Home కెరీర్ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌.. బెస్ట్‌ వెబ్‌సైట్స్‌, యాప్స్‌ ఇవే..

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌.. బెస్ట్‌ వెబ్‌సైట్స్‌, యాప్స్‌ ఇవే..

education
నెలకు 10 రూపాయల విరాళంతో పేద విద్యార్థులకు చదువు Image by Mudassar Iqbal from Pixabay

న్‌లైన్‌ ఎడ్యుకేషన్‌.. కొత్త కొత్త కోర్సులు, డిగ్రీలు చదవాలంటే.. కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్లకే వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లో ఓ కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, ఓ స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మీ చేతుల్లో ఉన్నట్లే. ఈ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా మీకు ఆసక్తి ఉన్న ఏ రంగంలో అయినా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కొత్త కోర్సులు చేయొచ్చు. కొత్త సర్టిఫికెట్లు పొందొచ్చు. దీనికోసం అనేక వెబ్‌సైట్లు, యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఫ్రీగానే ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి.

ఏయే కోర్సులు?

బిజినెస్‌, టెక్నాలజీ, హిస్టరీ, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌, లిటరేచర్‌, హెల్త్‌, సైకాలజీ, సైన్స్‌, పాలిటిక్స్‌, లా, లాంగ్వేజెస్‌, కల్చర్‌, ఎన్విరాన్‌మెంట్‌, డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల కోర్సులు ఈ వెబ్‌సైట్స్‌, యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. మీ ఓపికను బట్టి ఎన్ని కోర్సులైనా చేయొచ్చు. కోర్సు పూర్తయితే సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. కొత్త విషయం తెలుసుకోవాలి అనుకున్నాలేక మీకు ఓ సబ్జెక్టుపై ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని అనుకున్నాఆన్‌లైన్‌ కోర్సులు మీకు బెస్ట్‌ చాయిస్‌.

ఎక్కడి నుంచైనా..

ఇంట్లో కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, ఉద్యోగంలో బిజీగా ఉన్నా.. ఈ ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా మీకు ఇష్టమైన కోర్సులను నేర్చుకునే వీలుంటుంది. అయితే ఈ ఆన్‌లైన్‌ కోర్సులను అందించే వెబ్‌సైట్లు, యాప్స్‌ కూడా ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ఒక్కోసారి ఎక్కువ ఆప్షన్లు ఉన్నా ఏది ఎంపిక చేసుకోవాలో తెలియక సతమతమవుతారు. అందువల్ల వీటిలో ఏవి బెస్ట్‌ వెబ్‌సైట్స్ అన్నది తెలియాలి. పైగా కొన్ని వెబ్‌సైట్లు కొన్ని సబ్జెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఏ కోర్సుకు ఏ వెబ్‌సైట్‌ బాగుంటుంది అన్నది తెలుసుకుంటే కూడా మీ పని సులువవుతుంది. అందుకే ఈ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌పై డియర్‌ అర్బన్‌.కామ్‌ ఓ సమగ్ర కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది.

బెస్ట్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్స్‌

ముందుగా ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్న అత్యుత్తమ వెబ్‌సైట్లు ఏవో చూద్దాం.

విజువల్‌ లెర్నింగ్‌ కోసం లిండా (Lynda)..

అమెరికాకు చెందిన ప్రముఖ ఉద్యోగ, వ్యాపార సర్వీసులు అందించే సంస్థ లింక్డిన్‌కు చెందిన వెబ్‌సైట్‌ ఇది. ముఖ్యంగా టెక్నాలజీ, బిజినెస్‌, క్రియేటివిటీకి సంబంధించిన కోర్సులకు ఇది ఫేమస్‌.

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌, డిజైన్‌, ఫొటోగ్రఫీ, వెబ్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి కొన్ని వేల ఆన్‌లైన్‌ కోర్సులు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. 1995 నుంచి ఈ-లెర్నింగ్‌ ఇండస్ట్రీలో సేవలు అందిస్తోంది. అయితే Lynda.comలో మొదటి 30 రోజులు మాత్రమే ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను చూసే వీలుంటుంది. ఆ తర్వాత నెలకు రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే.. నెలకు రూ. 900 వసూలు చేస్తారు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను ఏ టైమ్‌లో అయినా క్యాన్సిల్‌ చేసుకోవచ్చు.

