నేతాజీ పుట్టినచోట.. గీతాంజలి పాడిన చోట.. అంటూ చూడాలని ఉంది సినిమాలో మరీమరీ చూడాలనిపించేలా కలకత్తాను (ఇప్పటి కోల్‌కతా) చూపించాడు చిరంజీవి. (అదేంటో! హ్యాపీగా… జాలీగా టూర్ వెళ్దామంటే ఠక్కున ఊటీయో, కొడైకెనాలో, బెంగుళూరో గుర్తొచ్చినంత వేగంగా కోల్‌కతా గుర్తు రాదు. ఎందుకనో గాని!) ఈ మహా నగరం దేశంలో ఉన్న ఇతర నగరాల కన్నా చాలా భిన్నమైంది.
బంగభూమి (బెంగాలీ, ఒరియాలో ‘వ’ అన్న అక్షరం లేదు. వాళ్లు ‘బ’ అక్షరాన్ని ‘వ’తో పలుకుతారు) ప్రజల జీవనశైలి, అలవాట్లు, అభిరుచులు, సంస్కృతులు అన్నీ విభిన్నంగా ఉంటాయి. తూర్పు వెళ్లే రైలు ఎక్కి హౌరా స్టేషన్‌లో దిగిన దగ్గర నుంచి ‘ఆహా’ అనిపించేలా అబ్బురపరుస్తుంది.. అయ్యో ‘ఇదేంటి’ నిట్టూర్పు కలిగేలా చేస్తుంది అందమైన బంగభూమి.
మనం కోల్‌కతా వెళ్లడానికి ఏ రైలెక్కినా తిన్నగా తీసుకెళ్లి హౌరాలోనే ఆపుతారు. వాళ్లు దీనిని హావ్‌డా అనే పిలుస్తారు. కానీ మనకు అలవాటు కాబట్టి హౌరానే ఫాలో అయిపోదాం. బోలెడంత కంగాళీగా కనిపించే ఈ స్టేషన్ బయటకు వచ్చి చూడగానే కనిపిస్తాయి ఎల్లో కలర్ ట్యాక్సీలు.
ఒకటి… రెండు కాదు, ఏకంగా వందల్లో. అన్నీ అంబాసిడర్లే. అదేంటి మన రోడ్లమీద వెయ్యి కార్లలో ఒకటి కూడా అంబాసిడర్ కనిపించట్లేదు. ఇక్కడేమో అన్నీ అవే. నరసింహనాయుడు సినిమాలో సుమోలు లైను కట్టినట్టుగా ఎల్లో కలర్ ట్యాక్సీలన్నీ పెద్ద రైలుకన్నా పొడవుగా క్యూ కట్టి కనిపించాయి. ప్రీ పెయిడ్ బూత్‌లో బుక్ చేసుకుంటే మనం కోరిన చోటకు తీసుకెళ్తారు.
వందకు మూడో నాలుగో మారుతీలు… లేటెస్ట్ మోడల్ కార్లు కనిపిస్తాయి.. అవన్నీ దాదాపుగా ఏసీ కార్లు. ఎక్కువమాత్రం అంబాసిడర్లే ఉంటాయి. అంబాసిడర్లు ఈ రేంజిలో ఇక్కడే ఉండటానికి కారణం ఏమిటంటే ఈ డ్రైవర్లలో చాలామంది బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పొట్టకూటి కూసం ఇక్కడకు వచ్చినవారే. రోజుకు రూ. 300 నుంచి రూ. 400 మిగిలితే చాలని వీటిని నడుపుతూ జీవనం సాగిస్తుంటారు.
గవర్నమెంట్ కూడా వీళ్ల విషయంలో కాస్త చూసీచూడనట్టే పోతుంది. వీటికి తీసుకొనే ఛార్జీ కూడా ఆటోకన్నా కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఐదు, ఆరు కిలోమీటర్ల దూరానికి రూ. 100 నుంచి రూ. 150 వరకు అవుతుంది, అంతే! కలకత్తా సిటీలో ఏ రోడ్డుపై చూసినా ఆటోల టైపు మీటర్ పెట్టుకుని ఈ ఎల్లో అంబాసిడర్లు కుప్పలుకుప్పలుగా తిరుగుతూ కనిపిస్తాయి.
