మీరు తినే ఆహారం 20 శాతం తగ్గించండి. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే.. మీకు ఇంకొద్దిగా ఆకలి ఉండగానే తినడం ఆపేయండి. అంటే 80 శాతం ఆకలి తీరగానే ఆపేయండి. జపాన్‌లోని ఒకినావా ద్వీపానికి చెందిన వారి ఆరోగ్య సూత్రం ఇదేనని తాజాగా సంచలనం సృష్టించిన ‘ఇకిగాయ్’ పుస్తకం చెబుతోంది. ఇక్కడి మనుషులు సగటున 80 ఏళ్లకు పైబడి జీవిస్తారని, వందేళ్లకు పైబడి వయసున్న వారు ఇక్కడే ఎక్కువగా ఉన్నారని చెబుతోంది. వారి ఆహారపు అలవాట్లు, వారు ఉల్లాసంగా గడిపే విధానం.. ఇవన్నీ ఒకినావాకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.
మీ ఆహారం రెయిన్‌బో.. అంటే ఇంధ్రదనస్సు రంగులను కలిగి ఉండాలట. అంటే అన్ని రంగుల ఆహారం తీసుకోవాలని అర్థం. రకరకాల రంగుల కూరగాయలు, పండ్లు మన ఆహారంలో తప్పనిసరి చేయాలన్నమాట. టీ మానేసి గ్రీన్ టీ తాగడం, చక్కెర తగ్గించడం.. ఇలా చిన్న చిన్న మార్పులతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
7. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ : మానసిక ఆరోగ్యం
మీ లైఫ్‌లో ఏదైనా సాధించాలన్నా, బ్యూటిఫుల్‌గా ఉండాలన్నా మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మిమ్మల్ని మీరు సులువుగా మార్చుకోగలుగుతారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా రాత్రి 10 కల్లా నిద్ర పోండి. ఉదయం 5 కే లేవండి. ఉదయం మీ పనులు చాలా చకచకా జరిగిపోతాయి. ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఇదే సమయంలో ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేయండి. 21 రోజులు ధ్యానం చేశాక దాని ఫలితాలు మీరే చవి చూస్తారు. ఆ తరువాత క్రమంగా మీరే వ్యాయామం చేస్తారు. లేదా నడకకు వెళతారు. మీ జీవితం నిజంగా అందంగా మారుతుంది. మీలో వచ్చే ఎనలేని ఉత్సాహం మీ రోజువారీ దినచర్యను ఒత్తిడి లేకుండా నడిపిస్తుంది. మీ ఆఫీస్‌లో మీ పనితీరు ఉత్తమంగా ఉంటుంది. లేదా మీ చదువులో మీ ప్రతిభ ఉత్తమంగా ఉంటుంది.
8. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ : ఇవ్వడంలో ఆనందం వెతుక్కోండి
ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? మీరు ప్రేమలో పడినప్పుడు లేదా పెళ్లయినప్పుడు, స్నేహితులకు కానుకలు ఇచ్చినప్పుడు ఈ అనుభవాన్ని పొంది ఉంటారు. కేవలం వీరికే కాక ఇప్పుడు మీకు పరిచయం లేని వారికి కూడా ఇవ్వడం ద్వారా ఆనందం పొందొచ్చు. ఇందుకు పెద్దగా మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
మీ పుట్టిన రోజో లేక మీ పిల్లలు, భాగస్వామి పుట్టిన రోజు నాడో ఇంట్లో వంట చేసి అనాథలకు పంచండి. మీ పాత దుస్తులను డొనేట్ చేయండి. వృద్ధాశ్రమానికి వెళ్లి వారికి కడుపు నిండా భోజనం పెట్టండి. అమ్మానాన్న వయసురీత్యా పడుతున్న కష్టాలు ఉంటే వాటిని పంచుకోండి. వారికి ఆనందాన్నిచ్చే, వారికి సౌకర్యాన్ని కలిగించే వస్తువులేవైనా కొనుగోలు చేయండి. అంత టైమ్ మాకెక్కడిది అనుకుంటే ఏ అక్షయ పాత్ర ఫౌండేషన్‌కో, లేక తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానానికో ఆన్‌లైన్‌లో డొనేట్ చేయండి. నమ్మండి. మీ ఆనందం పదింతలవుతుంది.
9. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ : హాబీ.. ఆ వెంటే ఆదాయం
చిన్నప్పుడు కొత్త స్నేహితులు పరిచయమైనప్పుడు మీ హాబీలేంటని అడుగుతారు. అలా అడుగుతారేమోనని కూడా హాబీ అలవాటు చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మీకు ఏదైనా హాబీ ఉండి.. దాన్ని కొంచెం మెరుగుపరుచుకుంటే ఆదాయం కూడా వస్తుంది. హాబీతో ఆదాయ మార్గాలు.. అంటూ డియర్ అర్బన్ డాట్ కామ్ ఇచ్చిన ప్రత్యేక కథనం చదవండి. ఫోటోగ్రఫీ కావొచ్చు.. ట్రావెలింగ్ కావొచ్చు.. రచన కావొచ్చు.. ఇంకేదైనా.. ఇప్పుడు హాబీ ద్వారా డబ్బు సంపాదించడం చాలా సులువు. అది కూడా ఇంట్లోనే. ఆన్‌లైన్ ద్వారా. ఈవెన్ మీకు మంచి గొంతు ఉన్నా.. ఆన్‌లైన్‌లోనే వాయిస్ ఓవర్ ద్వారా ఆదాయం సంపాదించొచ్చు.
ఇవి కాకుండా మీ వద్ద ఏవైనా మంచి ఐడియా ఉంటే మాకు రాయండి editor@dearurban.com మెయిల్ ఐడీకి.