విజువల్‌ లెర్నింగ్‌ కావాలని అనుకుంటే.. మీకు ఈ వెబ్‌సైట్‌ బెస్ట్‌ ఆప్షన్. 13 వేలకుపైగా ఎక్స్‌పర్ట్స్‌ అందించిన కోర్సులు ఇందులో ఉన్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్‌ కూడా ఇస్తారు. ఈ ఆన్‌లైన్‌ కోర్సుకు ఎన్‌రోల్‌ చేసుకుంటే.. మీకు లింక్డిన్‌కు చెందిన ప్రీమియం కెరీర్‌ ఫీచర్స్‌కు యాక్సెస్‌ కూడా లభిస్తుంది. ఇక లిండా పేరు మీదే ఓ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్‌ కూడా ఉంది. మొబైల్‌లో చూడాలని అనుకుంటే ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఉడెమి (Udemy).. లక్ష కోర్సులు

ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్న అతిపెద్ద వెబ్‌సైట్లలో ఉడెమి కూడా ఒకటి. ఇందులో దాదాపు లక్షకుపైగా ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫ్రీగా నేర్చుకునే కోర్సులు, డబ్బు చెల్లించాల్సిన కోర్సులు వేర్వేరుగా ఉన్నాయి.

బిజినెస్‌, ఐటీ అండ్‌ సాఫ్ట్‌వేర్‌, డిజైన్‌, ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌, మార్కెటింగ్‌లాంటి ఆన్‌లైన్‌ కోర్సులు ఈ వెబ్‌సైట్‌లో ఫేమస్‌. udemy.comలోకి వెళ్లి మీకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోండి. ఇందులో వెయ్యికిపైగా కోర్సులను ఉడెమీ పూర్తి ఉచితంగా అందిస్తోంది. అయితే ఏ కోర్సు ఫ్రీ, ఏది పెయిడ్‌ అన్నది వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెర్చ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

కోడింగ్‌ లాంగ్వేజెస్‌కు సంబంధించి జావా, మైసీక్వెల్‌ (MySQL), ఐఓఎస్‌ యాప్స్‌ క్రియేషన్‌లాంటి వాటిని ఉడెమి ఫ్రీగా అందిస్తోంది. మిగిలిన కోర్సులు కనీసం రూ. 500 నుంచి రూ. 35 వేల వరకు ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌లో ఆఫర్లు కూడా బాగానే ఇస్తుంటారు. మొబైల్‌లో చూడాలనుకుంటే ఉడెమి యాప్‌ కూడా అందుబాటులో ఉంది.

ఖాన్‌ అకాడమీ.. అన్నీ ఫ్రీ

ఇదొక నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌. అందువల్ల ఇది ఎవరికైనా పూర్తి ఉచితంగా అన్ని ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తోంది. 2006లో ఈ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. ఖాన్‌ అకాడమీ ఎక్కువగా మ్యాథ్స్‌, సైన్స్‌, ఎకనమిక్స్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లాంటి సాంప్రదాయ కోర్సులపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. పైగా ఇందులో లెర్నర్స్‌తోపాటు టీచర్స్‌కు, పేరెంట్స్‌కు ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి.

ఖాన్‌ కిడ్స్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. మ్యాథ్స్‌లో వివిధ విభాగాలైన అర్థమెటిక్‌, ట్రిగొనామెట్రీ, ఆల్‌జిబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబులిటీలపై ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తోంది. ఒకటి నుంచి పన్నెండో తరగతి చదివే విద్యార్థులందరికీ మ్యాథ్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులను హిందీలో కూడా అందిస్తుండటం విశేషం. కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల కోసం ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు మ్యాథ్స్‌ కోర్సులు ఉన్నాయి. ఐఐటీ జేఈఈ, జీమ్యాట్‌, శాట్‌, ఎల్‌శాట్‌, ఎంక్యాట్‌లాంటి పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కేటగిరీ ఈ ఖాన్‌ అకాడమీ వెబ్‌సైట్‌లో ఉంది. ఇందులోని ప్రతి కోర్సు కూడా పూర్తి ఉచితంగా కావడం మరో విశేషం. మరిన్ని వివరాల కోసం https://www.khanacademy.org/ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. ఖాన్‌ అకాడెమీకి చెందిన ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి.

లాంగ్వేజెస్‌ కోసం కోర్సెరా (Coursera)

ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక సంస్థలతో కోర్సెరాకు భాగస్వామ్యం ఉంది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలాంటివి పేరొందినివి కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇందులోనూ వెయ్యి కోర్సుల వరకు పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఒక్కో కేటగిరీలో ఏయే ఫ్రీ కోర్సులు ఉన్నాయో.. ఆ కేటిగిరీపై క్లిక్‌ చేస్తే తెలుస్తుంది. ప్రతి కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఓ సర్టిఫికెట్‌ అందిస్తారు.

కోర్సెరా యాప్‌ కూడా అందుబాటులో ఉంది. ఆర్ట్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌, హెల్త్‌, సోషల్‌ సైన్సెస్‌లాంటి కోర్సులతోపాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, ఇంగ్లిష్‌ సహా వివిధ ప్రపంచ భాషలు నేర్చుకోవడానికి కూడా ప్రత్యేక కోర్సులు ఇందులో ఉన్నాయి. https://www.coursera.org వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులోని ఆన్‌లైన్‌ కోర్సులన్నింటి గురించి తెలుసుకోండి.