నో రెఫ్యూజల్ కథే వేరు..
ఎక్కిన తరవాత డు..డు..డుడుడుడుడు.. అంటూ వెళ్తుంటే ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్ రాకుండా ఉండదు. గ్యారంటీగా 80-90లలో మనం ఎక్కిన డొక్కు బస్సులు, ఆటోలు గుర్తు రాకుండా ఉండదు. ఇక్కడున్న చాలా ట్యాక్సీలపై ‘No Refusal’ అని కనిపించింది. ఇలా ఇంకెక్కడా ఉండదు. దీనివెనుక ఓ ఆసక్తికరమైన అంశం ఉంది.
కొన్నేళ్ల క్రితం కలకత్తాలో అంతా ట్యాక్సీవాలాల ఇష్టారాజ్యంగా ఉండేది. మీటర్ అడిగితే వేసేవాళ్లు కాదు.. మనం అడిగిన చోటకు కుదరదు అనేసేవారు. పదిమందిని అడిగితే చివరకు ఒకడు ఒప్పుకుని మనం అడిగిన చోటకు తీసుకెళ్లేవాడు. డబ్బులు కూడా భయంకరంగా డిమాండ్ చేసేవాళ్లు. ఇది జనాలకు విసుగు తెప్పించేసింది.
అప్పుడు కొంతమంది మంచి డ్రైవర్లు ‘No Refusal’ అని బోర్డుతో తిప్పడం మొదలుపెట్టారు. దాని అర్ధం అంటే ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా తాము తీసుకెళ్తాం అని. మీరు అడిగింది కాదని అనము అని దానర్ధం. తరవాత దానిని ఇంకొంతమంది ఫాలో అయిపోయారు. చివరకు గవర్నమెంట్ కూడా దీనిని తప్పనిసరి చేస్తూ చట్టం చేసింది.
‘No Refusal’ ఉన్నాక మీటర్ వేయకపోయినా, మనం అడిగిన చోటకు రావడం కుదరదు అన్నా మనం వాళ్లపై కేస్ పెట్టొచ్చన్నమాట. అప్పుడు పోలీసులు రియాక్ట్ అవుతారు. పాసింజర్ తీసుకెళ్లమన్న చోటకు కుదరదు అన్నాడంటే రూ. 3 వేలు ఫైన్ కట్టాలంటూ గవర్నమెంట్ మొదట్లో రూల్ పెట్టింది. తరవాత డ్రైవర్లంతా గొడవ పెట్టడంతో ఆ మొత్తం తగ్గించారు. కానీ కుదరదు అంటే మాత్రం రూల్ బ్రేక్ చేసినట్టే.
ఎట్టి పరిస్థితుల్లోనూ (చివరకు బంద్‌లు, ర్యాలీలు జరిగిన టైంలో కూడా) పాసింజర్‌కు ‘నో’ చెప్పము అని స్టాంప్ పేపర్‌పై రాసిచ్చి కమిట్ అయినవాళ్లే ‘No Refusal’ ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి అని 2013లో కోల్‌కతా కార్పొరేషన్ కండిషన్ పెట్టింది.
సాధారణంగా మన దగ్గర ‘No Parking’ బోర్డు దగ్గరే బళ్లన్నీ తీసుకొచ్చి పార్కింగ్ చేసేస్తుంటాం. పోలీసులు కూడా చూసీచూడనట్టే ఉంటారు. బెంగాల్‌లో ఈ ‘No Refusal’ కూడా అలాంటిదే.. అది ‘Always Refusal’ అంటూ కామెంట్ చేసినవాళ్లూ ఉన్నారు. అదీ ‘No Refusal’ కథ.
– అనన్య