కెరీర్‌ గైడెన్స్‌ కోసం అలిసన్‌ (Alison)

కెరీర్‌ గైడెన్స్‌తోపాటు ప్రత్యేకంగా ఏ జాబ్‌ కోసం ఏ కోర్సు చేయాలన్న సూచనలు కూడా ఈ అలిసన్‌ వెబ్‌సైట్‌ అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోటి 30 లక్షల మంది స్టూడెంట్స్‌ ఇందులో ఎన్‌రోల్‌ చేసుకున్నారు. వెయ్యి కోర్సులను ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ పూర్తి ఉచితంగా అందిస్తోంది. అందులో ఐటీ, సైన్స్‌, హెల్త్‌, బిజినెస్‌, మ్యాథ్స్‌, లాంగ్వేజెస్‌లాంటి ఆన్‌లైన్‌ కోర్సులు ఉన్నాయి.

డిప్లొమా కోర్సెస్‌, సర్టిఫికెట్‌ కోర్సెస్‌ రెండూ ఉన్నాయి. ఈ కోర్సుల్లో పాస్‌ అవ్వాలంటే కనీసం 80 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలిసన్‌ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. https://alison.com/ లోకి వెళ్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

టెక్నాలజీ కోసం ఉడాసిటీ (Udacity)

టెక్నాలజీ రంగంలో పట్టు సాధించాలి అనుకుంటే.. ఈ ఉడాసిటీ వెబ్‌సైట్‌ బెస్ట్‌. ప్రోగ్రామింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, డేటా సైన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లాంటి టెక్‌ ఆధారిత సబ్జెక్టులపైనే ఈ ఉడాసిటీ దృష్టి సారిస్తోంది. టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న అన్ని అప్‌డేట్స్‌ ఇందులో మీరు చూడొచ్చు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో పని చేస్తున్న నిపుణులు చేసిన ప్రాజెక్టులను కూడా ఉడాసిటీ అందజేస్తోంది. వ్యక్తిగతంగా కెరీర్‌ కోచ్‌ కూడా ఉంటాడు. మరిన్ని వివరాల కోసం https://www.udacity.com/ వెళ్లండి. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది.

కోడింగ్‌ కోసం కోడ్‌కాడెమీ (Codecademy)

కోడింగ్‌ కోర్సులపై ఆసక్తి ఉన్న వాళ్లకు ఈ కోడ్‌కాడెమీ బెస్ట్‌ ఆప్షన్‌. కోడింగ్‌పై ఎన్నో ఫ్రీ కోర్సులను ఇది అందిస్తోంది. హెచ్‌టీఎంఎల్‌, సీ++, జావా, పీహెచ్‌పీ, జావాస్క్రిప్ట్‌, రూబీ, పైథాన్‌, జేక్వెరీలాంటి లాంగ్వేజెస్‌ కోర్సులు ఇందులో ఉన్నాయి. మీకోసం ప్రత్యేకంగా ఓ డాష్‌బోర్డు కూడా కోడ్‌కాడెమీ ఇస్తోంది. ఇందులో ఎప్పటికప్పుడు మీ ప్రోగ్రెస్‌ను చూసుకోవచ్చు. ఒక లాంగ్వేజ్‌పై ఆసక్తి ఉన్న వ్యక్తుల గ్రూపులో కూడా మీరు చేరొచ్చు. ఆ లాంగ్వేజ్‌లో మీకు ఏదైనా సమస్య వచ్చినపుడు.. గ్రూపులోని ఇతర సభ్యులను అడిగి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. https://www.codecademy.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫ్రీగా సైనప్‌ కావచ్చు.  Code Hour అనే ఐవోఎస్‌ యాప్‌ కూడా అందిస్తున్నారు. ఇందులో బేసిక్‌ కోడింగ్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి.

అప్ గ్రాడ్ ( https://www.upgrad.com/)

అప్ గ్రాడ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సైట్ అనేక యూనివర్శిటీలు, పలు జాతీయస్థాయి ప్రాధాన్యత గల విద్యా సంస్థలతో భాగస్వామిగా ఉండి ఆన్ లైన్ కోర్సులు అందిస్తోంది. ఐఐఐటీ బెంగళూరు, బిట్స్ పిలానీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి సంస్థలు కూడా ఆన్ లైన్ కోర్సుల్లో భాగస్వామిగా ఉన్నాయి. డేటా సైన్స్, టెక్నాలజీ, మేనేజ్ మెంట్ తదితర రంగాల్లో ఆన్ లైన్ కోర్సులు అందిస్తోంది.

మెషీన్ లెర్నింగ్, ఏఐ, వంటి అధునాతన టెక్నాలజీల్లో సైతం కోర్సులు అందిస్తోంది. అయితే ఫీజులు భారీగానే ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ మెషీన్ లెర్నింగ్ అండ్ ఏఐ కోర్సుకు రూ. 2,85,000 వసూలు చేస్తోంది. ఈ కోర్సును ఐఐఐటీ బెంగళూరు సాయంతో అందిస్తోంది. అయితే ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కోర్సులు అందించడం, ఇండస్ట్రీ మెంటార్లను నియమించడం, హైరింగ్ పార్టనర్స్ ఉండడం ఈ అప్ గ్రాడ్ ప్రత్యేకత. 

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ యాప్స్‌

పైన చూసిన అన్ని వెబ్‌సైట్లకు ప్రత్యేకంగా యాప్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని యాప్స్‌ కూడా ట్రై చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

ఐట్యూన్స్‌ యు (iTunes U)

ఆపిల్‌ సంస్థ అందిస్తున్న ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌ ఇది. ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఉన్న నిపుణులు రూపొందించిన కోర్సులు ఇందులో ఉన్నాయి. ఆడియో, వీడియో, ఈబుక్స్‌ రూపంలో కోర్సులు ఉంటాయి. ఇందులో మొత్తం ఏడున్నర లక్షలకుపైగా ఫ్రీ లెక్చర్స్‌, బుక్స్‌ అందుబాటులో ఉండటం విశేషం. మీ దగ్గర ఐఓఎస్‌ డివైస్‌ ఏదైనా ఉంటే.. ఇది బెస్ట్‌ యాప్‌.

బ్రైట్‌స్టార్మ్‌ (Brightstorm)

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టీనేజర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించే యాప్‌ ఇది. ఇందులో వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఐదు వేలకుపైగా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులోని కంటెంట్‌ ఫ్రీ కాదు. నెలకు కనీసం 22 డాలర్ల నుంచి వివిధ ప్లాన్స్‌ ఉంటాయి. కాలేజ్‌ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి విలువైన సలహాలు, సూచనలు అందించే వీడియోలు కూడా ఇందులో ఉంటాయి.

ప్రాక్టికల్‌ లెర్నింగ్‌ కోసం హౌక్యాస్ట్‌ (Howcast)

థియరీ నేర్పే ఆన్‌లైన్‌ కోర్సులు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్లకు ఈ హౌక్యాస్ట్‌ బెస్ట్‌ యాప్‌. ఇందులో ప్రతీది ఎలా చేయాలి అన్నది వీడియోల రూపంలో అందుబాటులో ఉండటం విశేషం. వంట చేయాలన్నా, డ్యాన్స్‌ నేర్చుకోవాలన్నా, ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్‌ కావాలన్నా, వీడియో గేమ్స్‌ ఎలా ఆడాలో చెప్పే వీడియోలు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. ఇందులోని వీడియోలన్నీ ఫ్రీగానే చూడొచ్చు.

కొత్త ఐడియాల కోసం టెడ్‌ (TED)

టెడ్‌ టాక్స్‌ తెలుసు కదా. కొత్త కొత్త ఆలోచనలను ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ టెడ్‌ కాన్ఫరెన్స్‌లు జరుగుతుంటాయి. ఈ టెడ్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వెయ్యికిపైగా టెడ్‌టాక్‌ వీడియోలు ఉన్నాయి. వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఆయా రంగాల్లో కొత్త కొత్త ఆలోచనలను మీతో పంచుకుంటారు.

బిగ్‌ థింక్‌ (Big Think)

ఇది కూడా టెడ్‌లాంటిదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, సైంటిస్టులు, లీడర్లు ఇచ్చిన సందేశాల వీడియోలు ఉంటాయి. సైన్స్‌, టెక్నాలజీ, సోషియాలజీలాంటి వివిధ రంగాలు సమీప భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు లోనవుతాయన్న అంశాలపై చర్చిస్తారు. ఇందులో ప్రధానంగా ఏడు కేటగిరీలు ఉంటాయి. మీకు ఆసక్తి ఉన్న రంగానికి సంబంధించిన వీడియోలు చూసే వీలుంటుంది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్ అందిస్తున్న యాప్ లు, వెబ్ సైట్లు చూశారు కదా.. మీరు ఏంచక్కా కోర్సులు చేసేసి ఉద్యోగావకాశాలు చేజిక్కించుకోండి. 

ఇవి కూడా చదవండి

♦ యాప్ తో ఆదాయ మార్గాలు ఇవిగో

♦ 8 స్టార్టప్ ఐడియాలు.. మీ తెలివే పెట్టుబడి

Exit mobile version